Friday, April 26, 2024
Homeసినిమావిలక్షణ నటుడు జగ్గయ్య

విలక్షణ నటుడు జగ్గయ్య

Jaggayya : తెలుగు తెరకి తొలినాళ్లలో పరిచయమైన వాళ్లంతా కూడా రంగస్థలం నుంచి వచ్చినవారే. అప్పట్లో ఆంధ్ర ప్రాంతంలో నాటక సమాజాలు ఎక్కువగా ఉండేవి. ఆయా నాటక సమాజాలు అనేక గ్రామాలకు తిరుగుతూ ప్రదర్శనలు ఇస్తూ ఉండేవి. ఆ నాటకాలలో మంచి పేరు తెచ్చుకున్నవారు, సహజంగానే సినిమాల పట్ల ఆసక్తిని కనబరిచేవారు. నాటకాల నుంచి సినిమాల దిశగా అడుగులు వేస్తూ, అప్పట్లో మద్రాసు నగరానికి చాలామంది చేరుకున్నారు. అలాంటి నటులలో కొంగర జగ్గయ్య ఒకరు. తెనాలి సమీపంలోని ‘మోరంపూడి’లో ఆయన జన్మించారు. 

ఊహ తెలిసిన నాటి నుంచే జగ్గయ్య నాటకాలు .. సాహిత్యం .. చిత్రలేఖనంపై ఆసక్తిని చూపేవారు. స్నేహితులతో కలిసి నాటకాలు ప్రదర్శించేవారు. సాహిత్యం పట్ల గల ఆసక్తి కారణంగానే, ఆ తరువాత కాలంలో ఆయన రవీంద్రనాథ్ ఠాగూర్ ‘గీతాంజలి’ని ‘రవీంద్ర గీత’ పేరుతో తెలుగులోకి అనువదించేలా చేసింది. నాటకాలు వేసే సమయంలోనే ఆయన వాయిస్ కి అభిమానులు ఉండేవారు. అద్భుతమైన ఆ వాయిస్ కారణంగానే ఆయనకి ఆల్ ఇండియా రేడియోలో పనిచేసే అవకాశం లభించింది. నాటకాలు ఆడే సమయంలోనే ఆయనకి  త్రిపురనేని గోపీచంద్ తో సాన్నిహత్యం ఏర్పడింది.

Actor Jaggayya

రచయిత అయిన త్రిపురనేని గోపీచంద్ మద్రాసు వెళ్లి అక్కడి సినిమా రంగంలో కుదురుకుంటున్న రోజులవి. ఆ సమయంలోనే ఆయనకి ‘ప్రియురాలు’ సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం లభించింది. దాంతో ఆయన కథానాయకుడి పాత్ర కోసం జగ్గయ్యను పిలిపించారు. అలా ఆ సినిమాతో ఆయన 1952లో తెలుగు తెరకి పరిచయమయ్యారు. అయితే ఆ సినిమాతో పాటు ఆ తరువాత చేసిన సినిమా కూడా పరాజయంపాలు  కావడంతో, అవకాశం వస్తే హీరోగా చేద్దాం .. లేదంటే ముఖ్యమైన పాత్రలను చేస్తూ ముందుకు వెళదామని జగ్గయ్య  నిర్ణయించుకున్నారు.

అలా చాలా త్వరగా .. తెలివిగా జగ్గయ్య తీసుకున్న నిర్ణయం, ఆయన ఇక వెనుదిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా చేసింది. నాటకాలలో ఉన్న అపారమైన అనుభవం .. మంచి చదువు .. సాహిత్యం పై పట్టు .. స్పష్టమైన ఉచ్చారణ .. కంగుమంటూ మ్రోగే వాయిస్ .. ఇవన్నీ ఆయనకి సహజమైన అలంకారాలుగా ఉండేవి. అందువలన ఇతర ఆర్టిస్టులకు ఉన్నట్టుగా జగ్గయ్యకు ప్రత్యామ్నాయంగా ఎవరూ కనిపించేవారు కాదు. ఫలానా ఆర్టిస్టు అందుబాటులో లేకపోతే ఫలానా ఆర్టిస్టును తీసుకుందామని ముందుగానే రాసుకుంటారు. జగ్గయ్యకి బదులుగా తీసుకోవలసి వస్తే ఎవరిని తీసుకోవాలి? అనే ప్రశ్నకి  ఆయన ఉన్నంతవరకూ సమాధానం దొరకలేదు .. అదీ జగ్గయ్య ప్రత్యేకత. 

Actor Jaggayya

అప్పట్లో ఆయన ఎన్టీఆర్ .. ఏఎన్నార్ .. ఎస్వీఆర్ .. కృష్ణ .. శోభన్ బాబు కాంబినేషన్లో ఎన్నో సినిమాలు చేశారు. ఎలాంటి హావభావాలనైనా ఆయన తన కళ్లతోనే పలికించేవారు. సందర్భాన్ని బట్టి .. రసాన్ని బట్టి హెచ్చు తగ్గులు చూపుతూ తన స్వరంతో విన్యాసాలు చేసేవారు. సెట్లో జగ్గయ్య ఉంటే ఆయన ఎదురుగా నిలబడి డైలాగ్స్ చెప్పడానికి చాలా మంది జంకేవారని ఒకానొక సందర్భంలో ఏఎన్నార్ చెప్పారు. అంతగా ఆయన వాయిస్ .. సన్నివేశాలను మరోస్థాయికి తీసుకుని వెళ్లేది. జగ్గయ్య వాయిస్ లో దర్జా .. దర్పం .. హోదా ఇవన్నీ ప్రతిఫలించేవి. అందువలన ఎక్కువగా ఆయన ఆ తరహా పాత్రలు చేస్తూ వెళ్లారు.

హుక్కా పీలుస్తూ .. జమీందారు లుక్ తో రాజసం చూపిస్తూ ప్రేక్షకులతో ఔరా అనిపించుకున్న నటులలో. ఎన్టీఆర్ .. ఏఎన్నార్ .. ఎస్వీఆర్ .. గుమ్మడి తరువాత స్థానం జగ్గయ్యకి మాత్రమే దక్కుతుంది. తెలుగు తెరపై ఒక వైపున నాగభూషణం తరహా విలనిజం .. మరో వైపున రాజనాల తరహా విలనిజం రాజ్యమేలుతున్నప్పుడు, స్టైలీష్ విలనిజానికి శ్రీకారం చుట్టింది జగ్గయ్యేనని చెప్పాలి. నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలను కూడా డీసెంట్ గా చేయడం వల్లనే, ఆయన హీరోగా కనిపించినా .. హీరోతో సమాంతరమైన పాత్రలను చేసినా, హీరోయిన్ తో కలిసి పాటలు పాడుకున్నా వ్యతిరేకత వ్యక్తం కాలేదు.

జగ్గయ్య డ్యూయెట్లు పాడింది తక్కువ సినిమాలలోనే అయినా, ఆ పాటల్లో చాలావరకూ సూపర్ హిట్లు ఉండటం విశేషం. భలేమంచి రోజు .. పసందైన రోజు (జరిగిన కథ) ఇదేమి లాహిరి .. ఇదేమి గారడి (ఈడు జోడు) ఓ పోయే పోయే చినదాన (ఉయ్యాల జంపాల) నీలికన్నుల నీడలలోన (గుడిగంటలు) ఓహో గులాబి బాల (మంచి మనిషి) చిగురాకుల ఊయలలో (కానిస్టేబుల్ కూతురు)  అందాల ఈ రేయి (ఆమె ఎవరు) సినిమాలలోని పాటలు ఆ జాబితాలో కనిపిస్తాయి. ఈ నాటికీ ఆ పాటలు మకరందం అద్దిన చేతులతో మనసు తలుపు తడుతూనే ఉంటాయి.

జగ్గయ్య పోషించిన విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలు ఎన్నో .. ఎన్నెన్నో. ‘ఆత్మబలం’ సినిమాలో మానసిక స్థితి సరిగ్గా లేని కుమార్ పాత్రలో .. ‘గుడి గంటలు’లో తన ప్రేమను స్నేహితుడి కోసం త్యాగం చేసే హరి పాత్రలో .. ‘డాక్టర్ చక్రవర్తి’ సినిమాలో ఆకాశ రామన్న ఉత్తరాన్ని నమ్మి, భార్యను అనుమానించే రవీంద్ర పాత్రలో .. ‘అల్లూరి సీతారామరాజు’లో రూథర్ ఫర్డ్ పాత్రలోను ఆయన నటనను చూసి తీరవలసిందే.

విలక్షణ నటుడిగా కొన్ని దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరించిన జగ్గయ్య, ఆ తరువాత రాజకీయాలలోను చురుకైన పాత్రను పోషించి, తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలను రాసుకున్న ఆయన, తన నటనకు కొలమానంగా పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ రోజున ఆయన జయంతి. ఈ సందర్భంగా ఆ కళావాచస్పతిని మనసారా ఓ సారి స్మరించుకుందాం.

(జగ్గయ్య జయంతి ప్రత్యేకం)

— పెద్దింటి గోపీకృష్ణ

Also Read : పద్మశ్రీ అందుకున్న తొలి తెలుగు నటుడు

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్