Friday, March 29, 2024
Homeస్పోర్ట్స్BCCI: గంగూలీ, జై షా లకు లైన్ క్లియర్

BCCI: గంగూలీ, జై షా లకు లైన్ క్లియర్

బోర్డు అఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బిసిసిఐ) అధ్యక్ష, కార్యదర్శులతో పాటు ఆఫీస్ బేరర్ల పదవీకాలం పొడిగించుకునే వెసులుబాటుకు భారత సర్వోన్నత న్యాయస్థానం అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు బోర్డు నియమ నిబంధనల్లో మార్పులు చేసుకోవచ్చని తీర్పు చెప్పింది. జస్టిస్ చంద్ర చూడ్, జస్టిస్ హిమా కోహ్లీ లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. ఈ తీర్పుతో ప్రస్తుత ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జై షాల పదవీ కాలం పొడిగించేందుకు మార్గం సుగమం అయ్యింది.

బోర్డు మౌలిక లక్ష్యాలను దెబ్బతీయకుండా…. అధ్యక్ష, కార్యదర్శుల పదవీ కాలం పెంపు కోసం నిబంధనల్లో మార్పు చేసుకునేందుకు అంగీకరిస్తున్నాం అంటూ తీర్పులో పేర్కొన్నారు.

బిసిసిఐ నిబంధనల ప్రకారం వరుసగా ఆరేళ్ళపాటు రాష్ట్రాల క్రికెట్ బోర్డులు లేదా బిసిసిఐ లో పదవులలో ఉంటే వారు తప్పనిసరిగా మూడేళ్ళపాటు విరామం (కూలింగ్ ఆఫ్ పీరియడ్) తీసుకోవాల్సి ఉంటుంది. ఈ లెక్కన గంగూలీ, షాల పదవీకాలం 2019 నాటికే ముగియాల్సి ఉంది. అయితే ఈ కూలింగ్ ఆఫ్ పీరియడ్ నిబంధనను ఎత్తివేస్తూ బిసిసిఐ సర్వసభ్య సమావేశం నిర్ణయం తీసుకుంది. దీనిపై కొందరు సుప్రీం లో పిటిషన్ దాఖలు చేశారు. కోవిడ్ కారణంగా ఈ పిటిషన్ ను సుప్రీం విచారించలేదు.

గంగూలీ, జై షాల పదవీకాలం ఈ సెప్టెంబర్ నాటికి ముగియాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ పిటిషన్ ను అత్యవసరంగా విచారణ చేపట్టాలంటూ బిసిసిఐ అభ్యర్ధించింది. దీనితో నేడు సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరిపి తీర్పు చెప్పింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్