రాజధాని అమరావతిపై దాఖలైన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు ధర్మాసనం డిసెంబర్ కు వాయిదా వేసింది. తేదీని అదే నెలల్లో ఖరారు చేస్తామని పేర్కొంది.
ఏపీ ప్రభుత్వంతోపాటు రైతులు, అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని రైతు సమాఖ్య విడివిడిగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ కేసును అత్యవసరంగా విచారణ జరపాలంటూ ఏపీ సర్కార్ తరపున కోరిన మాజీ అటార్నీ జనరల్ వేణుగోపాల్ చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు.
ఆగస్ట్ నుంచి రాజ్యాంగ ధర్మాసనాలు పలు కీలక కేసులను విచారించాల్సి ఉన్నందున డిసెంబర్ దాకా ఈ కేసుపై విచారణ జరపలేమని జస్టిస్ సంజయ్ ఖన్నా, జస్టిస్ బెలా త్రివేదిలతో కూడిన బెంచ్ తీర్పు చెప్పింది. రైతుల తరఫున దాఖలైన కేసుల్లో సర్వీస్ మేటర్స్ పూర్తి చేయాలని సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ లో రెస్పాన్డెంట్ లు కొందరు మరణించినందున వారి స్థానంలో బంధువులకు అవకాశం ఇవ్వాలని కూడా సర్వోన్నత న్యాయస్థానం నిర్దేశించింది.