State Responsible: సికింద్రాబాద్ ఘటన రాజకీయ ప్రేరేపితమని, అగ్నిపథ్ పై కుట్రపూరితంగా దుష్ప్రచారం చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ హింస పథకం ప్రకారమే జరిగిందని, కొందరు కావాలనే విధ్వంసం సృష్టించాలని చూస్తున్నారన్నారని ఆరోపించారు. అగ్నిపథ్ యువతకు వ్యతిరేకం కాదని, వారిలో క్రమశిక్షణ అలవడుతుందని చెప్పారు. చాలా దేశాలు ఇలాంటి పథకాలు అమలు చేస్తున్నాయని చెప్పారు. యుద్ధాలు వచ్చినప్పుడు యువతను సంసిద్ధం చేసేందుకే ఈ పథకాన్ని తీసుకు వచ్చామని, అయితే ఇది కంపల్సరీ కాదని స్పష్టం చేశారు. మెక్సికో, థాయ్ లాండ్, సింగపూర్, టర్కీ లాంటి దేశాల్లో ఈ తరహా విధానం అమల్లో ఉందన్నారు.
ప్రతిపక్షాలు ఆందోళన చేస్తామంటే ముందస్తు అరెస్టులు చేస్తోన్న రాష్ట్ర ప్రభుత్వం ఈ హింసాకాండను ఎందుకు ముందుగా పసిగట్టలేక పోయిందని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. నిన్న రాజ్ భవన్ గేటు వరకూ వచ్చి ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం నిర్లిప్తంగా ఉందని నిలదీశారు. శాంతి భద్రతల బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని, ఈ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ స్టేషన్ లో ఉదయం నుంచీ ఆందోళన జరుగుతుంటే పోలీసులు ఎందుకు ప్రేక్షక పాత్ర పోషించారని అడిగారు. సికింద్రాబాద్ ఘటన దురదృష్టకరమని, యువత సంయమనం పాటించాలని కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఏదైనా ఉంటే చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని అంటే గానీ ఇలా చేయడం ఏమాత్రం మంచిది కాదన్నారు.
ఈ ఘటనపై ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరిపి దోషులను సిఖించాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ తరహా ఆందోళనలు జరుగుతుంటే రాష్ట్ర మంత్రులు బాధ్యతారహితంగా ట్విట్టర్ లో రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం తగదని హితవు పలికారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మంత్రులు ఇలా వ్యవహరించడం ఏమిటని అసహనం వ్యక్తం చేశారు.
Also Read : ప్రభుత్వ సహకారంతోనే: బండి ఆరోపణ