Friday, September 20, 2024
Homeసినిమాఅలనాటి జగదేక సుందరి.. సరోజా దేవి

అలనాటి జగదేక సుందరి.. సరోజా దేవి

Saroja Devi- Synonym of beauty and acting: తెలుగు తెరకి అందం .. అభినయం కలగలిసిన కథానాయికలు ఎంతోమంది పరిచయమయ్యారు. వాళ్లందరిలో ఎవరి ప్రత్యేకత వారిది. సావిత్రి నిండుదనం .. మున నాజూకుదనం .. కృష్ణకుమారి చిరుమందహాసం ఆనాటి ప్రేక్షకుల మనసులను గాఢంగా పెనవేసుకుపోయాయి. నటన పరంగా .. గ్లామర్ పరంగా గట్టి పోటీ ఉన్న ఆ సమయంలో తనదైన ప్రత్యేకతను చాటుకున్న కథానాయికగా బి.సరోజాదేవి కనిపిస్తారు. విశాలమైన కళ్లతో ఆమె చేసిన హావభావ విన్యాసానికి అప్పట్లో మనసులను అప్పగించనివారు లేరనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

బి.సరోజాదేవి పేరు వినగానే ‘జలకాలాటలలో’ అంటూ ‘జగదేకవీరుని కథ’ సినిమాలోని పాట కళ్లముందు కదలాడుతుంది. ‘చిటపట చినుకులు  పడుతూ ఉంటే’ అనే పాట మనసు పొరలపై తేలుతుంది. ఆ పాటల్లో ఆమె చురుకుదనానికీ .. చలాకీ దనానికి పట్టుబడిపోనివారంటూ ఉండరు. ఆమె ముద్దు ముద్దు మాటలకు మురిసిపోని వాళ్లంటూ ఉండరు. బెంగుళూరులో పుట్టి పెరిగిన సరోజాదేవి, జమున మాదిరిగానే చాలా చిన్నవయసులోనే వెండితెరకి పరిచయమయ్యారు.

Saroja Devi

ఆమె తండ్రికి మొదటి నుంచి కూడా నాటకాలు అంటే ఇష్టం. అందువలన ఆయన తన కూతురును నటిగా చూడాలని అనుకున్నారు. అలా తండ్రి ప్రోత్సాహంతోనే సరోజాదేవి స్టేజ్ పైకి వెళ్లారు. ఒక వేదికపై ఆమెను చూసిన ప్రముఖ కన్నడ దర్శక నిర్మాత హొన్నప్ప భాగవతార్, తన సినిమా ‘మహాకవి కాళిదాస’లో కథానాయికగా అవకాశం ఇచ్చాడు .. అప్పుడు ఆమె వయసు 13 ఏళ్లు మాత్రమే. అలా ఆమె కన్నడ సినిమా పరిశ్రమకు పరిచయమయ్యారు. తెలుగులో ‘పెళ్లి సందడి’ సినిమాతో తొలి అవకాశం దక్కినప్పటికీ, ముందుగా విడుదలైంది మాత్రం ‘పాండురంగ మహాత్మ్యం’. 

తెలుగులో నేరుగా ఎన్టీఆర్ .. ఏఎన్నార్ లతో నటించేసిన సరోజాదేవికి ‘పెళ్లి కానుక’ సినిమా ఎంతో పేరు తెచ్చిపెట్టింది. సరోజాదేవి అందాన్ని .. అభినయాన్ని ఒక రేంజ్ ఆవిష్కరించిన సాంఘిక చిత్రం ఇదేనని చెప్పాలి. సావిత్రి .. జమున .. కృష్ణకుమారి వీళ్లంతా తెలుగు చాలా బాగా మాట్లాడతారు. వాళ్ల వాయిస్ కూడా చాలా బాగుంటుంది. సరోజాదేవి తెలుగులో కన్నడ యాస ఉండటం వలన ఆమెకి మైనస్ కావొచ్చునని అప్పట్లో అంతా అనుకున్నారు. కానీ అలా ఆమె యాసలో మాట్లాడటమే ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసింది.

ఈ సినిమాతో సరోజాదేవి అభిమానుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. అప్పట్లో అమ్మాయిలంతా రెండు జెడలు వేసుకుని ఆమె స్టైల్ ను అనుకరించేవారు. కనురెప్పలు టపటపలాడిస్తూ .. చకచకా హావభావాలు మార్చేస్తూ .. కెమెరాకు దొరకనంత చలాకీగా ఉండటమే ఆమె ప్రత్యేకతగా మారిపోయింది. ‘జగదేక వీరుని కథ’లో దేవేంద్రుడి కూతురి పాత్రలో ఆమెను చూసిన ప్రేక్షకులు, దేవకన్యలు ఇలాగే ఉంటారేమోనని అనుకున్నారు. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ చూసినవారు శ్రీదేవిని గురించి ఎంతగా చెప్పుకున్నారో, ‘జగదేకవీరుని కథ’ చూసినవారు సరోజాదేవి గురించి అంతలా చెప్పుకున్నారు.

 

ఇక ‘శ్రీకృష్ణార్జున యుద్ధము’ సినిమా సరోజాదేవి అందానికీ .. అభినయానికి కొలమానంగా నిలిచిందనే చెప్పాలి. సుభద్రగా  అటు కృష్ణుడికి .. ఇటు అర్జునుడికి నచ్చజెప్పలేక సతమతమయ్యే పాత్రలో ఆమె అద్భుతంగా నటించారు. నాయిక ప్రధానమైన ‘శకుంతల’ సినిమా కూడా ఆమె కెరియర్లో చెప్పుకోదగిన సినిమాగా నిలిచింది. అలాగే ‘అమరశిల్పి జక్కన్న’ సినిమా కూడా ఆమె అభినయానికి పట్టం కట్టేదే. ‘మంచి చెడు’ .. ‘దాగుడు మూతలు’ .. ఇలా ఒకటేమిటి? అప్పట్లో సరోజాదేవి ఏ సినిమాలో ఉంటే ఆ సినిమా హిట్ అనే పేరు వచ్చేసింది.

ఒక వైపున ఎన్టీఆర్ తోను .. మరో వైపున ఏఎన్నార్ తోను ఆమె చేశారు. ఇక ఆ ఇద్దరూ కలిసి నటించిన సినిమాల్లోను నటించారు. తెలుగులో వరుస సినిమాలలో చేస్తూనే. తమిళ .. కన్నడ సినిమాల్లోను ఆమె తన జోరు చూపించారు. అడపా దడపా హిందీలోను నటించారు. తెలుగులో ఎన్టీఆర్ .. ఏఎన్నార్ లతో ఎక్కువగా చేసిన ఆమె, తమిళంలో ఎంజీఆర్ .. శివాజీ గణేశన్ .. జెమినీ గణేశన్ తో తెరపై సందడి చేశారు. అలాగే హిందీలో దిలీప్ కుమార్ .. సునీల్ దత్ .. రాజేంద్ర కుమార్ తో కలిసి కనువిందు చేశారు. 

వెండితెరపై కొన్ని దశాబ్దాల పాటు తనదైన ముద్ర వేసిన సరోజాదేవిని ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేరు. అప్పట్లో ఆమె చేసిన కొన్ని పాత్రలను చూస్తే, ఆమె తప్ప మరొకరు ఆ పాత్రలను అంత బాగా చేయలేరేమోనని అనిపిస్తూ ఉంటుంది. తెలుగు తెరపై అందాల కథానాయికలు ఎంతమంది ఒక వెలుగు వెలిగినప్పటికీ, వాళ్లందరి మధ్యలో ఆమె స్థానం ప్రత్యేకంగా కనిపిస్తూనే ఉంటుంది. తన ప్రతిభకు కొలమానంగా పద్మశ్రీ .. పద్మభూషణ్ అందుకున్న సరోజాదేవి పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేద్దాం.

(బి.సరోజా దేవి జన్మదిన ప్రత్యేకం)

— పెద్దింటి గోపీకృష్ణ

Also Read : విలక్షణ నటుడు జగ్గయ్య

RELATED ARTICLES

Most Popular

న్యూస్