సౌరాష్ట్ర క్రికెట్ జట్టు విజయ్ హజారే ట్రోఫీ -2022ను గెల్చుకుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన నేటి ఫైనల్ మ్యాచ్ లో మహారాష్ట్ర పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. గత మూడు మ్యాచ్ లుగా భారీ స్కోర్లు సాధించిన మహారాష్ట్ర నేడు ఫైనల్లో మాత్రం 248 పరుగులే చేయగలిగింది. ఈ లక్ష్యాన్ని సౌరాష్ట్ర 46.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
సౌరాష్ట్ర టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది, మహారాష్ట్ర కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ నేడు కూడా సెంచరీ (108) సాధించాడు. అజీమ్ కాజి-37; నౌషద్ షేక్-31; ఎస్ ఎస్ బచ్చవ్ -27 పరుగులతో రాణించారు. నిర్ణీత 50 ఓవర్లలో 9వికెట్లు కోల్పోయి 248 పరుగులు చేసింది. సౌరాష్ట్ర బౌలర్లలో చిరాగ్ జానీ మూడు; ప్రేరక్ మన్కడ్, పార్ధ్ భట్, కెప్టెన్ ఉనాద్కత్ తలా ఒక వికెట్ తీశారు. ముగ్గురు బ్యాట్స్ మెన్ రనౌట్ కావడం గమనార్హం.
249 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ మొదలు పెట్టిన సౌరాష్ట్ర తొలి వికెట్ కు 125 పరుగుల చక్కని భాగస్వామ్యం నమోదు చేసింది. హార్విక్ దేశాయ్ అర్ధ సెంచరీ (50) చేసి అవుట్ కాగా, ఆ తర్వాత వచ్చిన జయ్ గోహిల్ (0); సమర్థ్ వ్యాస్ (12); అర్పిత్ వాసవాద (15) విఫలమయ్యారు. ఓపెనర్ షెల్దాన్ జాక్సన్ 136 బంతుల్లో 12 ఫోర్లు,5 సిక్సర్ల తో 133 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. చిరాగ్ జానీ ౩౦ పరుగులతో నాటౌట్ గా నిలిచి షెల్డాన్ కు సహకరించాడు.
మహారాష్ట్ర బౌలర్లలో ముఖేష్ చౌదరి, విక్కీ ఓత్సవల్ చెరో రెండు; సత్యజీత్ బచ్చవ్ ఒక వికెట్ సాధించారు.
షెల్డాన్ జాక్సన్ కే ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ లభించింది.
రుతురాజ్ గైక్వాడ్ కు ‘ప్లేయర్ అఫ్ ద టోర్నమెంట్’ దక్కింది.