కాళిదాసు రాసిన ‘అభిజ్ఞాన శాకుంతలం’ చదువుతూ ఉంటేనే, అందుకు సంబంధించిన దృశ్యాలు పాఠకుల కళ్లముందు కదలాడుతూ ఉంటాయి. ఒక సినిమా చూస్తున్నట్టుగా అనిపించే రచనను ఆ రోజుల్లోనే ఆవిష్కరించిన మహాకవి ఆయన. ఈ కథ తెలిసినవారు ఈ జనరేషన్ లో తక్కువ మందే ఉండొచ్చు. అందువల్లనే ఈ జనరేషన్ వారికి ఈ కథ తెలియాలి అనే ఉద్దేశంతో ఈ సినిమాను రూపొందించినట్టుగా ప్రమోషన్స్ లో గుణశేఖర్ చెబుతూ వచ్చారు.
అయితే గతంలో మాదిరిగా ఇప్పటి సినిమాల్లో పక్షులను .. జంతువులను చూపించడానికి అవకాశం లేని పరిస్థితి. అందువలన వాటి విషయంలో పూర్తిగా గ్రాఫిక్స్ పైనే ఆధారపడవలసి ఉంటుంది. స్మార్ట్ ఫోన్స్ ఉన్నవారికి హాలీవుడ్ సినిమాలు అందుబాటులోకి వచ్చిన ఈ కాలంలో , గ్రాఫిక్స్ తో వాళ్లని ఒప్పించడమనేది కత్తిమీద సాములాంటిది. అలాంటి గ్రాఫిక్స్ విషయంలో ప్రేక్షకులకు అసంతృప్తిని కలిగించిన సినిమానే ‘శాకుంతలం’.
గుణశేఖర్ ఈ సినిమాను చాలా నిదానంగా నడిపించాడనే విమర్శలు నిన్న చాలామంది నోట వినిపించింది. కానీ నిజంగానే ఈ కథ నిదానంగానే నడుస్తుంది. ఎందుకంటే నాయిక వైపు నుంచి ప్రేమ .. విరహం .. వియోగం … వాటి తాలూకు హావభావాలను చకచకా చూపించడానికి అవకాశం లేదు. ఇక దృశ్యాల పరంగా చూసుకుంటే, గుణశేఖర్ ఈ సినిమాను నిజంగానే విజువల్ వండర్ గా తీర్చిదిద్దారు. ప్రతి ఫ్రేమ్ కూడా కళ్లు పెద్దవి చేసి చూసేవిగానే ఉంటాయి. ఈ విషయంలో గుణశేఖర్ కి వంకబెట్టలేం.
ఈ సినిమాకి మణిశర్మ అందించిన సంగీతం .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రధానమైన బలంగా నిలిచాయని చెప్పొచ్చు. ఆయన అందించిన స్వరాలు ఆ కాలానికి .. ఆ కథకి .. ఆ సందర్భాలకు అతికినట్టుగా సరిపోయాయి. కొన్ని సందర్భాల్లో మాత్రం ఈ జనరేషన్ కి తగిన బీట్స్ ను ఆయన లింక్ చేశారు. ఫొటోగ్రఫీ .. కొరియోగ్రఫీ కూడా ఆకట్టుకుంటాయి. ఎటొచ్చి సమంత లుక్ .. ఆమె కాస్ట్యూమ్స్ సెట్ కాలేదని అనిపిస్తుంది. అలాగే శివబాలాజీ .. మధుబాల ఎంపిక సరైనది కాదనిపిస్తుంది. విజువల్ వండర్ గానే ఈ సినిమాను ఎంజాయ్ చేయాలనుకుంటే .. అసలు కథేమిటో తెలుసుకోవాలనుకుంటే ఈ సినిమాకి వెళ్లొచ్చు.