నందమూరి తారకరత్నకు బెంగుళూరులోని నారాయణ హృదయాలయలో మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ఈ రోజు జూనీయర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ బెంగుళూరు హాస్పటల్ కి వెళ్లి తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. కన్నడ స్టార్ శివరామ్ కుమార్, కర్నాటక హెల్త్ మినిష్టర్ సుధాకర్ కూడా హాస్పటల్ కి వచ్చి తారకరత్న ఆరోగ్య పరిస్థితి పై ఆరా తీశారు. తారకరత్నను చూసిన తర్వాత ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ భావోద్వేగానికి లోనైయ్యారు.
అనంతరం మీడియా ముందు ఎన్టీఆర్ మాట్లాడుతూ “అన్నతారకరత్న బాగా పోరాడుతున్నారు. వైద్యంతో పాటు ఆత్మబలం మనోబలంతో పోరాడుతున్నారు. అభిమానుల ఆశీర్వాదం ఉంది. తాతా గారి ఆశీర్వాదం ఉంది. ఎంతో మంది ఆశీర్వాదం ఆయనకు ఉంది. త్వరలోనే తారకరత్న కోలుకుని ఇది వరకటి లాగానే మన అందరితో ఆనందంగా ఉండాలని ఆ దేవుడిని మనసారా కోరుకుంటున్నాను. ఇదో అనుకోని సంఘటన. ఈ ఆస్పత్రి వారు చాలా మంచి వైద్యాన్ని అందిస్తున్నారు. మనం అందరం ఆయన కోలుకోవాలని ప్రార్ధిద్దాం. మీరందరూ మీ ప్రేయర్స్ ను అన్న తారకరత్నకు అందించాలి. ఇక తమతోపాటు ఉండి.. అన్నయ్య తారకరత్నకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తోడ్పాటు నందించిన కర్ణాటక హెల్త్ మినిస్టర్ సుధాకర్ గార్కి ప్రత్యేక ధన్యవాదాలు. నాకెంతో ఆప్తులు. ఇలాంటి సందర్భంలో ఆయన కూడా ఉండి సహాయం అందించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తారకరత్నను స్వయంగా నేను చూశాను.. స్పందిస్తున్నారు.. మెరుగైన వైద్యం అందుతోంది. నిమ్స్ నుంచి ఇద్దరు వైద్యులను కూడా తెప్పించి పరిశీలిస్తున్నారు. అందరి ఆశీర్వాదంతో ఆయన కోలుకుంటారు. ఆయన ఆరోగ్యం విషమంగా ఉన్నా నిలకడగా ఉన్నారని.. వైద్యానికి స్పందిస్తున్నారని వైద్యులు చెప్పారు. ఎక్మో చికిత్సలో లేరు. స్పందిస్తున్నారు” అని వెల్లడించారు.