Saturday, November 23, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకందారి తప్పిన బాల్యం

దారి తప్పిన బాల్యం

Close watch:
1 అదొక ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాల . అక్కడి 8 -10 తరగతుల విద్యార్థుల ప్రవర్తన చాలా భిన్నంగా మారిపోయిందని , ఏమి చేయాలో తెలియడం లేదని టీచర్లు తలలు పట్టుకొంటున్నారు. విద్యార్థులు వారం- 15 రోజులకు ఒక సారి వంతుల వారీగా ఇంటికి వెళ్లాలని పట్టుపడుతున్నారు . రెండు మూడు రోజులు ఇంట్లో ఉండి తిరిగి వస్తున్నారు . వచ్చేటప్పుడు రహస్యంగా మొబైల్స్ తీసుకొని వస్తున్నారు . ఆ మొబైల్ నిండా ఏవో డౌన్ లోడ్ చేసుకొని వచ్చి రాత్రి పూట, టీచర్ల కళ్లుకప్పి చూస్తున్నారు . ఇది ఆ పాఠశాల ప్రిన్సిపాల్ నాతో చెప్పిన విషయం. “ఏమి చెయ్యాలో చెప్పండి, ఒక పక్క పదవ తరగతి విద్యార్థులకు పరీక్షలు ముంచుకొని వస్తున్నాయి” అని ఆమె వాపోయారు. ఆ విద్యార్థులు రహస్యంగా చూస్తున్నది నీలి చిత్రాలు అని సులభంగా అర్థం అవుతుంది.

2 అనంతపూర్ జిల్లాలో ఒక ప్రభుత్వ పాఠశాల. పదవ తరగతి విద్యారులు తాగి పాఠశాలకు రావడం పరిపాటిగా మారిపోయింది. పాఠశాలలో టీచర్లపై దౌర్జన్యాలు సహజమైపోయింది. పాఠశాల ఫర్నిచర్ ను ధ్వసం చేయడం, ఒకరిపై మరొకరు దాడి చేసుకోవడం తరచూ జరుగుతోంది.  వీరిని చూసి టీచర్లు హడలి పోతున్నారు. చివరకు టీచర్లపై వీరు పోలీస్ స్టేషన్ కు వెళ్లారు .

౩ హైదరాబాద్ సిటీ లో ప్రైవేట్ పాఠశాలలు .. కొంత మంది పిల్లలు ఒకరి పై ఒకరు దాడి చేసుకోవడం పరిపాటిగా మారిపోయింది . ఒక ఘటనలో ఒక విద్యార్ధి మృతి చెందాడు.

4 బెంగళూరు నగరం . ఆన్లైన్ క్లాసుల్లో పిల్లలు మహిళా టీచర్ ల శరీర భాగాలను వర్ణిస్తూ స్క్రీన్ షాట్ లు పోస్ట్ చేయడం. వీటిని చూసి తట్టుకోలేక టీచర్ వృత్తిని వదిలి పలు మహిళా టీచర్ లు వెళ్లిపోవడం .. లాంటి ఘటనలు బాగా ఎక్కువగా జరిగాయి .

5 హైదరాబాద్ సిటీ . తల్లి తండ్రి మెడికల్ షాప్ నడుపుతున్నారు కొడుకు పదవ తరగతి . రాత్రి రెండింటి దాక తలుపు వేసుకొని మొబైల్ తో ఏదో చేస్తాడు . ప్రశ్నిస్తే తల్లిదండ్రులను  కొడతాడు . ఒకసారి రాత్రి ఒంటి గంట దాక తల్లిదండ్రులను బైటకు తోసి డోర్ లాక్ చేసేశాడు, ఏడుస్తాడు, మేడపైకి వెళ్లి దూకేస్తానంటాడు. అతని స్కూల్ లో తొమ్మిదో తరగతి అమ్మాయి అతనితో రాత్రి ఒంటి గంట దాక వీడియో చాట్ చేస్తుంది. అది ఎలాంటి చాట్ అనేది తల్లితండ్రులకు తెలియదు .

6 హైదరాబాద్ గాంధీ నగర్.  పదవ తరగతి అబ్బాయి. రాత్రంతా పబ్జి ఆడుతాడు. ఆన్లైన్ క్లాసులకు హాజరు కాడు. స్కూల్ కు వెళ్ళడు. తలుపులు తీయడు. అందరినీ బెదిరిస్తాడు

7 . హైదరాబాద్ ఎల్బీ నగర్. ఆ అబ్బాయి పాఠశాలలో నీలి చిత్రం చూస్తూ టీచర్ కు పట్టుపడ్డాడు . ప్రశ్నించిన టీచర్ పై దాడి చేసి స్కూల్ నుంచి పారిపోయాడు . మరో ఘటనలో ఇద్దరు పిల్లలు పాఠశాలకు వాటర్ బాటిల్ లో వోడ్కా కలుపుకొని వచ్చి దొరికి పోయారు.

8 నల్గొండ జిల్లా లో ఒక మారుమూల గ్రామానికి చెందిన ఒక అబ్బాయి . ఆ ఊళ్ళో సిగ్నల్స్ సరిగ్గా రావు . ఆన్లైన్ క్లాసుల కోసం ఆ అబ్బాయి మరో ఇద్దరి కి సిటీ లో రూమ్ తీసి అక్కడ వసతి ఏర్పాటు చేసారు . ఆ అబ్బాయికి విస్కీ తాగడం అలవాటు అయ్యింది . ఇప్పుడు పాఠశాల ప్రారంభం అయ్యింది . విస్కీ తాగితే కానీ స్కూల్ కు వెళ్లనని, కాదంటే ఆత్మ హత్య చేసుకొంటానని బెదిరిస్తున్నాడు .

9 . విజయవాడ – తొమ్మిదో తరగతి విద్యార్థిని . స్కూల్ కు సిగరెట్లు తెచ్చి పట్టుబడింది .

10 నూటికి అరవై మంది విద్యార్థుల చదువు గాడి తప్పింది . ఎక్కాలు , కింది తరగతుల ఫండమెంటల్స్ మరిచి పోయారు . చదువుకొనే తత్వం పోయింది . చదువు పై ద్యాస లేదు . క్లాసులో పాఠాలు వినరు .

Students Addicted

11 నీలి చిత్రాలు చూడడం , సెక్స్ చాట్ , నగ్న వీడియో చాట్ లు , మద్యపానం , ధూమపానం , గంజాయి లాంటి మాదక ద్రవ్యాల వినియోయోగం ఇలాంటివి అలవాటుగా మారిపోయింది . టీచర్ ల పై దౌర్జన్యాలు పరిపాటిగా మారిపోయింది .

ఇవన్నీ చెప్పుకొంటే తమ పాఠశాల పరువుకు ఎక్కడ భంగం వాటిల్లుతుందో, ఎక్కడ అడ్మిషన్స్ దెబ్బతింటాయో అని ప్రైవేట్ పాఠశాలలు, అసలు ఏమీ జరగనట్టు నటిస్తున్నాయి . ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ఇలాంటి ఘటనల తో ఎలా వ్యవహరించాలో తెలియకుండా తలలు పట్టుకొంటున్నారు . కడుపు చించుకొంటే కాళ్లపై పడుతుందని కొందరు , ఇవన్నీ పట్టించుకోకుండా తమ వ్యాపారాలు చేసుకొనే టీచర్ లు మరికొందరు .

ఏదైనా సంఘటన జరిగితే దాన్ని క్రైమ్ రిపోర్టర్ ద్వారా క్రైమ్ వార్తల పేజీ లో కవర్ చేసి మీడియా అక్కడితో వదిలేస్తోంది . ప్రభుత్వానికి రాజకీయ పార్టీల కు ఇలాంటివి పట్టవు . రాజకీయ నాయకులు బూతులు మాట్లాడుకొంటూ బిజీ గా వున్నారు . తల్లి తండ్రులు “మా బిడ్డ ముద్దు , ఇవన్నీ ఎక్కడో సప్త సముద్రాల కవతల మర్రి చెట్టు తొర్రలో జరిగే ఘటనలు మనకు సంబంధం లేదు” అనుకొంటున్నారు . సొంత ఇంట్లో వ్యవహారం ముదిరి పాకాన పడితే అప్పుడు నాలాంటి వాడిని లేదా సైకియాట్రిస్ట్ ను కలవడానికి పరుగులు పెడుతున్నారు .

స్కూళ్ళు , టీచర్ లు , పేరెంట్స్ , మీడియా , ప్రభుత్వం .. అందరూ నటిస్తున్నారు . “అసలు సమస్యే కాదు.. ఏదైనా ఉంటే దానంతకు అదే సర్దుకొంటుంది” అనుకొంటున్నారు. వీరి నటనకు ఆస్కార్ అవార్డు తప్పక లభిస్తుంది .

కాకపోతే ఇలాగే వదిలిస్తే స్కూల్స్ లో కాలేజీ ల లో జంబలకిడి పంబ సినిమా లో బాబు మోహన్ పోలీస్ గా క్లాస్ నడిపినట్టు, పోలీస్ బందోబస్తు తో క్లాస్ నడపాల్సిన నడపాల్సిన రోజులు వచ్చేస్తాయి . బాల క్రిమినల్స్ పుట్టుకొని వచ్చేస్తున్నారు . పరువుగల కుటుంబాలకు చెందిన మహిళలు టీచర్ వృత్తి లోకి రారు .

నిద్రలేవండి . నటించడం మానండి . సమస్య ఉంది అని గుర్తించడం సమస్యకు మొదటి పరిష్కారం .

1 . కరోనా కాలంలో ఆన్లైన్ క్లాసుల పుణ్యమా అంటూ విద్యార్థులు సెల్ ఫోన్లకు, ఇంటర్ నెట్ చీకటి ప్రపంచం లో దొరికే సకల మలినాలకు, విషాలకు అలవాటు పడిపోయారు . ఈ పరిస్థితిని ఎలా చక్కదిద్దాలో అందరు టీచర్లకు శిక్షణ ఇవ్వాలి .

2 . సెల్ ఫోన్ అడిక్షన్, జంక్ ఫుడ్ అడిక్షన్, నీలి చిత్రాలు ఇలాంటివి ఇరవై ఒకటవ శతాబ్దం పిల్లలు అందునా ముఖ్యంగా కరోనా అనంతర సమాజపు పిల్లల వ్యసనాలుగా మారిపోయాయి . వీటికి సంబందించిన విషయాలపై సైద్ధాంతిక పోరాటం జరగాలి . ఇలాంటి పాఠాలను టీక్ట్ బుక్స్ లో భాగంగా చేయాలి .

౩. పిల్లలకు కౌన్సిలింగ్ చేయడానికి ప్రతి విద్య సంస్థలో ఏర్పాట్లు జరగాలి . క్రైమ్ దారిలో వెళ్లిన వారితో కఠినంగా వ్యవహరించాలి . ఇప్పుడున్న చట్టాలను సమీక్షించాలి .

ప్రజల్లో చైతన్యం ఉంటేనే మీడియా…అంతకు మించి ప్రభుత్వాలు స్పందిస్తాయి .

-వాసిరెడ్డి అమరనాథ్

ఇవి కూడా చదవండి: డబ్బే డబ్బు

RELATED ARTICLES

Most Popular

న్యూస్