Monday, January 20, 2025
HomeTrending NewsYSRTP: తెలంగాణలో షర్మిల విఫల రాజకీయం

YSRTP: తెలంగాణలో షర్మిల విఫల రాజకీయం

వైఎస్ షర్మిల రాజకీయ భవితవ్యం తీవ్ర అయోమయంలో పడింది. తాను తెలంగాణ కోడలినని, ఇక్కడి  రాజకీయాల్లో చక్రం తిప్పుతానని రెండేళ్ళ క్రితం వైఎస్సార్ తెలంగాణ పార్టీ (YSRTP)పెట్టి క్షేత్రస్థాయిలో ఉద్యమాలు, పాదయాత్రతో హడావుడి చేశారు. రాష్ట్రమంతా పర్యటించిన షర్మిల అంతో ఇంతో ప్రజాభిమానం కూడబెట్టుకున్నారు. సిఎం కెసిఆర్ పై పదునైన విమర్శలు చేస్తూ…మంత్రి కేటిఆర్, హరీష్ రావులు టార్గెట్ గా ఆందోళనలు నిర్వహించారు.

సిఎం కేసిఆర్ వదిలిన బాణం అని, కాదు మోడీ సూచలనతోనే పార్టీ పెట్టారనే విమర్శలు ఎదుర్కొన్నా వాటిని పట్టించుకోకుండా ప్రజల్లోకి వెళ్ళారు.  ఆమె రంగ ప్రవేశంచేసే నాటికి దక్షిణ తెలంగాణలో మాత్రమే ప్రభావం ఉంటుందని భావించారు. ప్రజా సమస్యల ప్రస్తావన…పాదయాత్రతో ఉత్తర తెలంగాణలో కూడా ప్రజలు ఆదరించారు. పాలేరు నుంచి పోటీకి దిగుతున్నట్లు ప్రకటించి అక్కడ ఓ ఇంటి నిర్మాణం కూడా మొదలుపెట్టారు.

Ys Sharmila Prajaprasthanam Karimnagar

అయితే కర్ణాటక ఎన్నికల ఫలితాల తరువాత వేసిన కొన్ని తప్పటడుగులు షర్మిల రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్ధకం చేశాయి. కర్ణాటక ఉపముఖ్యమంత్రి డికి శివకుమార్ తో సమావేశం, కాంగ్రెస్ లో తన పార్టీ విలీన ప్రతిపాదనకు  ఒకే చెప్పడం వెంట వెంటనే జరిగిపోయాయి. భర్త అనిల్ తో కలిసి పలుమార్లు ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పెద్దలను, ఆ తర్వాత సోనియా, రాహూల్ లతో కూడా సమావేశం.. ఇవన్నీ చూస్తే ఇక విలీన ప్రకటనే తరువాయి అన్న భావన కలిగింది. పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డిపై ఆమె చేసిన వ్యాఖ్యలు, తన రాజకీయ ఎత్తుగడల గురించి పార్టీలో మరే ఇతర నేతలతో కూడా సంప్రదించకపోవడం లాంటి నిర్ణయాలతో విమర్శలు మూటగట్టుకున్నారు.

ఇదే సమయంలో కర్ణాటక ఫలితం, బండి సంజయ్ తొలగింపుతో బిజెపిలో వచ్చిన నైరాశ్యాం… తదితర కారణాలతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బి.ఆర్.ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదిగింది. ఈలోపు షర్మిల  విలీన ప్రయత్నాలు తెలంగాణ కాంగ్రెస్ నేతలకు మింగుడు పడలేదు. తెలంగాణ వ్యతిరేకిగా ముద్రపడ్డ వైఎస్ కూతురుగా… ఆమె రాక ఎన్నికలలో ఏమాత్రం మేలు చేయబోదని, పైగా గత ఎన్నికల్లో చంద్రబాబుతో పొత్తు అంశాన్ని అస్త్రంగా మలచుకున్న కేసిఆర్ ఈసారి వైఎస్-షర్మిల అంశంతో సెంటిమెంట్ రగిలిస్తే అది పార్టీ విజయావకాశాలను దెబ్బతీస్తుందని అధిష్టానం వద్ద మొరపెట్టుకున్నారు.

క్షేత్ర స్థాయి పరిస్థితులపై సర్వే చేయించిన కాంగ్రెస్ అధిష్టానం…. కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపుతామని, ఏపీలో పార్టీ వ్యవహారాలు చూడాలని షర్మిలకు నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. స్వతహాగా మొండి మనిషని పేరుపడ్డ ఆమె ఈ ప్రతిపాదనకు తిరస్కరించారు. తనకు పాలేరుతో పాటు, మొత్తం 10 నుంచి 15 వరకూ తన మనుషులకు టిక్కెట్లు ఇవ్వాలని పట్టుపట్టారు. దీంతో కాంగ్రెస్ చేతులెత్తేసింది.

రాష్టంలోని అన్ని స్థానాల్లో YSRTP బరిలోకి దిగుతుందని, తాను పాలేరు నుంచి పోటీ చేస్తానని షర్మిల ప్రకటించారు. అవసరమైతే మిర్యాలగూడ నుంచి తన తల్లి విజయమ్మ రంగంలో ఉంటారన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్న లక్ష్యంతోనే కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్దామని అనుకున్నామని, కానీ ఆ పార్టీ నుంచి సానుకూల సంకేతాలు రాలేదని వెల్లడించారు.

పార్టీ గుర్తుగా ఫ్యాన్ కేటాయించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేస్తే నిరాశే ఎదురైంది. ఆదాయ పన్నుల వివరాలు సరిగా లేకపోవటంతో ఎన్నికల సంఘం లైట్ గా తీసుకుంది. అంటే ఇన్నాళ్ళు ఎవరితో ఒకరితో పొత్తు కోసమే ఎత్తుగడగా.. షర్మిల పాదయాత్ర చేశారా?

తాజా రాజకీయ పరిణామాలు పరిశీలిస్తే.. పోటీ చేయటం అనేది నలుగురితో నారాయణ అన్న చందంగానే ఉంది. పాలేరులో ఇద్దరు బలమైన ప్రత్యర్థులు… కందాల ఉపేందర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డిల మధ్య షర్మిల తన ఉనికి ఏమేరకు చాటుకుంటారనేది వేచి చూడాలి. షర్మిలకు కనీసం డిపాజిట్ కూడా దక్కకపోతే తెలంగాణ రాజకీయాల్లో ఓ విఫల రాజకీయ నాయకురాలిగా మిగిలిపోవాల్సి వస్తుంది.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్