సూపర్‌స్టార్ మహేష్, తన సతీమణి నమ్రతతో కలిసి బుధవారం హైదరాబాద్ శివారులోని శంకరపల్లి గ్రామ సమీపంలోని మోకిలాలో చక్రసిద్ధ్` అనే చికిత్సా కేంద్రాన్ని ప్రారంభించారు. శాంతా బయోటిక్స్ చైర్మన్ కె.ఐ.వరప్రసాద్ రెడ్డి, ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి, యాంకర్ సుమ, రాజీవ్ కనకాల తదితరులు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. తమ శారీరక, మానసిక బాధలను తొలగించి నొప్పిలేని జీవితాన్ని గడపటానికి ఇది చక్కటి ప్రదేశమని నిర్వాహకురాలు డా.సత్య సింధూజ తెలిపారు. యోగ శాస్త్ర మద్దతుతో, 4000 సంవత్సరాల పురాతనమైనదిగా చెప్పబడే సిద్ధ వైద్యం, మానవ ఉనికి యొక్క శారీరక, ఆధ్యాత్మిక మరియు మానసిక అంశాలలో స్థిరమైన సమతుల్యతను కగిలిస్తుందని వెల్లడించారు.
ఈ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ.. అరుదైన చికిత్సా విధానాన్ని అందించే కేంద్రాన్ని ప్రారంభించడం తనకు సంతోషంగా ఉందని అన్నారు. డా.సత్య సింధూజ గారు చెప్పే సూచనలను పాటిస్తే మనం అద్భుతాలను చూడొచ్చని, మన జీవన శైలిని మార్చుకోవచ్చని తెలిపారు. ఇలాంటి ప్రామాణికమైన, పురాతనమైన, సంప్రదాయకమైన చికిత్సను ప్రమోట్ చేయడాన్ని సంతోషంగా భావిస్తున్నానన్నారు. ఇలాంటి అద్భుతమైన చికిత్సను గుర్తించడం, గౌరవించడం, అందరికీ తెలిసేలా చేయడం మన బాధ్యత అని మహేష్ అన్నారు.
నమ్రత మాట్లాడుతూ… మహేష్ కొంతకాలం మైగ్రేన్ సమస్యతో బాధపడ్డారు. అయితే ఈ చికిత్సతో ఆయనకు పూర్తిగా రిలీఫ్ కలిగింది. బాధ నుంచి విముక్తి కలిగించే ఈ అద్భుతమైన మార్గాన్ని ఆయన ప్రపంచానికి తెలియజేయాలనుకున్నారు. అందువల్ల ఆయన ఈ కేంద్రాన్ని ప్రారంభించారని చెప్పారు.
తాను కొంతకాలం స్పాండిలైటిస్ సమస్యతో బాధపడ్డానని, ఇప్పుడు పూర్తిగా నయమైందని, ఇప్పుడు మేం ఫ్యామిలీ ఫ్రెండ్స్ లా మారామని యాంకర్ సుమ వెల్లడించారు. తన భర్త రాజీవ్ కనకాలతో కలిసి ఆమె ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.