Highhandedness: రాజ్యాలు పోయాయి. రాచరికం చచ్చింది. ప్రజలే ప్రభువులుగా ప్రజాస్వామ్య వ్యవస్థ వచ్చింది. మనకోసం మనచేత మనమే ఎన్నుకునే ప్రభుత్వాలు పాలిస్తున్నాయి. అంటే మనల్ను మనమే పాలించుకుంటున్నాం…అని అనుకుంటూ ఉంటాం.
స్వరూపం మారిన మాట నిజమే కానీ…స్వభావం మారిందా? అన్నదే డిబేటబుల్ సబ్జెక్ట్.
అన్నం ఉడికిందో లేదో తెలుసుకివడానికి రెండు మెతుకులు పట్టుకుంటే చాలు. అలా ప్రజాస్వామ్య స్వభావంలో రాచరికపు అరాచకత్వం తెలుసుకోవడానికి రెండు మూడు చిత్రాలు చూస్తే చాలు.
జయ జయహే!
సినిమా హీరో ఇన్ నుండి ముఖ్యమంత్రి కావడం దాకా జయలలిత పడ్డ కష్టాలు, ఆమెకు ఎదురయిన పరాభవాలు అన్నీ ఇన్నీ కావు. అలాంటి ముఖ్యమంత్రి జయలలిత లేదా పార్టీ అధినేత జయలలిత ముందు ఎవరయినా వంగి వంగి దండాలు పెట్టాల్సిందే. సాష్టాంగ నమస్కారం సర్వోత్తమం. పొర్లు దండాలు మరింత ప్రయోజనకరం. ఆమె క్యాబినెట్లో ఆమె సహచర ఆర్ధిక మంత్రి ఎలా ఆమె కాళ్ల మీద పడ్డాడో చూసి తరించండి. ఆమె కాన్వాయ్ వెళుతుంటే కూడా అంతే వినయంతో వంగి నమస్కారం పెట్టడం ప్రజాస్వామ్యం కళ్లు చెమర్చే సన్నివేశం.
ఐ యామ్ ఐ ఏ ఎస్!
ప్రభుత్వాలను ఎన్నికయిన పార్టీలు పాలిస్తున్నట్లు భ్రమ పడుతూ ఉంటాయి. పాలించేది అక్షరాలా ఐ ఏ ఎస్, ఐ పి ఎస్సులే. వీరు మనుషులే అయినా…మానవాతీతులమని అనుకుంటూ ఉంటారు. వారికి ఫోను, ఫ్యాను, ప్యూను, కారు, డ్రయివర్, హ్యటు, సూటు, బూటు, అపరిమిత అధికారాలు ఉండేసరికి వారి కాళ్లు సహజంగా నేలకు ఆనవు. విద్యా వినయ సంపదతో నలుగురు కూర్చుని నవ్వే వేళల్లో తలచుకోదగ్గ గొప్ప అధికారులు లేకపోలేదు. అలాంటివారి సంఖ్య తక్కువ.
ఉత్తర భారతంలో ఒక తల్లీ పిల్లల సంపూర్ణ పోషణ కేంద్రాన్ని సందర్శించిన ఐ ఏ ఎస్ అధికారి చిత్రాన్ని చూడండి. (సామాజిక మాధ్యమాల్లో ఈ ఫోటో వైరల్ అయ్యాక ఆయన క్షమాపణ చెప్పారనుకోండి. అది వేరే విషయం)
ఐ ఏ ఎస్ దంపతుల నడత
ఢిల్లీలో ఒక ప్రభుత్వ స్పోర్ట్స్ స్టేడియం. సాయంత్రమయ్యే సరికి ఒక ఐ ఏ ఎస్ దంపతులు ఆరోగ్య పరిరక్షణలో భాగంగా నడవాలి. వారి పెంపుడు కుక్క కూడా వారితోపాటు నడవాలి. దాంతో…ముందు వారి పరివార పరమాణువులు వచ్చి…”ఆదర్శ ఐ ఏ ఎస్ దాంపత్య పరమహంస పరివ్రాజక పాదాలు వారి శునక సహిత పాదాలతో వస్తున్నాయి…అందరూ వెళ్లిపోండి” అని శబ్దఘోష చేస్తారు. అంతే గ్రౌండ్, ట్రాక్ ఖాళీ. శ్మశాన నిశ్శబ్దం. నిర్మానుష్యం. అప్పుడు వారు నడుస్తారు. వారి కుక్క కూడా బద్దకంగా ఒళ్ళు విరుచుకుంటూ నడుస్తూ ఉంటుంది.
ఆ స్టేడియంలో, ట్రాక్ మీద క్రీడాకారులు, జనం చూసినన్ని రోజులు చూసి…ఇక ఓపిక నశించి ఫోటోలు, వీడియోలతో ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం వారిద్దరినీ చెరో చోటికి బదిలీ చేసింది.
వారు బదిలీ అయిన చోట ఏ స్టేడియాలున్నాయో? వారి కుక్క ఎవరితో ఉండి ఎప్పుడు వాకింగ్ కు వెళుతుందో?
ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి. పైకి వెళ్లే కొద్దీ పది మంది చూస్తున్నారన్న స్పృహ ఉండాలి. ఉన్నత స్థానాల్లో ఉన్నవారు ఆదర్శంగా ఉండాలి.
“Your freedom ends where my nose begins”
-పమిడికాల్వ మధుసూదన్
Also Read :