స్వదేశంలో జరుగుతోన్న మహిళల టి 20 వరల్డ్ కప్ లో సౌతాఫ్రికా సెమీ ఫైనల్స్ కు చేరుకుంది. చావో రేవో తేల్చుకోవాల్సిన ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై 10 వికెట్ల తేడాతో విజయం సాధించి మెరుగైన రన్ రేట్ ఆధారంగా టాప్ 4 లో చేజిక్కించుకుంది.
కేప్ టౌన్ లోని న్యూ లాండ్స్ మైదానంలో జరిగిన మ్యాచ్ లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ ముర్షీదా ఖాన్ డకౌట్ అయ్యింది. మరో ఓపెనర్ షమీనా సుల్తానా కూడా తక్కువ స్కోరుకే వెనుదిరిగింది. ఈ దశలో కెప్టెన్ నైగర్ సుల్తానా (30); శోభన మాస్టరీ (27) రాణించారు. దీనితో 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేయగలిగింది.
ప్రోటీస్ బౌలర్లలో మారిజాన్నే కాప్, ఖాక చెరో రెండు; మల్బా, షబీనా ఇస్మాయిల్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
సౌతాఫ్రికా ఓపెనర్లు లారా వోల్వార్ద్ట్ 66 (56 బంతులు 7 ఫోర్లు, 1 సిక్సర్) – టాజ్మిన్ బ్రిట్స్50 (51బంతులు, 4 ఫోర్లు) పరుగులతో సత్తా చాటి 17.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా లక్ష్యం ఛేదించారు.
వోల్వార్ద్ట్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.
23న జరిగే తొలి సెమీఫైనల్లో ఇండియా- ఆస్ట్రేలియా; 24న రెండో సెమీస్ లో ఇంగ్లాండ్-సౌతాఫ్రికా జట్లు తలపడనున్నాయి.