Tuesday, September 17, 2024
HomeTrending Newsరైల్వే నిర్లక్ష్యం వల్లే దుర్ఘటన : మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

రైల్వే నిర్లక్ష్యం వల్లే దుర్ఘటన : మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

రైల్వే అండర్ పాస్ నిర్మాణ లోపాల వల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇది ముమ్మాటికి రైల్వే శాఖ నిర్లక్ష్యంతోనే జరుగుతున్నాయని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని మహబూబ్‌నగర్‌ రూరల్ మండలం సూగూరు గడ్డ- మన్నెంకొండ స్టేషన్ల మధ్య రైల్వే అండర్ పాస్‌లో ప్రైవేటు స్కూలు బస్సు చిక్కుకున్న ఘటనపై మంత్రి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బీజేపీ సర్కార్‌ రైల్వేను దశలవారీగా ప్రైవేటీకరించేందుకు ప్రయత్నిస్తోందన్నారు. అందులో భాగంగా ఉద్యోగుల సంఖ్య తగ్గించుకునే క్రమంలోనే ఇప్పటికే అన్నిచోట్ల లెవెల్ క్రాసింగ్ లను తొలగిస్తూ అండర్ పాస్ లను నిర్మిస్తుందని విమర్శించారు.

నిర్మాణ లోపాలు సరైన డ్రైనేజీ విధానం ఏర్పాటు చేయకపోవడం వల్ల వర్షాకాలంలో అండర్ పాస్‌లు మడుగులను తలపిస్తున్నాయని.. తద్వారా ప్రమాదాలు జరిగే అవకాశం ఏర్పడిందని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. వర్షపు నీటిలో స్కూల్ బస్సు చిక్కుకుపోయిన ఘటనలో మంత్రి విద్యార్థుల తల్లిదండ్రులతో ఫోన్ లో మాట్లాడారు. 30 మంది విద్యార్థులు సురక్షితంగా బయటపడేలా చేసిన స్థానికులను ఆయన అభినందించారు. ఈ ఘటనపై రైల్వే అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైల్వే చీఫ్ ఇంజినీర్‌తో మాట్లాడి వెంటనే సంఘటన స్థలానికి వెళ్లి అండర్ పాస్‌ను పరిశీలించి నిర్మాణ లోపాలు సవరించి డ్రైనేజీ సిస్టం సక్రమంగా పనిచేసేలా చూడాలన్నారు. అండర్ పాస్‌ వద్ద గతంలోనూ ఇలాంటి ప్రమాదాలు జరిగాయని, భవిష్యత్తులో మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని మంత్రి పేర్కొన్నారు.

ఈ రోజు ఉదయం మన్యకొండ రైల్వేస్టేషన్ దగ్గర స్కూల్ బస్సు వరదల్లో చిక్కుకుపోయింది. వర్షాల కారణంగా రైల్వే అండర్ బ్రిడ్జి దగ్గర భారీగా వరద నీరు వచ్చింది. ఇది గమనించని డ్రైవర్ బస్సును ముందుకు పోనిచ్చాడు. కాగా బ్రిడ్జి మధ్యలోకి వెళ్లగానే వరద నీటిలో బస్సు నిలిచిపోయింది. దాదాపు సగం వరకు స్కూల్ బస్సు  నీట మునిగింది. ఈ సమయంలో బస్సులో మొత్తం 30 మందికిపైగా విద్యార్థులు ఉన్నారు. వెంటనే స్పందించిన స్థానికులు బస్సులోని విద్యార్థులను కాపాడారు. అనంతరం బస్సును తాళ్ల సాయంతో వెనక్కి తీసుకువచ్చారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బస్సు రామచంద్రాపురం నుంచి సుగూర్‌గడ్డతండాకు వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్