Samudrala Expertise In Story Dialogues Lyrics Made His Stamp On Film Industry :
తెలుగు తెరకు ఎంతోమంది కవులు .. రచయితలు విభిన్నమైన కథలను అందించారు. తమదైన ప్రత్యేకతను చాటుకుంటూ అశేష ప్రేక్షకులను అలరించారు. కొంతమంది రచయితలు కథలను అందించడంలో .. మరికొంతమంది మాటలు రాయడంలో .. ఇంకొంతమంది పాటలు రాయడంలో తమదైన నేర్పును ప్రదర్శిస్తూ అభినందనలు అందుకున్నారు. చాలా కొంతమంది మాత్రమే ఈ మూడింటిని స్పర్శించే ప్రయత్నం చేశారు. వాళ్లలో కథ .. మాటలు .. పాటలు రాయడంలో సమానమైన ప్రతిభను ఆవిష్కరించిన రచయితగా ‘సముద్రాల రాఘవాచార్య’ మాత్రమే కనిపిస్తారు.
గుంటూరు జిల్లా ‘పెదపులివర్రు’ గ్రామంలోని పండిత కుటుంబంలో సముద్రాల జన్మించారు. బాల్యం నుంచి సాహిత్య పరిమళాలను ఆస్వాదిస్తూనే ఆయన పెరిగారు. ఊహతెలిసిన దగ్గర నుంచే నాటకరచనపై ఆయన ఆసక్తిని పెంచుకున్నారు. ఆయన రాసిన నాటకాల ద్వారా కొందరు నటులు పేరు తెచ్చుకోగా, మరికొందరు ఆయనతో ప్రత్యేకంగా నాటకాలు రాయించుకుని వెళ్లి మరీ ప్రదర్శనలు ఇచ్చేవారు. తెలుగు .. సంస్కృత భాషల్లో ఆయనకిగల పట్టు, సాహిత్యంపై ఆయనకి గల అవగాహన కారణంగా ఆయనకి చెన్నైలోని ఒక పత్రిక ఆఫీసులో పనిచేసే అవకాశం వచ్చింది.
ఆ సమయంలోనే ఆయనకి దర్శక నిర్మాత బీఎన్ రెడ్డితో పరిచయమైంది. రచయితగా సముద్రాల సమర్ధతను బీఎన్ రెడ్డి గుర్తించారు. ‘కనకతార’ సినిమాతో తెలుగు తెరకి రచయితగా పరిచయమైన సముద్రాలను,’వందేమాతరం’ సినిమా నుంచి తన ఆస్థాన కథారచయితగా నియమించుకున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘భక్తపోతన’ సముద్రాలవారికి ఎంతో మంచి పేరు తెచ్చిపెట్టింది. ‘త్యాగయ్య’ .. ‘బాలరాజు’ .. ‘షావుకారు’ .. ‘దేవదాసు‘ సినిమాలతో ఆయన మాటల మాగాణిలా .. పాటల తోటమాలిలా మారిపోయారు. అసమానమైన రచనా పటిమకు అద్దమైనిలిచి నీరాజనాలు అందుకున్నారు.
సముద్రాల మంచి పండితుడు .. భాషపై పట్టు .. అక్షరాలపై అధికారం ఉన్నవారు. అయినా ఆయన ఎప్పుడూ కఠినమైన పదాలతో తన పాండిత్యాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేయలేదు. సినిమా అనేది సాధారణమైన ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడే వినోద సాధనమనే విషయం ఆయనకి తెలుసు. అందువల్లనే చాలా తేలికైన పదాలతోనే మాటలను .. పాటలను రాశారు.
‘దేవదాసు’ సినిమా కోసం ఆయన రాసిన ‘కుడిఎడమైతే పొరపాటు లేదోయ్’ .. ‘జగమేమాయ బ్రతుకే మాయ’ పాటలే అందుకు నిదర్శనంగా చెప్పుకోవాలి. ఆయన అక్షరాల అల్లిక పనితనానికి నిర్వచనంగా ఒప్పుకోవాలి.
సముద్రాలవారి సంభాషణల్లోను .. పాటల్లోను సహజత్వం తొణికిసలాడుతూ ఉంటుంది. సమయం .. సందర్భం .. పాత్రల స్వరూప స్వభావాలను బట్టి ఆయన రాసిన మాటలు .. పాటలు మనసును పెనవేసుకుపోతాయి. అందుకు నిదర్శనంగా ‘తెనాలి రామకృష్ణ’ సినిమాలోని ఒక సన్నివేశాన్ని చెప్పుకోవచ్చు. రాజభటులు రామకృష్ణుడిని తలవరకూ నిలువునా పాతరేసినప్పుడు, ఆయన ఆ స్థానంలో ‘గూని చాకలి’ని ఉంచి తప్పించుకుంటాడు. ఈ సన్నివేశంలో సముద్రాల వారు రాసిన మాటలు, జానపదులకు ఆయన ఎంత దగ్గరగా వెళతారనేది తెలియజేస్తాయి. ఇదే సినిమాలోని ‘చేసేది ఏమిటో చేసేయి సూటిగా వేసేయి పాగా ఈ కోటలో’ అనే పాట కూడా, సందర్భంలో ఇమిడిపోతూ సందేశాన్ని అందిస్తుంది.
పరిమళించడం పాట లక్షణం అని తెలిసిన సముద్రాల, పదాలపై పన్నీరు చిలకరించారు .. అక్షరాలపై అమృతాన్ని ఒలికించారు. ‘ఎవరి కోసం ఈ మందహాసం'(నర్తనశాల) .. ‘నిలువుమా నిలువుమా నీలవేణి'( అమరశిల్పి జక్కన్న) .. ‘హిమగిరి సొగసులు’ (పాండవ వనవాసం) .. ‘ప్రియురాల సిగ్గేలనే’ (శ్రీకృష్ణ పాండవీయం) వంటి పాటలు ఆయన కలం చేసిన విన్యాసానికి సాక్ష్యంగా కనిపిస్తాయి. ‘జననీ శివ కామినీ’ (నర్తనశాల) .. ‘జీవము నీవే కదా’ (భక్త ప్రహ్లాద) .. ‘శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా’ (లవకుశ) వంటి భక్తి గీతాలు, ఈనాటికీ గుడిలో గంటల మాదిరిగా గుండె గుమ్మంలో మ్రోగుతూనే ఉన్నాయి. ‘కల్యాణము చూతమురారండి’ (సీతారామ కల్యాణం)లోని పాట, ‘శ్రీరామ నవమి’ రోజున వినిపించని రామాలయం ఎక్కడా కనిపించదు.
ఇలా సముద్రాలవారు మూడు దశాబ్దాల పాటు తెలుగు సినిమాకి అపురూపమైన కథలతో అభిషేకం చేశారు. మనసు మైదానంలో పాటల పందిళ్లు వేసి, మాటల తోరణాలు కట్టారు. సాంఘిక .. జానపద .. పౌరాణిక .. చారిత్రక సినిమాలను, తన ప్రతిభాపాటలవాలతో ప్రభావితం చేశారు. మాటలు రాయడమనేది మాట్లాడటమంత తేలిక కాదు. పాటలు రాయడమనేది పాడుకోవడమంత సుళువూ కాదు. అయినా కథారచనతో పాటు ఈ రెండు పనులను ఆయన చకచకా చేసేస్తూ ఉండేవారు. అందువల్లనే ‘అంతా మీరే చూసుకోండి’ అంటూ అప్పట్లో ఆయనకి ప్రాజెక్టులను అప్పగించేవారు. ఇక పౌరాణిక సంబంధమైన కథలు .. పాత్రల విషయంలో ఎవరికి ఎలాంటి సందేహాలు వచ్చినా, తీరిక లేకపోయినా తీర్చే పెద్ద దిక్కు ఆయనే.
ఇలా ఉద్యోగం కోసం చెన్నై వచ్చిన సముద్రాల చిత్రపరిశ్రమలో అడుగుపెట్టి, కథారథంపై మూడు దశాబ్దాల పాటు తిరుగులేని ప్రయాణాన్ని కొనసాగించారు. పెద్ద పెద్ద సంస్థలతో రచయితగా ఒప్పందాలు చేసుకుంటూ, ప్రతిభావంతులలైన దర్శకులతో కలిసి పనిచేశారు. ఆయన తయారు చేసిన కథలు .. సినిమాలుగా అఖండ విజయాలను అందుకున్నాయి. ఆయన రాసిన మాటలకు .. పాటలకు ఆయుష్షు ఎక్కువ. నేటికీ అవి తమ ఉనికిని చాటుతూనే ఉన్నాయి. ఉల్లాసాన్నీ .. ఉత్సాహాన్ని పంచుతూనే ఉన్నాయి. కొన్ని సినిమాలకు దర్శక నిర్మాతగా కూడా వ్యవహరించిన సముద్రాల, తెలుగు సినిమా వైభవానికి తనవంతు కృషి చేశారు. మాటకు .. పాటకు అంకితమైన ఆ మహర్షి జయంతి నేడు. ఈ సందర్భంగా మనసారా ఓ సారి ఆయనను స్మరించుకుందాం! ఆయన అందించిన మధురమైన మాటలను .. మనోహరమైన పాటలను మనసు గదిలో భద్ర్రంగా దాచుకుందాం!!
(సముద్రాల జయంతి ప్రత్యేకం)
— పెద్దింటి గోపీకృష్ణ
Also Read : దేశం బాగుపడాలంటే ప్రజలు బాగుండాలి