ICC Men’s T20 World Cup 2022: ఎమిరేట్స్ పై శ్రీలంక విజయం

పురుషుల టి 20 వరల్డ్ కప్ లో నేడు జరిగిన రెండో మ్యాచ్ లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పై శ్రీలంక 79 పరుగులతో ఘన విజయం సాధించింది. తొలి మ్యాచ్ లో నమీబియా పై ఓటమి పాలైన లంక ఆ పరాజయం నుంచి తేరుకొని గెలుపు బాట పట్టింది. ఈ మ్యాచ్ లో ఎమిరేట్స్ బౌలర్ కార్తీక్ మేయప్పన్ హ్యాట్రిక్ సాధించడం విశేషం.

గీలాంగ్ లోని సైమండ్స్ స్టేడియంలో జరిగిన ఎమిరేట్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. శ్రీలంక తొలి వికెట్ (కుశాల్ మెండీస్-18) కు 42 పరుగులు చేసింది. వన్ డౌన్ లో  వచ్చిన ధనంజయ డిసిల్వా 33 పరుగులు చేసి వెనుదిరిగాడు.  లంక స్కోరు 117 గా ఉన్న సమయంలో కార్తీక్ వరుస బంతుల్లో రాజపక్ష, అసలంక, కెప్టెన్ దాసున శనక లను ఔట్ చేశాడు. మరో ఓపెనర్ పాతుమ్ నిశాంక రాణించి 60 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 74 పరుగులు చేసి ఔటయ్యాడు. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. ఎమిరేట్స్ బౌలర్లు  మేయప్పన్ మూడు; జహోర్ ఖాన్ రెండు వికెట్లతో రాణించారు.

లక్ష్య చేదనలో ఎమిరేట్స్ తడబడింది. శ్రీలంక బౌలింగ్ ధాటికి వరుస వికెట్లు సమర్పించుకుంది. ఓ మంచి భాగస్వామ్యం నమోదు చేయడంలో బ్యాట్స్ మెన్ విఫలమయ్యారు. లంక బౌలర్లలో దుషంత చమీర, వానిందు హసరంగా చెరో మూడు; మహీష్ తీక్షణ రెండు; ప్రమోద్ మదుసూదన్, కెప్టెన్ శనక చెరో వికెట్ పడగొట్టారు. దీనితో 17.1 ఓవర్లల్లో 73 పరుగులకే ఎమిరేట్స్ ఆలౌట్ అయ్యింది.

బ్యాటింగ్ లో రాణించిన పాతుమ్ నిశాంక కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ ‘ లభించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *