Sunday, January 19, 2025
Homeసినిమాఅందరూ జర్నలిస్టులే!

అందరూ జర్నలిస్టులే!

News on Sonam: పొద్దున్నే వార్తాపత్రికల్లో అనిల్ కపూర్ తనయ, తార సోనమ్ కపూర్ తల్లి కాబోతోందని వార్త. దానికి తోడు ఆవిడ అరకొర దుస్తులతో భర్త ఒడిలో పడుకున్న చిత్రం. సందర్భోచితమేనా? ఏమో!

ఒకప్పుడు…అంటే సోషల్ మీడియా ఇంతగా విస్తరించకముందు సినిమా వాళ్ళు, పెద్ద పెద్ద కుటుంబాల కుటుంబాల వారి గురించి ఎక్కడా వినిపించేది కాదు. వారి వివరాలు ఎవరికీ తెలిసేవి కాదు. ఎప్పుడైతే మాములు వాళ్ళు కూడా యూ ట్యూబ్, ఫేస్ బుక్ ద్వారా చిన్నా చితకా పేరుతో పాటు డబ్బూ సంపాదిస్తున్నారో చూశాక ఈ సోకాల్డ్ రంగాల వారి కన్ను వాటిపై పడింది. అంతే, బిలబిలా పిల్లాజెల్లని వెంటేసుకుని పడిపోతున్నారు. చూసేవాళ్ళకి ఓపికుండాలే గానీ సెలెబ్రిటీల జీవితాలన్నీ చలనచిత్రాలయిపోతున్నాయి. ఎన్ని హిట్స్ వస్తే అన్ని డబ్బులు. ఎంత డబ్బున్నా చాలని పేదవాళ్లెవరయ్యా అంటే సినిమావాళ్లే కాబట్టి మెల్లిగా అడుగుపెట్టి కబళించాలని చూస్తున్నారు. ఒక సినిమాకు ఫ్రీగా పబ్లిసిటీ దొరుకుతోంది. నటులు, నిర్మాతల పిల్లల చిట్టి గంతులు చూసి ప్రజలు తన్మయత్వంతో ఊగిపోతున్నారు.

ఒకప్పుడు హీరో కృష్ణ తనయ సినిమాల్లో నటిస్తానంటే అభిమానులు వద్దన్నారట. ఇప్పుడు ప్రిన్స్ కూతురు వీడియోలు చూసి అదే ఫాన్స్ ఆనందిస్తున్నారు . అల్లు అర్జున్ పిల్లల ముచ్చట్లు , చిన్నా చితకా తారల ఇళ్ళు, వాకిళ్లు …కాదేదీ వీడియోకి అనర్హం. ఇక మంచు ఫ్యామిలీ ఇచ్చే ఎంటర్టైన్మెంట్ మాములుగా ఉండదు. ప్రతివారూ ఎదుటివారికంటే తామే బాగా చేస్తున్నామనే భ్రమల్లో ఏది పడితే అది వీడియో రూపంలో వదులుతున్నారు. ప్రైవసీ అనే మాటే లేదు. ప్రేమలు, పెళ్లిళ్లు,డిన్నర్లు…ఏదీ వదిలిపెట్టడంలేదు. ఈ లోగా పిల్లలు అందిపుచ్చుకుంటున్నారు. అక్కడక్కడా కొన్ని మంచి స్టోరీస్ ఉన్నా ఎక్కువగా పేపర్లు, టీవీలు, సోషల్ మీడియా అంతా సినిమాల చుట్టూ తిరుగుతోంది. జర్నలిజం అనే మాటకు అర్థాలు వెతుక్కోవాల్సి వస్తోంది. ఎందుకంటే ఇప్పుడు అందరూ జర్నలిస్టులే మరి!

-కె. శోభ

Also Read : అల్లు అర్జున్ కు సన్మానం

RELATED ARTICLES

Most Popular

న్యూస్