Sunday, January 19, 2025
HomeTrending Newsసోషల్ మీడియాలో జాగ్రత్త : కమిషనర్ డి ఎస్ చౌహాన్

సోషల్ మీడియాలో జాగ్రత్త : కమిషనర్ డి ఎస్ చౌహాన్

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సోషల్ మీడియాలో అపరిచితుల వ్యక్తులతో జాగ్రత్తగా వ్యవహరించాలని రాచకొండ కమిషనర్ డి.ఎస్ చౌహాన్ ఐపీఎస్ యువతకు సూచించారు. నేటి ఆధునిక సాంకేతిక యుగంలో వివిధ రకాల అవసరాలకు ఎన్నో రకాల సాంకేతిక పరికరాలు ఉపయోగించడం జరుగుతోందని, వాటి వల్ల పలు రకాల మార్గాలలో జరిగే నేరాల వల్ల ఎంతో మంది బాధితులు నష్టపోతున్నారని కమిషనర్ తెలిపారు. రాచకొండ కమిషనరేట్ మరియు రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నంలోని గురునానక్ విద్యా సంస్థలలో సైబర్ నేరాల అవగాహన కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాచకొండ కమిషనర్ దేవేందర్ సింగ్ చౌహాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డుల వివరాలను సురక్షితంగా ఉంచుకోవాలని, సరైన సైబర్ సెక్యూరిటీ లేని ప్రదేశాల్లో అటువంటి కార్డులు వీలైనంత వరకు ఉపయోగించకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. లాటరీలో డబ్బు గెలుచుకున్నారని వచ్చే మోసపూరిత, ఫోన్ కాల్స్ మరియు మెసేజ్ ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వీలైనంత వరకు సురక్షితం కాని పబ్లిక్ వైఫైలను ఉపయోగించి ఎటువంటి డిజిటల్ చెల్లింపులూ చేయకూడదని సూచించారు.

ముఖ్యంగా సోషల్ మీడియాలో యువత అజాగ్రత్తగా ఉండడం వల్ల, సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి మోసపోతున్నారని తెలిపారు. అపరిచితులతో సోషల్ మీడియా స్నేహాలకు దూరంగా ఉండాలని, తమ వ్యక్తిగత వివరాలను, ఫోటోలను సోషల్ మీడియా అకౌంట్లలో పోస్టు చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని యువతకు సూచించారు. అంతర్జాలంలో ఎటువంటి వేధింపులు ఎదురైనా తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలని, పోలిసులు తగిన న్యాయం చేస్తారని తెలిపారు. అవసరమైన పక్షంలో పోలీసులు బాధితుల వివరాలు గోప్యంగా ఉంచుతారని తెలిపారు. సైబర్ క్రైమ్ పోలీస్ టోల్ ఫ్రీ నంబర్ 1930 ను సంప్రదించడం ద్వారా సైబర్ నేరాల మీద ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.

ఈ కార్యక్రమంలో డీసీపీ అనురాధ ఐపీఎస్ సైబర్ క్రైమ్స్, డీసీపీ రోడ్ సేఫ్టీ శ్రీ బాల దేవి, డీసీపీ మహేశ్వరం శ్రీనివాస్, ఏసిపి ఉమా మహేశ్వర రావు, ఏసిపి వెంకటేశం, ఎండ్ నౌ ఫౌండేషన్ స్థాపకుడు అనిల్ రాచమల్ల, గగన్ దీప్ కోహ్లి, సావిత్రి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Also Read : తెలంగాణలో నేరాలు పెరిగాయి : డీజీపీ మహేందర్ రెడ్డి

RELATED ARTICLES

Most Popular

న్యూస్