Sunday, September 22, 2024
HomeTrending Newsసామాజిక విప్లవకారుడు ఫూలే

సామాజిక విప్లవకారుడు ఫూలే

మహాత్మాజ్యోతిరావ్ ఫూలే గొప్ప సామాజిక విప్లవ కారుడు. భారతీయ సమాజంలో నిస్సహాయులుగా మిగిలిన సామాజిక వర్గాల వారి కోసం జీవితాంతం పాటుపడిన త్యాగశీలి. ధర్మ శాస్త్రాల ప్రామాణికతను ప్రశ్నించిన హేతువాది. అట్టడుగు వర్గాల గురించి, నిర్లక్ష్యానికి గురవుతున్న మహిళల అభ్యున్నతి కోసం వారి తరపున పోరాటాలు చేసిన వీరుడు. సత్యశోధక మండలి స్థాపించి ప్రజల్లో ప్రశ్నించే తత్వం పెంచి… పరిష్కారాలు కనుక్కునే దిశగా కృషి చేశారు. నాలుగు దశాబ్దాలపాటు తాను, తన భార్య సావిత్రి బాయి ఫూలే జరిపిన సామాజిక ఉద్యమం దేశమంతటా విస్తరించి ఆయన్ను పీడిత జన బాంధవుడిని చేసింది.

జ్యోతిరావ్ ఫూలే 1827 ఏప్రిల్‌ 11న పూణెలో జన్మించారు. తల్లి చిమ్నాబాయి, తండ్రి గోవిందరావ్. తొమ్మిది నెలల చిన్నవయస్సులోనే జ్యోతి రావ్ తల్లి మరణించింది. గోవిందరావ్ రెండో పెళ్లి ఆలోచనే చేయలేదు. తల్లి, తండ్రి తానై ఆ పసివాడిని పెంచాడు. కానీ బాలుడిని పెంచడం గోవిందరావ్ కు కష్టమైంది. అందుకే తన సమీప బంధువైన సుగుణాబాయి సహాయం తీసుకున్నాడు. ఆమె బాల్య వితంతువు. చాలా తెలివైనది. కరుణామయురాలు కావడంతో జ్యోతిరావ్ ను కన్నబిడ్డ కంటే ఎక్కువగా చూసుకుంది. ఆ బాలుడి చురుకుదనం, తెలివి తేటలు సుగుణాబాయి గుర్తించింది. బాలుడు వ్యవసాయంలో తనకు తోడుగా ఉండాలని గోవిందరావ్ అనుకున్నారు. కానీ సుగుణాబాయి పట్టుబట్టి జ్యోతిరావ్ ను మంచి స్కూళ్లో చేర్పించి చదువు చెప్పించింది.

విద్యాబుద్ధులతోపాటు మానవ విలువలు నేర్పింది. మనిషిగా తీర్చిదిద్దింది. ఆనాడు అణగారిన వర్గాలకు బ్రాహ్మణాధిపత్య సమాజంలో విద్యార్హత లేదు. ఇంగ్లీషు పాలకుల ప్రాబల్యంవల్ల అణగారిన వర్గాలకు చదువుకునే అవకాశాలు కలిగాయి. వెనుకబడిన వర్గానికే చెందిన ఫూలే ప్రాథమిక విద్యనభ్యసించడం జరిగింది. జ్యోతిరావ్ ఫూలే చదువు మానేసి తండ్రి గోవిందరావ్ కు వ్యవసాయంలో సాయం చేస్తుండేవారు.అయినా ఫూలేకు చదువు మీద శ్రద్ధాసక్తులు తగ్గలేదు. రాత్రినిద్రపోయే ముందు లాంతరు వెలుగులో చదువుకునేవారు.

జ్యోతిరావుకు చదువు పట్ల ఉన్న ఆసక్తిని ఒక ముస్లిం టీచర్‌, ఇంటి పక్కనున్న ఒక క్రైస్తవ పెద్ద మనిషి గమనించారు. గోవిందరావును ఒప్పంచి జ్యోతిరావు విద్యాభ్యాసం కొనసాగేలా చేశారు. పూణెలో స్కాటిష్‌ మిషన్‌ నడుపుతున్న స్కూల్‌లో 1841లో జ్యోతిరావ్ ను చేర్పించారు. గోవిందరావ్ తన కొడుకు జ్యోతిరావ్ కు పెళ్లి చేయాలి అని నిర్ణయించుకున్నారు. సావిత్రిబాయిని చూసి సరైన జోడి అని సుగుణాబాయి భావించింది. 1840లో పెళ్లి జరిపిం చారు. అప్పుడు జ్యోతిరావు కు పన్నెండు ఏళ్లుకాగా సావిత్రిబాయికి తొమ్మిది ఏళ్లు. ఆ బాలదంపతులిద్దరికి తల్లి ప్రేమను పంచి సామాజిక విప్లవకారులుగా తీర్చిదిద్దిన ఘనత సుగుణాబాయిదే. ఫూలేకు చిన్నప్పటి నుంచి పుస్తక పఠనంపై అమితాసక్తి ఉండేది. ఆంగ్లంలో జాన్‌ స్టువర్ట్‌ మిల్‌ రాసిన ‘ఆన్‌ లిబర్టీ థామస్‌ పైన్‌ రాసిన ‘ద రైట్స్‌ ఆఫ్‌ మాన్‌ (మానవ హక్కులు) ది ఏజ్‌ ఆఫ్‌ రీజనింగ్‌ అనే పుస్తకాలు జ్యోతిరావ్ ఫూలేను చాలా ప్రభావితం చేశాయి.ఆ రచనలు ఫూలేమనసులో ఉన్న తిరుగుబాటు తత్వాన్ని ప్రేరేపించాయి. ఈ పుస్తకాలు ఇచ్చిన స్ఫూర్తితో,శక్తితో అవగాహనతో ఫూలే భారత సమాజాన్ని నిశితంగా పరిశీలించసాగాడు. భారత దేశంలో చెలామణి అవుతున్న మనుస్మృతి, కులవివక్ష, జ్యోతిరావుకు చాలా అమానవీయంగా తోచడంతో భారతసమాజాన్ని సంస్కరించాలన్న ఆలోచన మొదలుపెట్టారు.

శివాజీ జీవిత చరిత్ర అమెరికా స్వాతంత్య్ర పోరాటం,స్వేచ్ఛ, సమానత్వం వైపు ఆయన ఆలోచనలను సాగించారు.1848లో ఒక బ్రాహ్మణమిత్రుడు సదాశివ భిల్లాల్‌ గోవింద్‌ పెళ్లి ఊరేగింపులో జరిగిన అవమానం ఫూలే జీవితాన్ని మలుపు తిప్పింది. సమాజంలో సగభాగమైన మహిళలు అభివృద్ధి చెందకుండా సమాజం పురోగతి చెందదని ఫూలే నమ్మారు. అందుకే స్త్రీలు విద్యావంతులు కావాలని భావించారు. ఇతరులకు తాను ఆదర్శంగా ఉండటానికి ముందు తన భార్యసావిత్రిని చదివించారు. సావిత్రిబాయిని 1846-47లో అహ్మదాబాద్‌లో ఉపాధ్యాయ శిక్షణ కోసం పంపించారు. ఆమెతోపాటు ఫాతిమాషేక్‌ అనే ముస్లిం మహిళ కూడా శిక్షణ పొందింది. ఫూలే దంపతులు 1948లో తొమ్మిది మందితో దేశంలోనే తొలి బాలికల పాఠశాలను ప్రారం భించారు. సావిత్రికి తోడుగా సుగుణా బాయి ఉండేది. ఆమె అండదండలతోనే ఫూలే దంపతులు అనేక సంస్కరణలను చేపట్టారు. సామాజిక విప్లవానికి బాటలు వేశారు.

ఆనాడు సమాజంలో బాల్యవివాహాలు సర్వసాధారణంగా జరిగేవి. బాలికలను ముసలివారికి ఇచ్చి పెళ్లి చేయడంతో చాలా మంది అమ్మాయిలు వితంతువులుగా జీవితం గడపవలసి వచ్చేది. కుటుంబంలోని మగవాళ్లు బలత్కరించడం వల్ల గర్భవతులు అయ్యేవాళ్లు. ఆ అవమానాన్ని భరించలేక చాలామంది ఆత్మహత్యలు చేసుకునేవాళ్లు. కొందరైతే ఆ అక్రమ సంతానాన్ని హత్యచేసేవాళ్లు. ఇది ఫూలే దంపతులను  కలిచి వేసింది. ఏ పాపం చేయని అభాగ్యులు చనిపోవద్దని అక్రమంగా జన్మించిన శిశువులను చంపవద్దని ఫూలే దంపతులు పిలుపునిచ్చారు.తమ ఇంట్లోనే స్వేచ్ఛగా పురుడు పోసుకోవచ్చని ఆ పిల్లలు వద్దనుకుంటే తమవద్దే వదిలి వెళ్లవచ్చని ప్రకటించారు.ఆ విధంగా 1872లో ఒక బ్రాహ్మణ యువతికి పుట్టిన బిడ్డనే ఫూలే దంపతులు దత్తపుత్రునిగా స్వీకరించారు. ఆ బాలునికి యశ్వంతు అని పేరు పెట్టుకున్నారు. యశ్వంతు వైద్యవిద్యను అభ్యసించి, వైద్యవృత్తిలో స్థిరపడ్డాడు. బ్రాహ్మణాధిపత్యం నుంచి శూద్రులను కాపాడుకోవాలనే లక్ష్యంతో మహాత్మాజ్యోతిరావ్ ఫూలే 1873 సెప్టెంబర్‌ 24న సత్యశోధక సమాజాన్ని స్థాపించారు.

భగవంతుడికి భక్తుడికి మధ్యదళారీలుగా పురోహితులు ఉండవద్దని సత్య శోధక సమాజం పిలుపునిచ్చింది. పురోహితుల అవసరం లేకుండా సత్యశోధక సమాజ సభ్యులు దేవుడిని పూజించేవాళ్లు. సత్యశోధక సమాజం అభాగ్యులైన వితంతువులకు, అనాధ శిశువులకు ఆశ్ర యమిచ్చేది. కుల,మత, లింగ, ప్రాంతవివక్ష లేకుండా ప్రతి ఒక్కరికి సత్యశోధక సమాజంలో సభ్యత్వం కల్పించారు. వేదాలను పవిత్రంగా భావించడాన్ని ఫూలే వ్యతిరేకించారు. విగ్రహారాధననూ ఖండించారు. మునిసిపల్‌ కౌన్సిలర్‌గాఎన్నికై ప్రజాప్రతినిధిగా కూడా సేవలందించారు. స్వేచ్ఛ, సమానత్వం, ఐక్యమత్యం, మానవత్వంతో కూడిన సమాజాన్ని కోరుకున్నారు. శూద్రులను అతిశూద్రులను దాస్యం నుంచి విముక్తుల్ని చేయాలని భావిం చారు. ప్రగతిశీల భావజాల వ్యాప్తికోసం ఫూలే సాహిత్యానికి పత్రికారంగాన్ని ఎంచుకున్నారు. గులాంగిరి, త్రుతీయరత్న, పౌరో హిత్యం బండారం,సార్వజనిక సత్యధర్మం, సేద్యగాడి చెర్నాకోల, హెచ్చరిక,తదితర ఎన్నోగ్రంథాలను రాశారు. అంతేకాదు దీనబంధు అనే వారపత్రికను ప్రారంభించారు.కార్మికుల, కర్షకుల సమస్యలు, బీదలబాధలు, ఇతర సామాజిక సమస్యలెన్నో ఈ పత్రికలో అచ్చయ్యేవి. సామాజిక ప్రజాస్వా మ్యం సాధించడమే భారతదేశానికి ముఖ్యమని మహత్తర సందేశం ఇచ్చిన మహాత్మజ్యోతిరావ్ఞ ఫూలే తన గురువు అని భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్‌ అంబేద్కర్‌ ప్రకటించుకున్నారు.సమసమాజ స్థాపన కోసం నిరంతరం తపిస్తూ అనారోగ్యంతో ఫూలే 1890 నవంబర్‌ 28న మరణించారు. కులవివక్షను ఎదిరించి బహుజనుల బతుకుల్లో వెలుగురేఖలు ప్రసరింప చేసిన క్రాంతిజ్యోతి మహాత్మా జ్యోతిరావు ఫూలే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్