రెజ్లర్ల ఆందోళన నుంచి తాను తప్పుకుంటున్నట్లు వచ్చిన వార్తలను కామన్ వెల్త్ గోల్డ్ మెడలిస్ట్ సాక్షి మాలిక్ ఖండించారు. ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మవద్దని, న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. దీనిపై ఆమె ఓ ట్వీట్ చేశారు. ఆందోళన నుంచి సాక్షి తప్పుకుని నార్తన్ రైల్వే లో తన ఉద్యోగంలో చేరబోతున్నారని కొద్దిసేపటి క్రితం వార్తలు వచ్చాయి.
రెజ్లింగ్ ఫెడరేషన్ అఫ్ ఇండియా ఛైర్మన్, పార్లమెంట్ సభ్యుడు బ్రిజ్ భూషణ్ తమను లైంగికంగా వేధించాడని, ఆయన్ను పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తూ రెజ్లర్లు ఆందోళన చేస్తోన్న సంగతి తెలిసిందే. వినీష్ ఫోగట్, సాక్షి మాలిక్, బజరంగ్ పూనియా, సంగీతా ఫోగట్, సత్యవర్త్ కడియన్, సోమ్వీర్ రాథీ ఈ నిరసనకు నేతృత్వం వహిస్తున్నారు. కాగా మే 28న పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవం సందర్భంగా రెజ్లర్లు అక్కడికి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు వారిని అడ్డుకున్నారు.
రెజ్లర్ల సమస్యపై స్పందించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా శనివారం రాత్రి షుమారు రెండు గంటలపాటు వారితో భేటీ అయ్యారు. ఈ భేటీకి సంబంధించి అధికారిక వివరాలు వెల్లడి కానప్పటికీ, ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని, ఆందోళన విరమించాలని హోం మంత్రి వారికి సూచించినట్లు తెలిసిది. ఈ భేటీ తర్వాత సాక్షి మాలిక్ మెత్తబడ్డారని, ఆమె ఉద్యోగంలో తిరిగి చేరుతున్నారని వార్తలొచ్చాయి. దీనిపై ఆమె వివరణ ఇచ్చారు.