సురేష్ ప్రొడక్షన్స్… టాలీవుడ్ లో ఎన్నో భారీ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ. మూవీ మొఘల్ డా.డి.రామానాయుడు ఈ నిర్మాణ సంస్థను స్థాపించారు. ఒక్క తెలుగులోనే కాకుండా.. భారతీయ భాషలన్నింటిలో సినిమాలు నిర్మించి.. భారతీయ సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకుంది. ఎంతో మంది నటీనటులు, సాంకేతిక నిపుణులను ఇండస్ట్రీకి పరిచయం చేసింది. రామానాయుడు స్థాపించిన ఈ సంస్థ బాధ్యతలు ప్రస్తుతం ఆయన తనయుడు దగ్గుబాటి సురేష్ బాబు, మనవడు రానా చూసుకుంటున్నారు.
ఈ సంస్థ సినిమా నిర్మాణమే కాకుండా.. డిస్ట్రిబ్యూషన్ రంగంలో కూడా ఉంది. అలాగే రామానాయుడు ఫిల్మ్ స్కూల్ ఏర్పాటు చేసి యంగ్ టాలెంట్ ని ప్రోత్సహిస్తున్నారు. ఇప్పుడు సురేష్ ప్రొడక్షన్స్ మ్యూజిక్ ఇండస్ట్రీలోకి ప్రవేశించింది. సురేష్ ప్రొడక్షన్స్ మ్యూజిక్ అనే లేబుల్ తో సంగీత పరిశ్రమలోకి అడుగుపెడుతున్నట్లు అఫిషయల్ గా అనౌన్స్ చేశారు. 50 ఏళ్లుగా సినిమా వారసత్వాన్ని ముందుకు తీసుకువెళుతున్న సురేష్ ప్రొడక్షన్స్ ఇప్పుడు సురేష్ ప్రొడక్షన్స్ మ్యూజిక్ అనే మ్యూజిక్ లేబుల్ ను ప్రారంభించడం ఆనందంగా ఉంది.
మ్యూజిక్ అనేది మన సినిమాలకు హృదయం లాంటిది. అందుకే సొంతంగా ఓ సంస్థ ఉండాల్సిన అవసరాన్ని మేము గుర్తించాం. SP మ్యూజిక్ మంచి సంగీతాన్ని ప్రొడ్యూస్ చేయడానికి ఒక వేదికగా ఉపయోగపడాలని.. సంగీత శక్తి కేంద్రంగా మారడం లక్ష్యంగా పెట్టుకుంది అని నిర్మాణ సంస్థ ప్రకటనలో తెలియచేసింది.