మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను ఏప్రిల్ 30వ తేదీలోపు పూర్తి చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ కేసు విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని నిర్దేశించింది. ప్రస్తుతం ఈ కేసును విచారిస్తున్న సిబిఐ ఎస్పీ రాం సింగ్ ను కేసునుంచి తప్పించాలని ఆదేశించిన సర్వోన్నత న్యాయస్థానం… ఈ హత్య వెనుక ఉన్న కుట్ర కోణాన్ని బైట పెట్టాలని స్పష్టం చేసింది.
ఈ కేసులో ఐదవ నిందితుడు (ఏ5) గా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి భార్య తులశమ్మ దాఖలు చేసిన పిటిషన్ పై విచారించి నేడు తుదితీర్పు ఇచ్చిన ధర్మాసనం … దేవిరెడ్డి బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది. దర్యాప్తు పూర్తయిన ఆరు నెలల్లోగా విచారణ ప్రారంభం కాకపొతే రెగ్యులర్ బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
సిబిఐ డిఐజి కేఆర్ చౌరాసియా నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో సిట్ ఏర్పాటు చేసింది. ఎస్పీ వికాస్ సింగ్, ఏఎస్పీ ముఖేష్ కుమార్, ఇన్స్పెక్టర్లు ఎస్.శ్రీమతి, నవీన్ పునియా, అంకిత్ యాదవ్ లు ఈ టీమ్ లో ఉన్నారు.