Perarivalan: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న ఏ.జి. పెరరివలన్ కు విముక్తి లభించింది. అయన్ను విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం నేడు తీర్పు వెలువరించింది. తన జీవిత ఖైదును రద్దు చేయాలంటూ పెరరివలన్ వేసిన పిటిషన్‌పై విచారణ చేసిన సుప్రీం జడ్జీలు ఎల్ నాగేశ్వరరావు, జస్టిస్ బిఆర్ గవాయ్, ఎఎస్ బోపన్నలతో కూడిన ధర్మాసనం రాజ్యాంగంలోని 142వ అధికరణం ప్రకారం అతన్ని విడుదల చేస్తున్నట్లు తమ తీర్పులో పేర్కొన్నారు.
199, మే 21న శ్రీ పెరుబుదూర్ లో రాజీవ్ గాంధీ హత్యకు గురయ్యారు. అప్పటికి పెరరివలన్ వయసు 19 ఏళ్ళు. హత్య జరిగిన మరుసటి నెలలోనే జూన్ 11న చెన్నైలో అతణ్ణి అరెస్టు చేశారు. 31 ఏళ్లుగా ఈ కేసులో అతడు శిక్ష అనుభవిస్తున్నాడు. రాజీవ్‌గాంధీ హత్యకు వాడిన పేలుడు పదార్ధాలు, బ్యాటరీలు అందించారన్న అభియోగం అతనిపై నమోదైంది. 1999లో అతడికి మరణశిక్ష విధించినప్పటికీ దాన్ని జీవితఖైదుగా మారుస్తూ సుప్రీంకోర్టు 2014 లో నిర్ణయం తీసుకుంది.
పెరరివలన్ తో పాటు ఈ కేసులో శిక్ష అనుభవిస్తున్న ఇతర నిందితులు కూడా విడుదలయ్యేందుకు మార్గం సుగమం అయ్యింది. గతంలోనే వీరిని విడుదల చేయాలంటూ తమిళనాడు మంత్రివర్గం నిర్ణయంచి ఈ సిఫారసును గవర్నర్ కు పంపింది. దీనిపై తాత్సారం చేసిన గవర్నర్ తర్వాత దాన్ని రాష్త్రపతికి పంపారు. సుప్రీం కోర్టు ఈ ఏడాది మార్చి 15న బెయిల్ మంజూరు చేసింది. మూడు దశాబ్దాల తరువాత జైలునుంచి బైటికి వచ్చిన అయన నేటి నిర్ణయంతో పూర్తిగా కేసునుంచి బైట పడ్డారు.