Sunday, September 8, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఅదిగో లేపాక్షి-6

అదిగో లేపాక్షి-6

లేపాక్షిలో నడకలు నేర్చిన రాళ్లు, నాట్యం నేర్చిన రాళ్లు, తీగసాగిన రాళ్లు, వేలాడే రాళ్లతో పాటు మరికొన్ని ఆశ్చర్యాలు, అద్భుతాలు ఉన్నాయి. అందులో ఒకటి- అసంపూర్తిగా ఆగిన శివపార్వతుల కల్యాణమండపం పక్కన “సీతమ్మ పాదం”.

ఎత్తయిన ఉయ్యాల మండపం ముందు ఉన్న ఇది కుడి పాదం. ఎడమపాదం లేపాక్షికి ముప్పయ్ కిలోమీటర్ల దూరంలోని పెనుగొండ కొండమీద ఉందని చెబుతారు కానీ అక్కడ ఆచూకీ దొరకలేదు. కొందరు దీన్ని దుర్గా పాదం అంటారు కానీ సీతమ్మ పాదముద్రగానే ఎక్కువ ప్రచారంలో ఉంది. చాలా కాలంపాటు ఉయ్యాల మండపం పైకప్పుకు ఉయ్యాల కొక్కీలు ఉన్నట్లు రాతి మీద గుర్తులు కూడా ఉన్నాయి.

ఆ ఉయ్యాల్లో ఆంజనేయస్వామి విగ్రహాన్ని ఉంచి సాయంత్రాలు ఉయ్యాల సేవలు చేసినట్లు ఆధారాలు దొరికాయి. స్థానిక గైడ్లు ఈ సీతమ్మ పాదానికి చెప్పే కథలో నిజమెంతో కానీ…ఆసక్తిగా ఉంటుంది. ఒక సాయంత్రం సీతమ్మ ఉయ్యాల్లో హాయిగా ఊగుతోందట. అమ్మా! అని హనుమంతుడు పిలిచేసరికి కంగారులో ఊగుతున్న సీతమ్మ అలాగే దూకేసిందట. ఇక్కడ కుడి పాదముద్ర, పెనుగొండలో ఎడమ పాదముద్ర పడ్డాయట.

ఈ రాతి పాదముద్రలో మండు వేసవిలో కూడా నీరు ఊరుతూనే ఉంటుంది. చుట్టూ ఉన్నది రాయే. ఎత్తు మీద వాలుగా ఉన్న రాతి పలకమీద ఉన్న పాదముద్రలో నీరు ఊరుతూనే ఉండడం ఆశ్చర్యం. చీలిన రాతిలో పక్కన కల్యాణ మండపం నుండి నీరు వస్తున్నట్లు అనిపిస్తుంది కానీ…ఆ కల్యాణమండపం ఉన్నది కూడా పెద్ద రాతి పలకమీదే. ఎంత వేసవిలో అయినా కనీసం బొటనవేలులో అయినా నీటి తడి ఉంటుంది.

మేము చిన్నప్పుడు పాదంలో నీళ్లన్నీ తాగేసి టవల్ పెట్టి నీటిని తుడిచి…ఓ గంట ఆడుకుని రాగానే మళ్లీ పాదం నిండా నీళ్లు ఉండడాన్ని చూసి పొంగిపోయేవాళ్లం. ఇప్పటికీ భక్తులు సీతమ్మ పాదతీర్థంగా తాగి, నెత్తిన చల్లుకుంటున్నారు.

ఆలయంలో ఇంకెక్కడా ఇలాంటి పాదముద్రలూ లేవు; ఇంతకన్నా లోతట్టు ప్రాంతాలు ఎన్నో ఉన్నా…ఎక్కడా నీటి ఊటలూ లేవు. ఆలయం కట్టేటప్పుడు నీటి ఊటను వాడుకున్న శిల్పులు దానికి పవిత్రతను అద్దుతూ పాదముద్రగా చెక్కి ఉంటారన్న పురావస్తుశాఖవారి ఊహ సమంజసంగా ఉంది. ఈ పాదముద్ర పక్కనే రాతి కంచాలు ఉండడంతో ఈ వాదన అంగీకారయోగ్యమయ్యింది.

సీతమ్మ పాదం పక్కనే రాతి కంచాల్లో శిల్పులు సామూహికంగా భోజనాలు చేసేవారు. మధ్యలో అన్నం పెట్టుకుని…చుట్టూ కూరలు, పచ్చళ్ళు ఇతర ఆహార పదార్థాలు పెట్టుకోవడానికి వీలుగా ఆధునిక మీల్స్ ప్లేట్ల కంటే ఈ రాతి కంచాలు గొప్పగా ఉన్నాయి.

కొందరు వీటిని చిత్రకారులు రంగులు కలుపుకోవడానికి చేసుకున్న ప్లేట్లు అనుకున్నారు. హంపీలో రాజసైనికులు వందల, వేలమంది ఒకేసారి భోంచేయడానికి వీలుగా ఖనిజ గుణాలున్న రాతి కంచం పలకలు ఇలాంటివే ఏర్పాటు చేశారు కాబట్టి…కచ్చితంగా ఇవి తినడానికి రాతిపరుపు మీద చెక్కిన కంచాలే.

హంపీలో రాతి కంచాల ప్రత్యేకతను ప్రస్తావిస్తూ గతంలో ఐధాత్రి ప్రచురించిన కథనమిది:-

హంపీ వైభవం-2

లేపాక్షిలో శిల్పులు అన్నాలు తిన్న తరువాత మంచి నీళ్లివ్వడానికి సీతమ్మే దిగి వచ్చింది. ఆమె పాదం మోపిన చోటును శిల్పులు పాదంగా చెక్కి…మనకు పట్టి ఇచ్చారు. వేలాడే స్తంభం ఒక అద్భుతమయితే…రాతి పాదముద్రలో ఎడతెగని నీటి ఊట మరొక అద్భుతం.

“బేట్రాయి సామి దేవుడా! నన్నేలినోడ
బేట్రాయి సామి దేవుడా!
కాటేమి రాయుడా! కదిరినరసిమ్ముడా!
మేటైన వేటుగాడ! నిన్నే నమ్మితిరా!”

లేపాక్షికి దగ్గర్లోని కదిరి దగ్గర రాళ్లు కొట్టే ఒక కార్మికుడు ఒక రాతిని కొట్టగానే…అది రెండు ముక్కలయ్యింది. అందులో నుండి బెక బెకమంటూ ప్రాణమున్న కప్ప పైకెగిరింది. రాతిలో ప్రాణాన్ని పెంచి పోషించిన దేవుడి లీల ఆ కార్మికుడిని తత్వవేత్తను చేసింది. తరువాత గొప్ప వాగ్గేయకారుడిని చేసింది. అతడి నోటినుండి ఆశువుగా పుట్టినదే “బేట్రాయి సామిదేవుడా!” దశావతార వర్ణన గీతం.

ఆ కదిరి బేట్రాయికి- ఈ లేపాక్షి పాదం రాయికి లంకె పెట్టుకుని చూస్తే…ఏవో అలౌకికమైన భావనలు మెదులుతాయి.

రేపు:-అదిగో లేపాక్షి-7
“కల్యాణం జరిగింది
మండపం ఆగింది”

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

RELATED ARTICLES

Most Popular

న్యూస్