Saturday, September 21, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంబతికించే చదువులు కావాలిప్పుడు

బతికించే చదువులు కావాలిప్పుడు

Stress-less:  లేపాక్షి వివేకానంద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. 1980-85 నాటి మాట. వెయ్యి మందికి పైగా విద్యార్థులతో దానికదిగా ఒక ప్రపంచంలా ఉండేది మాకు. ఇల్లు, బడి, ఊరిమీద పడి ఆడుకోవడం తప్ప ట్యూషన్లు లేవు. కోచింగుల్లేవు. మార్కుల సమీక్షల్లేవు. ర్యాంకుల ఊసే లేదు. పది దాటితే ఇంటర్. ఇంటర్ దాటితే డిగ్రీ. డిగ్రీ దాటితే పి జి. మెరికల్లాంటివారు మాత్రమే బ్యాంకు, టీచర్ ఉద్యోగాలకు, ఇతర పోటీ పరీక్షలకు తయారయ్యేవారు.

మా టీచర్ల తిట్లు, పొగడ్తల్లోనే అనంతమయిన కర్తవ్య బోధ ఉండేదని ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతోంది. పేర్లు అనవసరం.
“ఒరేయ్ నువ్ లారీ డ్రయివర్ కు తప్ప ఎందుకూ పనికిరావురా!”
అని ఒకడిని మా సోషల్ టీచర్ నంజుండమూర్తి సార్ విసుక్కునేవారు. వాడు దాన్ని పాజిటివ్ గా తీసుకుని…పొగడ్తలా భావించి టెంత్ పదిసార్లు రాయలేక నిజంగానే మంచి లారీ డ్రయివర్ అయ్యాడు. నేను రిపోర్టర్ గా హిందూపురంలో పని చేస్తున్నప్పుడు వాడు పూర్వస్నేహాభిమానంతో నన్ను లారీలో ఎక్కించుకుని తిప్పాడు కూడా. లేపాక్షి- హిందూపురం మధ్యలో చోళసముద్రం రావి చెట్టు నీడలో లారీ ఆపి…మధూ నంజుండమూర్తి సార్ ఎంత గొప్పవాడో కదా! నేను లారీ డ్రయివర్ను అవుతానని ఎంత బాగా కనుక్కున్నాడప్పా! అని పొంగిపోయి గుర్తు చేసుకున్నాడు. బుద్ధుడికి బోధి చెట్టు కింద జ్ఞానోదయమయితే వీడికి ఈ చెట్టుకింద జ్ఞానోదయమవుతున్నట్లు ఉంది అనుకున్నా. ఊళ్లో విషయాలన్నీ వార్తలు రాస్తే నీకొచ్చేది నెలకు నాలుగు వందలేనా? అని కన్నీళ్లు కూడా కార్చాడు. వాడి సామాజిక స్పృహ, వాడి గురించి వాడికున్న క్లారిటీలో నాకు వెయ్యో వంతు కూడా ఉండదు.

స్కూల్లో ఎవరి సైకిల్ తాళాలు పోగొట్టుకున్నా మా క్లాసుకు వచ్చేవారు. సార్ వెంటనే మా క్లాస్ మేట్ ను ఒకడిని వెళ్లి రమ్మనేవారు. వాడు ఒక చిన్న ఇనుప చువ్వ తీసుకెళ్లి చిటికెలో తీసేవాడు.
“ఒరేయ్ నువ్ మంచి మెకానిక్కన్నా అవ్వాలి. గజదొంగ అన్నా అవ్వాలి”
అని టీచర్లు ఆశీర్వదించారు. గురు వాక్కు. వాడు అక్షరాలా మెకానిక్ అయ్యాడు. మొదట సైకిల్ షాపు. తరువాత టూ వీలర్ మెకానిక్ అయ్యాడు.

“ఒరేయ్ ఆషాఢభూతి! ఆముదం మొహపోడా!” అని ఆశీర్వదిస్తే వాడు నిజంగానే ఆముదం పండించి…ఆముదమే అమ్ముకుంటున్నాడు.

ఒకమ్మాయి తెచ్చుకున్న బాక్స్ సరిగ్గా తినదు కానీ…కొబ్బరి పీచు పెట్టి బాగా కడిగి…ఎండలో ఆరబెట్టి…తరువాత తెచ్చుకునేది. ఒసేయ్ అంట్ల మొహమా! అంట్లు తోముకుని బతుకుతావా! ఏంది? అని మేడం తిట్టేవారు. ఆమె అలాగే చక్కగా అంట్లు తోముకుంటూ కాలం గడుపుతోంది.

స్కూల్లోకి ఎడ్లు, దున్నపోతులు, కోతులు వస్తే వాటిని తరమడానికి మా క్లాసులో ఒక ఎక్స్పర్ట్ ఉండేవాడు. వాడు నింపాదిగా నోటితో కొన్ని డుర్రుర్ హే లాంటి ధ్వనులతో తరిమేసేవాడు. ఒరేయ్ నీ సాటి పశువుల మందను కూడా ఇలాగే కంట్రోల్ చేసే విద్యలుంటే చెప్పి పుణ్యం కట్టుకోరా అని వాడిని మా హెడ్ మాస్టర్ తిప్పరాజు సార్ అడిగేవాడు. వాడు అలాగే ఎడ్లు, దున్నపోతులతో వ్యవసాయ పాడి పంటల్లో ప్రవేశించాడు.

ఒకడు చదివేది ఏమీ ఉండదు కానీ…పుస్తకాలు, పెన్ను, బాక్సులను నీట్ గా ముందు అమర్చుకునేవాడు. ఒరేయ్ జాతర సంతలో అంగడి పెట్టుకుంటావేమోరా భవిష్యత్తులో నీవు! అంటే వాడు అక్షరాలా కిరణా దుకాణమే పెట్టుకున్నాడు.

ఒకడు సైకిల్లో వెనుక కూర్చుని కదిలే సైకిల్ మీద బుద్ధిగా లెక్కలు రాసుకుంటూ ఉండేవాడు. వాడిని కదిలే బస్సులో లెక్కలు రాసే కండక్టర్ కమ్మని ఆశీర్వదించారు. అలాగే అయ్యాడు.

ఇంగ్లీషు, లెక్కలు, సైన్స్ లో ఎప్పుడూ ఫస్ట్ ఉండే ఒకడిని మా లెక్కల మేడం తిడుతూ పొగిడేది. నిందాస్తుతి. ఒరేయ్ శీను నువ్ మాపాలిట శ్రీనివాస రామానుజన్. నన్ను బోర్డు మీద కనీసం స్టెప్స్ రాయనీ. నువ్ ఈలోపే ఆన్సర్ రాస్తే ఎలారా నాయనా? నువ్ స్టూడెంట్. నేను టీచర్. వాడు పుస్తకం చదవడు. క్లాసులో చెప్పింది విననట్లు ఉంటాడు. పెద్దయ్యాక వ్యవసాయం చేసుకుని బతుకుతాను అని చెప్పి అలాగే రైతు అయ్యాడు. వాడితో పది నిముషాలు మాట్లాడితే పది పుస్తకాలు చదినట్లు ఉండేది నాకు. వాడి ముందు పాఠం చెప్పడానికి టీచర్లకే ఉత్సాహంగా ఉండేది. ఇక మేమెంత? తరువాత మా టీచర్లు రిటైర్ అయిన ఫంక్షన్లకు నేను రిపోర్టర్ గా వెళ్లేవాడిని. మా స్టూడెంట్ల నుండి మేము ఎన్నో నేర్చుకున్నామని మా టీచర్లు ఎన్నెన్నో ఉదాహరణలు, స్ఫూర్తిదాయకమయిన విషయాలను చెప్పేవారు.

నాలాంటివారిని ఏమీ తిట్టనందుకు ఇలా ఎందుకూ కొరగాకుండా సైన్స్ చదువుతూ, సాహిత్యంలో మునిగి, జర్నలిజాన్ని పట్టుకుని, వ్యాపారంలో తేలి…ఏమి చదివి…ఏమి చేస్తున్నామో తెలియకుండా ఉన్నాము. ఆ విషయమే మాకు సంస్కృతం చెప్పిన కె వి ఆర్ మూర్తి సార్ తో అంటే…”పొనీలేప్పా…ఏమి చేస్తే ఏమి? సొంతకాళ్ల మీద నిలబడి ఎవరి బతుకు వారు బతకగలిగితే అంతకంటే ఇంకేమి కావాలి?” అని అంటుంటారు.

“ఏమి చేస్తే ఏమి? సొంత కాళ్లమీద ఎవరి బతుకు వారు…” అన్నది నాకు చాలా గొప్ప సందేశంలా అనిపిస్తూ ఉంటుంది.

వారాలు చెప్పుకుని ఒక్కో వారం ఒక్కొక్కరి ఇంట్లో తింటూ చదువుకున్న వారాలబ్బాయిల చదువుల చైతన్యం, పట్టుదలల గురించి ఇప్పటి పిల్లలకు ఎవరు చెప్పాలి?

తల్లిదండ్రుల బట్టలను ఆల్ట్రేషన్ చేయించుకుని చిరుగులు, కుట్లు, పాత మడతలు కనపడుతున్నా హాయిగా కాలేజీలకు వెళ్లిన విద్యార్థుల గురించి ఇప్పటి తరానికి ఎవరు చెప్పాలి?

ఎండా వాన, దుమ్ము ధూళుల్లో కాలికి చెప్పులు కూడా లేకుండా అయిదారు కిలోమీటర్లు నడిచి చదివిన చదువుల గురించి ఇప్పటి పిల్లలకు ఎవరు చెప్పాలి?

పోటీ పరీక్షలు రాయడం ఒక ప్రయత్నం, బాధ్యత తప్ప వచ్చి తీరుతుందన్న నమ్మకమే లేని రోజులు; కొన్ని పరీక్షలకు తాము అర్హులం కాము అని ఎవరికి వారే తెలుసుకున్న రోజులు ఉండేవని ఇప్పటి పోటీ పరీక్షల పిల్లలకు ఎవరు చెప్పాలి?

రాజస్థాన్ కోటా కోచింగ్ సెంటర్లలో నెలకు రెండు సార్లు మానసిక నిపుణుల కౌన్సిలింగ్ తప్పనిసరి చేశారు. విద్యార్థులు మధ్యలో మానేస్తే పూర్తి ఫీజు వెనక్కు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. క్లాసుల్లో ఇంటర్నల్ మార్కుల ఆధారంగా బాగా చదివే, సరిగ్గా చదవని గ్రూపులుగా విభజించకూడదని ఆదేశాలిచ్చారు. తొమ్మిదో క్లాసు లోపు పిల్లలకు ఐ ఐ టీ ప్రవేశ పరీక్షల కోచింగ్ ఇవ్వడాన్ని నిషేధిస్తున్నారు. కోటాలో ఈ ఒక్క సంవత్సరంలోనే పాతిక మంది విద్యార్థులు చదువుల, మార్కుల, ర్యాంకుల ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు.

నలభై, యాభై ఏళ్లు వెనక్కు తిరిగి చూసుకుంటే మా లేపాక్షి వివేకానంద జిల్లా
పరిషత్ ఉన్నత పాఠశాల ఇచ్చిన వివేకం, అక్కడి టీచర్లు తిట్టిన తిట్లు ఎంత గొప్పవో! ఎవరు ఏ పనికి యోగ్యులో తేల్చి చెప్పిన వారి భవిష్య దర్శనం ఎంత గొప్పదో! బతుకుకు మించిన పాఠం ఉండదని చెప్పకనే చెబుతూ వచ్చిన వారి విద్యాదానమే మాకు శ్రీరామ రక్ష అయ్యిందనిపిస్తుంది.

పన్నెండు వందల మంది పిల్లల్లో ఒకానొక అంట్లు తోమే విద్యార్థిని నైపుణ్యాన్ని కూడా పసిగట్టే టీచర్లు ఉండబట్టే అప్పుడు స్కూలు స్కూలంతా తళతళలాడుతూ ఉండేది. ఇప్పుడు అదే బాక్స్ లో మాదక ద్రవ్యాలు తెచ్చుకుని విద్యార్థులు తింటున్నా పసిగట్టలేని, పసిగట్టినా పట్టించుకోని టీచర్లు, యాజమాన్యాలు ఉండబట్టే ఇలా ఉంది.

అప్పుడు-
ఎవరు దేనికి పనికి వస్తారో అన్నది కనుగొన్న టీచర్లు విద్యార్థులకు ఆత్మజ్ఞానం కలిగించారు.

ఇప్పుడు-
విద్యార్థులను ర్యాంకులుగా కనుగొన్న టీచర్లు/యాజమాన్యాలవారు ఆత్మహత్యలవైపు తోస్తున్నారు.

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

RELATED ARTICLES

Most Popular

న్యూస్