Sunday, January 19, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంవీఐపి వాహనాల ముసుగు

వీఐపి వాహనాల ముసుగు

VVIPs: తమిళంలో “గరుడా! సౌఖ్యమా?” అని ఒక సామెత.  పద్నాలుగు లోకాల్లో ఆగకుండా తిరిగిన విష్ణు మూర్తి వైకుంఠంలో దిగి…తన వాహనం గరుత్మంతుడికి వీక్లి ఆఫ్ సెలవు ఇచ్చాడు. మనోవేగం కంటే వేగంగా తిరగడంతో ఒళ్లు వేడెక్కింది…అలా చల్లగా హిమాలయాల కులూ మనాలి కాశ్మీర పర్వత సానువుల రిసార్టులో సేద తీరుదామని బయలుదేరాడు గరుత్మంతుడు. పైన దూది కొండల్లాంటి చల్లటి మేఘాలు, కింద వెండి కొండల్లాంటి మంచు పర్వతాలు. ప్రకృతి పరవశ గీతం పాడుతోంది. గరుత్మంతుడు ఒళ్లు మరిచి చల్ల గాలుల్లో ఎగురుతున్నాడు. ఈలోపు మేఘమండలం మధ్యలో శివుడు ధ్యాన ముద్రలో కళ్లు మూసుకుని కనిపించాడు. అంతే- ఒక్కసారిగా గరుత్మంతుడు వేగం తగ్గించి…రెక్కల చప్పుడు కూడా చేయకుండా వెనక్కు తిరగబోయాడు. పరమశివుడు చూడలేదు కానీ…శివుడి మెడలో పాము గరుత్మంతుడిని చూసింది.

బయట ఎక్కడయినా పాము కనపడితే గరుత్మంతుడు గుటుక్కుమని నోట్లో వేసుకునేవాడు. అది శివుడి మెడలో వాసుకి.
“ఏమి గురుత్మంతుడా!
బాగున్నావా?
ఏమిటి విశేషాలు?
(గరుడా! సౌఖ్యమా?)”
అని పాము అడిగేసరికి గరుత్మంతుడి పై ప్రాణాలు పైనే పోయినంత పని అయ్యింది.

మహా ప్రభో! హాలిడే మూడ్లో ఉండి స్పీడ్ పెంచి కైలాసం దాకా వచ్చేశాను. నువ్వు నన్ను చూడలేదు. నేను నిన్ను చూడలేదు. దయచేసి నా ట్రెస్ పాసింగ్ గురించి మీ స్వామికి కంప్లైంట్ చేయకు. వచ్చినదారినే వెళ్లిపోతా. ప్లీజ్ అని రెక్కలు జోడించి దండం పెట్టి…బతుకు జీవుడా అనుకుని బయటపడ్డాడు.

శివుడు పనిమీద ఉన్నాడు…ఇప్పుడు కలవడం కుదరదు పో! అన్న నందితో గొడవ పెట్టుకున్న రావణాసురుడు చేజేతులా తన చావుకు తానే ముహూర్తం పెట్టుకున్నాడు.

Mla Stickers

అలా ప్రజా ప్రతినిధుల వాహనాల స్టిక్కర్లు కూడా మోస్ట్ పవర్ ఫుల్. ఎవరూ అడగడానికి లేదు. అడ్డగించడానికి లేదు.

పెద్దవారి దగ్గర పనిచేసే చిన్నవారు కూడా చాలా పవర్ ఫుల్ అనడానికి లెక్కలేనన్ని ఉదాహరణలు. పేర్లు చెబితే బాగోదు.

ఎం పి, ఎమ్మెల్యేల దర్పమే దర్పం. కుడి ఎడమల తుపాకులతో బాడీ గార్డులు. వరుస కార్లు. సైరన్లు. ఎక్కడికెళ్లినా ఆగక్కర్లేని ప్రోటోకాల్ రాచ మర్యాదలు. చివరికి వారి కార్ల మీద ఎం పి, ఎమ్మెల్యే అని స్టిక్కరుంటే చాలు…ప్రపంచం వంగి సలాము చేసి ముందుకు పంపుతూ ఉండాలి.

అలాంటి ఒకానొక ఎమ్మెల్యే స్టిక్కరున్న కారులోనే హైదరాబాద్ నడి బొడ్డున పట్టపగలు సామూహిక అత్యాచారం జరిగింది. అలాంటి ఎమ్మెల్యే స్టిక్కరున్న ఒక కారులోనే క్యాసినో హవాలా ఈ డి కేసు ముద్దాయి దర్పం తగ్గకుండా తిరుగుతూ ఉన్నాడు. స్టిక్కరు తేదీ అయిపోయిందని, కలర్ జెరాక్స్ అని, స్టిక్కర్ ను కాకెత్తుకుపోయిందని కాకమ్మ కబుర్లేవో వినిపిస్తున్నాయి కానీ…కథలో లొసుగులు కొట్టొచ్చినట్లు కనపడుతూనే ఉన్నాయి.

ఎదిగేకొద్దీ ఒదిగి ఉండాలన్నది ఆదర్శం. కానీ జరుగుతున్నది అందుకు విరుద్ధం.

స్టిక్కర్ కార్లు కనపడితే మానాలు, ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు పెట్టాల్సిన రోజులు. ఎం పి , ఎమ్మెల్యేలు కాకుండా ఎంత మంది సంఘ విద్రోహులు కలర్ జెరాక్సులో లేక కాకెత్తుకుపోయిన స్టిక్కర్లో వాడుతున్నారో తెలిసేదెలా? తెలిసినా వాటిని తొలిగించే ధైర్యం ఎవరికుంటుంది?

-పమిడికాల్వ మధుసూదన్

Also Read :

ఒక గంజి…ఒక కన్నోవా

RELATED ARTICLES

Most Popular

న్యూస్