ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ లు హింసతో, మిలిటరీ కుట్రలతో అధికారంలోకి వస్తే గుర్తించేది లేదని యురోపియన్ యూనియన్ ప్రకటించింది. ఇతర దేశాలు కూడా తాలిబాన్ విధానాల్ని హర్షించవని స్పష్టం చేసింది. అలవి కాని నిభందనలతో ప్రజలను వేధిస్తున్న తాలిబాన్ లు హింసను విడనాడాలని ఆఫ్ఘనిస్తాన్ లో ఈయు బృందం ప్రతినిధి థామస్ నికల్సన్ విజ్ఞప్తి చేశారు. షరియా అమలు చేసి ఇస్లామిక్ రాజ్యంగా మార్చాలని తాలిబాన్ లు చూస్తున్నారని, అదే జరిగితే మళ్ళీ అంతర్యుద్ధం తప్పదని హెచ్చరించారు.
అమెరికా, నాటో బలగాల ఉపసంహరణ నేపథ్యంలో తాలిబాన్ ల అరాచకాలు పెరిగాయని యురోపియన్ యూనియన్ వెల్లడించింది. మిలిటరీ కుట్రలతో కాకుండా ప్రజాస్వామ్య పద్దతిలో అధికారంలోకి రావాలని తాలిబాన్ కు యురోపియన్ యూనియన్ విజ్ఞప్తి చేసింది.
ఆఫ్ఘనిస్తాన్ లో సుమారు 450 జిల్లాలు ఉండగా సగం వరకు ఇప్పటికే తాలిబాన్ అధీనంలోకి వచ్చాయి. తమ అధీనంలోని ప్రాంతాల్లో మహిళలు ఒంటరిగా బహిరంగ ప్రదేశాల్లోకి రావటంపై నిషేధం, పురుషులు గడ్డం పెంచాలని ఆదేశాలు జారీ చేశారు. స్త్రీ,పురుషులు సంప్రదాయ వస్త్రధరాణ చేయాలని, నిభంధనలు అతిక్రమిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని తాలిబాన్ మూకలు హెచ్చరికలు జారీ చేశాయి.
ఇన్నాళ్ళు ప్రభుత్వానికి మద్దతుగా ఉన్న వాళ్ళను తాలిబాన్ లు హతమారుస్తున్నారు. తాలిబాన్ ఉగ్రవాదులకు పెళ్ళిళ్ళు చేసేందుకు గ్రామాలు, పట్టణాల్లో మహిళలు, యువతుల అపహరణ నిత్యకృత్యంగా జరుగుతోంది.