Monday, January 20, 2025
HomeTrending Newsతట్టుకోలేకే ఈ రాతలు: మంత్రి అమర్నాథ్

తట్టుకోలేకే ఈ రాతలు: మంత్రి అమర్నాథ్

ఆంధ్ర ప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బ తీసేందుకు కొన్ని పత్రికలు విపక్షాలతో కలిసి కుట్రలు చేస్తున్నాయని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు.  విశాఖలో జరగనున్న గ్లోబ‌ల్ ఇన్వెస్టర్స్‌ స‌మ్మిట్  కు ప్రపంచవ్యాప్తంగా అనేకమంది పారిశ్రామిక వేత్తలు వస్తున్నారని, 6500 మంది ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్నారని, మనదేశంలోని దిగ్గజ వ్యాపారవేత్తలు ముఖేష్ అంబానీ, కుమార మంగళం బిర్లా తో పాటు జిఎంఆర్, టాటా, అదానీ గ్రూపులనుంచి ప్రతినిధులు వస్తున్నారని… ఇంత పెద్ద సదస్సు జరుగుతుంటే, ఇది  విజ‌య‌వంతం కాకూడ‌ద‌నే  ఇలా దుష్ప్ర‌చారం చేస్తున్నారని మంత్రి అసహనం వ్యక్తం చేశారు.  తమను నచ్చిన వ్యక్తి సిఎంగా లేడనే అక్కసుతోనే ఇలా రాస్తున్నారన్నారు. విశాఖలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో మంత్రి గుడివాడ మీడియాతో మాట్లాడారు.

గ‌డిచిన మూడేళ్ళుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో మొద‌టిస్థానంలో నిలిచిన నేప‌థ్యంలో మ‌న రాష్ట్రంలో ప‌రిశ్రమ‌లు ప్రారంభించాల‌ని ప్రముఖ పారిశ్రామిక వేత్తలు భావిస్తున్నారని అమర్నాథ్ వెల్లడించారు.  ఇది చూసి తట్టుకోలేని ఒక ప్రముఖ ప‌త్రిక ‘రాయితీకి జాడేది’ అంటూ ఓ  క‌థ‌నం ప్రచురించిందని విమర్శించారు. రూ.720 కోట్ల పారిశ్రామిక  ప్రోత్సాహ‌కాలు విడుద‌ల చేయ‌లేద‌ని ఆ ప‌త్రిక రాసిందని, అయితే ఎన్నిక‌ల కోడ్ ఉన్న నేప‌థ్యంలో ఆ కోడ్ తొల‌గిపోయిన త‌ర్వాత విడుద‌ల చేయాల‌ని మాకు ఆదేశాలు వ‌చ్చాయని వివరణ ఇచ్చారు.  పరిశ్ర‌మ‌ల మీద ప్రేమ కాదని, ప్రభుత్వంపై నింద వేయ‌డమే ఆ పత్రిక ఉద్దేశమన్నారు.  ప్రభుత్వానికి, జగన్ మోహన్ రెడ్డికి మంచి పేరు రాకూడదనే ఈ రాతలు రాశారని, ఏ మంచి జరిగినా చెడుగానే చూపిస్తున్నారని ధ్వజమెత్తారు.  గ‌త ప్రభుత్వం రూ.3600 కోట్ల పారిశ్రామిక రాయితీలు బ‌కాయి పెడితే తాము వాటిని వివిధ రూపాల్లో ప‌రిశ్రమ‌ల‌కు అంద‌జేశామని గుర్తు చేశారు. 1995లో చంద్రబాబుతో క‌లిసి రామోజీరావు చేసిన ఘ‌న‌కార్యం అంద‌రికీ తెలుసని,  స‌మాజంలో విలువ క‌లిగిన జ‌ర్నలిజం వృత్తిని త‌న చెత్త రాత‌ల‌తో భ్రష్టు ప‌ట్టిస్తున్నారని వ్యాఖ్యానించారు.  రాష్ట్రంలో జరుగుతున్న మంచి గురించి చెప్పకపోయినా ఫర్వాలేదని, కానీ రాష్ట్ర ఇమేజ్ ను దెబ్బతీయాలని చూస్తే సహించేది లేదని మంత్రి హెచ్చరించారు.

మంత్రి మీడియా సమావేశంలోని ఇతర ముఖ్యాంశాలు:

  • రాష్ట్రానికి మావాడే సీఎంగా ఉండాలి అలా కాకుంటే ఎంత‌కైనా తెగిస్తాం అని అస‌త్యాలు రాస్తున్నారు
  • ఈనాడు ప‌త్రిక‌ స‌మాజానికి హానిక‌రం అని ఆ ప‌త్రికపై రేప‌టి నుంచి ముద్రించండి
  • మీరు ప‌త్రిక ద్వారా విషం క‌క్కుతుంటే మేము, ప్రజ‌లు మాట్లాడ‌కూడ‌దా?
  • ప్రభుత్వంపై ఇష్టం వ‌చ్చిన‌ట్టు బుర‌ద జ‌ల్లుతాం అంటే మేము చూస్తూ ఊరుకోవ‌డానికి సిద్ధంగా లేము
  • పెద్ద ఎత్తున పారిశ్రామిక వేత్తలు గ్లోబ‌ల్ ఇన్వెస్టర్స్‌ స‌మ్మిట్‌కు వ‌స్తుంటే దాన్ని చూసి ఓర్వలేక ఏదో ర‌కంగా బుర‌ద జ‌ల్లుతున్నారు
  • ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో మ‌న రాష్ట్రం మొద‌టి స్థానంలో ఉండ‌డాన్ని రామోజీరావు త‌ట్టుకోలేక‌పోతున్నారు
  • ఏ రాష్ట్రానికైనా స‌హ‌జ వ‌న‌రులు అతి పెద్ద అసెట్‌. దేశంలోనే రెండో అతిపెద్ద స‌ముద్ర తీరం మనకు ఉంది
  •  ప‌రిశ్ర‌మ‌ల కోసం 26 వేల నుంచి 30 వేల ఎక‌రాల భూములు ఇప్ప‌టికే అందుబాటులో ఉన్నాయి
  • ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న‌కు ప్ర‌భుత్వం నుంచి అందే స‌హ‌కారాన్ని స‌ద‌స్సులో పారిశ్రామిక వేత్త‌ల‌కు వివ‌రిస్తాం
  •  పున‌రుత్పాద‌క విద్యుత్‌కు సంబంధించి మ‌న రాష్ట్రానికి ఎక్కువ పెట్టుబ‌డులు రానున్నాయి
  • ఏ ప‌రిశ్ర‌మకైనా లాభ‌, న‌ష్టాలు ఉంటాయి.
  • గ‌తేడాది ర‌ష్యా, ఉక్రెయిన్ యుద్ధం వ‌ల్ల ప‌వ‌ర్ హాలిడే వ‌చ్చింది. కానీ ఇక‌పై అలా జ‌రిగే అవ‌కాశం లేదు
  • విప్రోను విశాఖ‌ప‌ట్నంలో సేవ‌లు ప్రారంభించ‌మ‌ని కోరాం. వారు దీనిపై మార్చి, ఏప్రిల్ త‌ర్వాత నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంది.
RELATED ARTICLES

Most Popular

న్యూస్