Saturday, November 23, 2024
HomeTrending Newsతొలి ముస్లిం మహిళా ఐపీఎస్

తొలి ముస్లిం మహిళా ఐపీఎస్

Salima Ips Officer :  ఖమ్మం జిల్లాకు మరో ఘనత దక్కింది. తెలంగాణ రాష్ట్రంలోనే తొలి మహిళా ముస్లిం ఐపీఎస్‌ ను అందించిన కీర్తి జిల్లా సొంతం చేసుకుంది. అంతే కాదు.. ఖమ్మం జిల్లా నుంచి కూడా తొలి మహిళా ఐపీఎస్‌ అధికారిని ప్రజా సేవకు పంపిన మరో ఘనత కూడా ఈ జిల్లాకే దక్కడం విశేషం. వివరాల్లోకి వెళ్తే.. కేంద్ర ప్రభుత్వం నిన్న విడుదల చేసిన నాన్ క్యాడర్ ఐపీఎస్‌ పదోన్నతి జాబితాలో ఖమ్మానికి చెందిన షేక్ సలీమా ఐపీఎస్‌ గా పదోన్నతి పొందారు. ఈమె స్వగ్రామం చింతకాని మండలం కోమట్లగూడెం గ్రామం. లాల్ బహదూర్, యాకూబ్ బీ దంపతుల మొదటి సంతానమే సలీమా. తండ్రి ఖమ్మం లో ఎస్ఐ గా పని చేసి రిటైరయ్యారు. ఆమె విద్యాభ్యాసం అంతా ఖమ్మంలోనే సాగింది. ప్రాథమిక పాఠశాల పబ్లిక్ స్కూల్లో.. హై స్కూల్ సెంచరీ లో చదివారు. ఇంటర్మీడియట్ ప్రతిభ కాలేజీలో, డిగ్రీ న్యూ జనరేషన్ కళాశాలలో పూర్తి చేశారు. కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి ఎమ్మెస్సీ బయో టెక్నాలజీ లో పీజీ చేశారు. గ్రూప్ ఉద్యోగాలకు ప్రిపేరై 2007లో డీఎస్పీ గా ఎంపికయ్యారు. ఆదిలాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో డీఎస్పీ గా తొలి పోస్టింగ్ పొందారు. ఆ తరువాత అంబర్ పేట పీటీసీ వైస్ ప్రిన్సిపాల్ గా పని చేశారు. అడిషనల్ కమిషనర్ (అడ్మిన్) గా మాదాపూర్ లో పని చేశారు. ప్రస్తుతం రాచకొండ కమిషనరేట్ లో డీసీపీగా ఉన్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఐపీఎస్‌ల పదోన్నతి జాబితాలో చోటు సంపాదించుకుని తొలి మహిళా ముస్లిం ఐపీఎస్‌గా రికార్డు దక్కించుకున్నారు.

కుటుంబమంతా ప్రయోజకులే..

ఐపీఎస్‌గా పదోన్నతి పొందిన షేక్ సలీమా కుటుంబ సభ్యులందరూ ప్రయోజకులుగా స్థిర పడ్డారు. లాల్ బహదూర్, యాకూబ్ బీల నలుగురు సంతానం లో ఈమే పెద్ద. ఈమె తరువాత ఇద్దరు చెల్లెలు, ఒక తమ్ముడు ఉన్నారు. ప్రస్తుతం వీరంతా వివిధ రంగాల్లో ఉన్నత స్థాయిలో ఉద్యోగాలు చేస్తున్నారు. ఒక సోదరి జరీన సాఫ్ట్ వేర్ లో ఉద్యోగం చేస్తూ.. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ లో గ్రూప్ వన్ పరీక్ష రాసి మెయిన్స్ కు ఎంపికైంది. ఇంటర్వూలో అర్హత సాధిస్తే ఆమె కూడా ప్రభుత్వ సర్వీసు కు ఎంపికవుతారు. మరో చెల్లెలు మున్నీ కూడా గ్రూప్ పరీక్షల్లో ఎంపికై ఖైరతాబాద్ ఎం.వి.ఐ గా పని చేస్తున్నారు. తమ్ముడు ఖాసిమ్ హైదరాబాద్ కేర్ హాస్పిటల్ లో డాక్టర్ గా స్థిరపడ్డారు. సలీమా భర్త కూడా సాఫ్ట్ వేర్ రంగంలో ఉన్నారు. తమ కూతురు ఐపీఎస్‌గా ఎంపికవడం పట్ల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Also Read : పెన్సిల్వేనియా వర్సిటీ హెడ్ గా తెలుగు మహిళ

RELATED ARTICLES

Most Popular

న్యూస్