Friday, November 22, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంకొడిగడుతున్న ఇంజనీరింగ్ చదువులు

కొడిగడుతున్న ఇంజనీరింగ్ చదువులు

Engineering seats in India hit 10-years low

ఏటా సగటున భారత దేశం పాతిక లక్షల మంది ఇంజనీర్లను తయారు చేస్తోంది. వీరిలో క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఉద్యోగం దొరకబుచ్చుకునే వారు పది శాతానికి మించి ఉండరు. మిగతావారికి ఎప్పటికో ఒకప్పటికి ఉద్యోగాలు రావచ్చు. రాకపోవచ్చు. చదివిన ఇంజనీరింగ్ కొలువు రాక మరేదో రంగంలో స్థిరపడవచ్చు.

కోవిడ్ కు ముందు వరకు నేను జర్నలిజం స్కూళ్లలో గెస్ట్ లెక్చరర్ గా పాఠాలు చెప్పేవాడిని. మొదటి ఇంట్రడక్షన్ క్లాసులో ఎవరెవరు ఏమేమి చదివి వచ్చారో? ఏయే నేపథ్యంతో వచ్చారో? పరిచయం చేసుకోవాలని అడిగేవాడిని. డెబ్బయ్ అయిదు మందిలో సగం మంది ఇంజనీరింగ్ చదివిన వారే ఉంటున్నారు. ఇంజనీరింగ్ చదివిన వారు జర్నలిజంలోకి రాకూడదని ఏమీ రూల్ లేదు. అక్షరం ముక్క చదవని వారు జర్నలిజంలోకి రావడంతో పోలిస్తే…ఇంజనీర్లు జర్నలిస్టులు కావడాన్ని కళ్లకద్దుకుని ఆహ్వానించాల్సిందే.

ఒకానొకనాడు రాఘవేంద్ర రావు బి ఏ చదివితే…అదొక విశేష విద్యా సంపదగా పేరు చివర పేరులో కలిసి సగౌరవంగా దశాబ్దాలపాటు ఉండిపోయింది. ఒకప్పుడు బి ఏ, బి కామ్, బి ఎస్సి ల్లో బి ఎస్సి తక్కువ ఏ కామ్ లు ఎక్కువ ఉండేవి. డాక్టర్, ఇంజనీరింగ్ చదువులు మరీ తక్కువ. వైద్య విద్య ఇప్పటికీ చాలా తక్కువే. దానికి కారణాలు తెలిసినవే. చాలా ఖరీదు. ప్రయివేటు మెడికల్ కాలేజీలో డిగ్రీకి కోటి, పి జి కి రెండు కోట్ల దాటి డొనేషన్లు కట్టాలి. జూ డా…హౌస్ సర్జన్…పి జి…అన్నీ అయ్యేసరికి సబ్ సూపర్ స్పెషాలిటీ ఎదురు చూస్తూ ఉంటుంది. మొత్తమ్మీద పదేళ్లు వైద్యం చదివి బయటికి వచ్చేసరికి సగం ఆయుస్సు అయిపోయి ఉంటుంది. ఇంతా చేస్తే అరవై వేల నెల జీతానికి కార్పొరేట్ ఆసుపత్రుల్లో వెట్టి చాకిరితో సరిపెట్టుకోవాల్సి రావచ్చు. సొంతంగా ఆసుపత్రి పెట్టాలంటే కోట్లకు కోట్లు మూలుగుతూ ఉండాలి. అందరికీ సాధ్యం కాదు.

దాంతో అందరికీ తేరగా దొరుకుతున్నది ఇంజనీరింగే. పైగా ఏమి చదివారు అని అడిగితే ఎం ఏ, ఎం బి ఏ, ఎం ఎస్ సి అని పేలవంగా చెప్పుకోవడం కంటే టక్ చేసుకుని బి టెక్, ఎం టెక్ అని చెప్పుకోవడంలో ఆ కిక్కే వేరప్పా. ఎం టెక్ ఎలెక్ట్రికల్ చదివిన విద్యార్థి ఇంట్లో కరెంట్ ఫీజ్ పొతే, చిటికెలో ఆ ఫీజ్ ఎందుకు మార్చలేకపోతున్నాడు అన్నది సమాధానం లేని ప్రశ్న. ఎలెక్ట్రానిక్స్ బి టెక్ పాసయిన ఇంజనీరు ఇంట్లో టీ వీ కి కేబుల్ వైర్ ఎందుకు బిగించలేకపోతున్నాడో ఇంజనీరింగ్ కే అంతుబట్టని విషయం.

పాతికేళ్ల కాలగతిలో ఊళ్లల్లో ఏది కోళ్ల ఫారమో, ఏది ఇంజనీరింగ్ కాలేజీనో అర్థం కావడం లేదు. రెండిటి మధ్య అభేదం బహుశా ఇంజనీరింగ్ అద్వైతం కావచ్చు. నెమ్మదిగా ఆ ఇంజనీరింగ్ లో కూడా కంప్యూటర్ సైన్స్, ఐ టీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాత్రమే చదవదగ్గవి అయి, మెకానికల్, ఎలెక్ట్రికల్, ఎలెక్ట్రానిక్స్ ఎందుకూ కొరగానివి, అంటరానివి అయ్యాయి. ఇక సివిల్ చదివే వారిని ఓదార్చే దేవుడే లేడు.

సి ఎస్, ఏ ఐ చదవాలి. జి ఆర్ ఈ, టోఫెల్ రాయాలి. ఐ ట్వంటీ రావాలి. వీసా స్టాంపింగ్ అయిపోవాలి. అమెరికాలో ఎం ఎస్ చేయాలి. అక్కడే హెచ్ వన్ బి, గ్రీన్ కార్డు ఉద్యోగం తెచ్చుకోవాలి. ఇండియాకు వచ్చి పెళ్లి చేసుకుని వెళ్లి, మళ్లీ అమెరికాలోనే శాశ్వతంగా స్థిరపడిపోవాలి. చుట్టపు చూపుగా ఇండియాకు వచ్చి వెళుతూ ఉండాలి.

ఇందులో బాగోగుల గురించి ఇక్కడ చర్చ అప్రస్తుతం. ఇక్కడి కంటే అక్కడ ఉపాధి అవకాశాలు, మెరుగయిన జీవితం, ఎక్కువ జీతాలు…అన్న సమర్థనలో నిజం లేకపోలేదు. అయితే నెమ్మదిగా ఇండియాలో వృద్ధులయిన తల్లిదండ్రులే మిగిలి…విదేశాల్లో పిల్లల దినదినాభివృద్ధిని వీడియో కాల్లో చూస్తూ…వర్చువల్ ఆనందం పొందే రోజులొచ్చేశాయి.

పిల్లల, వారి తల్లిదండ్రుల ఆలోచన ఈ చట్రంలో ఇరుక్కుపోవడం వల్ల…ఏటా పాతిక లక్షల మంది ఇంజనీరింగ్ పట్టాతో బయటికి వస్తుంటే వారిలో అయిదు లక్షల మందికి తప్ప మిగతా వారికి ఉద్యోగాలు దొరకడం లేదు. చదివిన ఇంజనీరింగ్ విద్య ఎందుకూ పనికి రావడం లేదు.

మార్కెట్ ఎప్పుడూ డిమాండ్- సప్లై సూత్రాన్నే పాటిస్తుంది. జీవితాన్ని మనమే యంత్రమయం చేసుకున్నాం. సాఫ్ట్ వేర్ లేనిదే బతకలేకపోతున్నాం. కృత్రిమ మేధ- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గుండెను తీసి గుండెను బిగిస్తోందని మురిసిపోతున్నాం. కంప్యూటర్ తప్ప ఏదీ చదువు కానే కాదని అంగీకరిస్తున్నాం.

వందేళ్ల కిందట మాడర్న్ లైఫ్ పేరిట ప్రపంచ ప్రఖ్యాత హాస్య నటుడు చార్లీ చాప్లిన్ ఒక సినిమా తీశాడు. అందులో ఒక సన్నివేశంలో చాప్లిన్ డైనింగ్ టేబుల్ ముందు కూర్చుంటే మెషిన్ ప్లేట్లో ఆహారం తీసుకుని, నోట్లో పెట్టి కుక్కుతూ ఉంటుంది. చివరికి వేగం పెంచి పళ్లూడగొట్టి, మొహం పచ్చడి చేస్తుంది. మన సాఫ్ట్ వేర్ యంత్రమయ జీవితం కూడా ఇలాగే బతుకును రోకట్లో దంచుతోంది. కాకపోతే మనకు దంచుతున్నట్లు అనిపించడం లేదంతే.

చరిత్ర, భాషలు, సామాజిక, పరిపాలన, అకౌంట్స్, కళలు…మిగతా చదువులన్నీ చిన్నబోయాయి. విదేశాల్లో యూనివర్సిటీల్లో మానసిక శాస్త్రం ఇప్పటికీ బాగా డిమాండ్ ఉన్న సబ్జెక్ట్. మన మనసు ఎప్పుడూ ఐ టీ శాస్త్రాన్నే పట్టుకుని వేలాడుతూ ఉంటుంది.

కేంద్ర మానవ వనరుల శాఖ లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా ఈ ఏడాది పదకొండు లక్షలకు పైగా ఇంజనీరింగ్ సీట్లు మిగిలిపోయాయి. అందరూ కంప్యూటర్స్, ఐ టీ, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ లనే ఎంచుకోవడంతో మెకానికల్, ఎలెక్ట్రికల్, సివిల్ తరగతులు చేరేవారు లేక ఈగలు తోలుకుంటున్నాయి. బూజు పట్టి తమను తాము రద్దు చేసుకుంటున్నాయి. ఉనికి కోల్పోతున్నాయి.సమాజంలో మనుషులు మూల కూర్చుని…కంప్యూటర్ల సాఫ్ట్ వేర్లే సంసారాలు చేసే రోజులొచ్చాయి కాబట్టి…కంప్యూటర్ ప్రాణులు తమకు కావాల్సిన చదువులు తామే చదువుకుంటున్నాయి!

గట్టిగా ఊపిరి పీల్చుకుని ఆల్ట్ కంట్రోల్ డిలిట్ పట్టుకున్న కంప్యూటర్ ఇంజనీరింగ్ చదువు ముందు ఇక ఏ శాస్త్రమూ నిలబడేలా లేదు. మిగతా సబ్జెక్టులు బతికి బట్టగట్టి బలుసాకయినా తినాలంటే కంప్యూటరే కరుణించి ఏదో ఒక ప్రోగ్రాం కోడ్ లో అన్నా ప్రాణ భిక్ష పెట్టాలేమో! ఏమో?

-పమిడికాల్వ మధుసూదన్

Also Read:

అమరత్వం కోసం కుబేరుల ఆరాటం

Also Read:

ఇక గడప దాటండి

Also Read:

పాన్ బహార్ ఏమన్నా పోషకాహారమా?

RELATED ARTICLES

Most Popular

న్యూస్