Birth Place:
“జయ హనుమాన జ్ఞానగుణసాగర జయ కపీశ తిహు లోక ఉజాగర;
రామదూత అతులితబలధామా అంజనిపుత్ర పవనసుత నామా;
మహావీర విక్రమ బజరంగీ కుమతి నివార సుమతి కే సంగీ…”
జ్ఞానగుణసాగరుడు, కపీశుడు, రామదూత అయిన అతులితబలధాముడు, అంజనిపుత్రుడు, పవనసుతుడు
మహావీర విక్రమ వజ్ర అంగుడు…అంటూ భాష తెలియకపోయినా అవధి భాషలో తులసీదాస్ రాసిన హనుమాన్ చాలీసాను భయభక్తులతో చదువుకుంటున్నాం. దక్షిణాది భాషల్లో ప్రార్థించకుండా ఇదేమిటని? హనుమంతుడు ఏనాడూ మనల్ను అడగలేదు. అడగడు. అడగాల్సిన అవసరం కూడా రాదు. అవధి చాలీసా సకల అవధులను దాటి విశ్వవ్యాప్తంగా హనుమ భక్తులకు పరమావధి ఎలా అయ్యిందో రాస్తే అదో పెద్ద రామాయణం. హనుమద్ ఉపాసనకు సంబంధించిన మంత్రశాస్త్ర రహస్యాలన్నిటినీ తులసీదాస్ ఈ చాలీసాలో ఒడుపుగా బిగించాడు. అందువల్లే దానికంత మహిమ. ఆదరణ. వ్యాప్తి.
సంస్కృతంలో హనువు/హనుమ అంటే దవడ. ఇంద్రుడి వజ్రాయుధం దెబ్బ తగిలి దవడలు పెరిగాయి అన్న కథ నిజమే అయినా…ఇది చాలా ప్రాథమిక స్థాయి అర్థం. నిజానికి హనుమ అక్షరాల్లో దాగిన హ లో అ; ను లో ఉ, మ లో మ్ కలిస్తే…అ ప్లస్ ఉ గుణ సంధి ఓ చివర మ్…మొత్తం “ఓం”కార స్వరూపుడు హనుమ అన్నది అంతరార్థం అని సామవేదం షణ్ముఖ శర్మ వంటి పెద్దల విశ్లేషణ. మనం మాట్లాడే మాటలకు గాలి ఆధారం. హనుమ పవన సుతుడు. మనం మాట్లాడే మాటలకు దవడలు ఆధారం. హనుమ అక్కడున్నాడు. ఇంతకంటే లోతుగా వెళ్లడానికి ఇది సందర్భం కాదు.
అలాంటి హనుమకు ఇప్పుడు పెద్ద చిక్కొచ్చి పడింది. చిరంజీవిగా ఉండమని రాముడు కోరాడు; చిరాయువు కమ్ము బ్రహ్మ కల్పాంతముల్ అని సీతమ్మ దీవించింది కాబట్టి హనుమ చిరంజీవి. భవిష్యత్ బ్రహ్మ.
ఎక్కడున్నా హనుమ వెంటనే వచ్చి…తను ఎక్కడ పుట్టాడో? అప్పుడు పంచాయతీ వాళ్ళో, మునిసిపాలిటీ, కార్పొరేషన్ వాళ్ళో ఇచ్చిన బర్త్ సర్టిఫికేట్ లో డేట్ ఆఫ్ బర్త్ ఎక్కడుందో చూపించకపోతే మనం తన్నుకుని చచ్చేలా ఉన్నాం.
తిరుమల అంజనాద్రి జపాలి, మహారాష్ట్ర ఆంజనేరి, కర్ణాటక హంపి దగ్గర హనుమంత హళ్లిల్లో ఎక్కడ పుట్టాడో హనుమ తనకు తాను తక్షణం చెప్పుకోకపోతే హిందూ సమాజం పరస్పరం కోతి మూకల కంటే హీనంగా కీచులాడుకుని… గిచ్చుకుని…రక్కుకుని…రక్తాలు కారినా…ఆగేలా లేదు.
వేదాలు, పురాణాల్లో ఉన్న మన్వంతరాలు, యుగాల కాల ప్రమాణం వేరు. యుగానికొక నాలుగు వేల సంవత్సరాలు అని మనం వేసుకుంటున్న కాకి లెక్కలు వేరు. ఒక వృత్తం పూర్తయి మళ్లీ త్రేతాయుగం వస్తే…మళ్లీ రాముడు రావాలి. హనుమ రావాలి. ఇది సామాన్య దృష్టికి అందదు.
హనుమ జన్మ స్థలాన్ని తేల్చగల వేద, పురాణ, సకల శాస్త్ర పారంగతులు ఇప్పుడు ఒకవేళ నిజంగా ఉన్నా…ఉండి తేల్చినా…దానివల్ల హిందూ సమాజానికి లాభం కంటే నష్టమే ఎక్కువ. హనుమద్భక్తులకు పులకింతలకంటే చికాకులే ఎక్కువ. భక్తి విశ్వాసాలకు గౌరవం కంటే అగౌరవమే ఎక్కువ. సంప్రదాయానికి, మర్యాదలకు మన్నన కంటే అవమానాలే ఎక్కువ.
“అణురేణు పరిపూర్ణమైన రూపము…
అణిమాదిసిరి అంజనాద్రిమీది రూపము…”
అని అన్నమయ్య స్పష్టమయిన తెలుగులో చెప్పింది ఈ “ఏకం సత్ విప్రా బహుధా వదంతి” గురించే. రూపం వేరయినా కొలిచే పరబ్రహ్మ ఒకడే అని ఈ ప్రపంచానికి అర్థం కావడానికి అన్నమయ్య 32వేల కీర్తనల ఉదాహారణలతో రుజువు చేశాడు. అయినా మన బతుకులు…
రాత్రంతా రామాయణం విని పొద్దున్నే హనుమ ఎక్కడ పుట్టాడు? అని అడగాల్సిందే.
సర్వసంగ పరిత్యాగులు, పీఠాధిపతులు, మౌనంలో విశ్వానికి దారి చూపాల్సిన మునులు…జుట్లు పట్టుకోవడం ఏమిటి? వాదులాడుకోవడం ఏమిటి? బాహాబాహీలకు దిగడం ఏమిటి? అది కూడా హనుమ పుట్టిన చోటు గురించి. అవతార పురుషులకు కూడా మన వికారాలనే అంటగట్టాలా?
తెలుగువారికి హనుమ అంజనాద్రిలోనే పుట్టాడు. కన్నడవారికి హనుమంత హళ్లిలోనే పుట్టాడు. మరాఠీలకు ఆంజనేరిలోనే పుట్టాడు. ఇలా ప్రతి రాష్ట్రంలో…ప్రతి ఊళ్లో హనుమ పుట్టి ఉంటాడు. హనుమ విగ్రహం లేని దారి ఉంటుందా? హనుమాలయం లేని ఊరు ఉంటుందా?
రాముడు అయోధ్యలోనే ఉండిపోతే ఇక భద్రాద్రి ఎందుకు?
“యత్ర యత్ర రఘునాథ కీర్తనం, తత్ర తత్ర కృతమస్తకాంజలిం, బాష్పవారి పరిపూర్ణ లోచనం, మారుతిం నమతః రాక్షసాంతకం”
హనుమంత హళ్లి, ఆంజనేరి, జపాలి, బీచుపల్లి, కలశాపురాలు దాటి…ఎక్కడెక్కడ రామ కీర్తన జరుగుతూ ఉంటుందో… అక్కడక్కడ నీరు నిండిన కన్నులతో, ముకుళిత హస్తాలతో ఉన్న హనుమకు నమస్కారం అని నిత్యం ప్రార్థన శ్లోకంలో చెప్పుకుంటున్నాం.
హనుమ పుట్టినచోటును వివాదం చేసి…కొట్టుకుంటున్న స్వాములకు ఈ శ్లోకం, ప్రతిపదార్థం, భావం, అసలు అర్థం, అంతరార్థాలు ఎవరయినా విడమరిచి చెబితే బాగుండేది.
సామాన్య భక్తులమయిన మనకెందుకు ఆ గొడవ?
పుట్టాల్సిన అవసరమే లేని హనుమ మన ఊళ్లోనే పుట్టాడు. మన కోసమే పుట్టాడు. మన ఇంట్లోనే కొలువై ఉన్నాడు. మనల్ను వేధించే రాక్షసుల పని పట్టడానికి మన వెంటే వస్తున్నాడు. వస్తూనే ఉంటాడు. మనకు తెలిసింది ఇంతే.
మీరు జ్ఞానులు స్వామీ!
“యస్య సర్వే సమారంభాః కామసంకల్పవర్జితాః;
జ్ఞానాగ్నిదగ్ధకర్మాణాం తమాహుః పండితం బుధాః”
జ్ఞానమనే అగ్నిలో కర్మలను, బంధాలను, మోహాలను, కోరికలను, గొడవలను, నీ నా తరతమ భేదాలను, ఎక్కువ తక్కువలను, పట్టింపులను, అనవసరమయిన విషయాలకు జుట్లు పట్టుకోవడాలను…సర్వాన్నీ కాల్చి బూడిద చేసుకున్నవారినే పండితులంటారని గీతలో కృష్ణుడు బోధించడాన్ని మీరేమీ పట్టించుకోకండి స్వాములూ!
కొట్టుకోండి!
ఇంకా బాగా తన్నుకోండి!
సాక్షాత్తు హనుమంతుడే వచ్చి బర్త్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, బోనఫైడ్ సర్టిఫికేట్, స్కూల్ టీ సీ, పాస్ పోర్ట్, ఆధార్ కార్డు చూపే వరకు విశ్రమించవద్దు!
“జయత్యతి బలో రామో లక్ష్మణస్య మహా బలః,
రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభి పాలితః,
దాసోహం కౌసలేంద్రస్య రామస్యాక్లిష్ట కర్మణః,
హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మారుతాత్మజః,
న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్,
శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రహః,
అర్ధ ఇత్వామ్ పురీం లంకాం అభివాద్యచ మైథిలీమ్,
సమృద్ధార్థో గమిష్యామి మిహతామ్ సర్వ రాక్షసాం”
శత్రువులను పిడిగుద్దులతో చంపేస్తాను. రాళ్లు తీసుకుని కొడతాను. అరికాలితో తొక్కేస్తాను. వేయిమంది రావణులు వచ్చినా దోమలను నలిపినట్లు నలిపేస్తాను. లంకను బూడిద చేస్తాను…అని రామ లక్ష్మణ సుగ్రీవ సీతమ్మలకు నమస్కరించి హనుమ చేసిన ప్రతిజ్ఞ.
ఇప్పుడు…
హనుమ పిడిగుద్దులకు ఎవరు అర్హులు?
రాతి దెబ్బలు ఎవరికి?
అరికాలి కింద నలిగేవారెవరు?
దోమల్లా రాలిపోయేదెవరు?
రావణాసురుడికంటే ఎక్కువగా తలలు, ఆ తలల్లో వేయి విధాల వెర్రి ఉన్నదెవరికి?
మీరే కనుక్కుని మాకు జ్ఞానం ప్రసాదించండి స్వాములూ!
-పమిడికాల్వ మధుసూదన్
Also Read :