Sunday, May 19, 2024
HomeTrending Newsరెండేళ్ళు ఆగండి, అధికారం మనదే: లోకేష్

రెండేళ్ళు ఆగండి, అధికారం మనదే: లోకేష్

రాష్ట్రంలో రెండేళ్లలో ఒక్క పరిశ్రమ కూడా రాలేదని, కానీ గంజాయి పరిశ్రమ మాత్రం రాష్ట్రమంతా విస్తరించిందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా నిత్యావసర వస్తువుల ధరలు అన్నీ పెరిగిపోయాయని చెప్పారు. టిడిపి కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు చేపట్టిన 36 గంటల ప్రభుత్వ ఉగ్రవాద దీక్షలో లోకేష్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అయన ప్రసంగిస్తూ తమ నాయకుడు చంద్రబాబుకు ఓర్పు, సహనం ఎక్కువని, మహాత్మాగాంధీ ఇచ్చిన స్పూర్తితో అయన ముందుకు వెళుతున్నారని కానీ పార్టీ యువరక్తంగా తాము మాత్రం అలా కాదని… మా పార్టీ కార్యకర్తల జోలికొస్తే ఊరుకునే ప్రసక్తే లేదని, ఒక చెంప మీద కొడితే రెండు చెంపలూ వాయిస్తామని హెచ్చరించారు. తమ పార్టీ కార్యకర్తలను ఇలాగే ఇబ్బంది పెడితే తాము అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ నేతలు దేశంలో ఎక్కడున్నా వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు.

గతంలో తాను కనీసం పోలీస్ స్టేషన్ గడప కూడా తొక్కలేదని, కానీ జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత తన మీద 11 కేసులు పెట్టారని, రెండ్రోజుల క్రితం 307 సెక్షన్ కూడా నమోదు చేశారని తెలిపారు. అడ్డగోలు కేసులు పెడితే ఇంకా స్పీడుగా దూసుకెల్తానని,  తప్పుడు కేసులు పెడితే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రెండేళ్ళు ఓపిక పట్టాలని, వచ్చే ఎన్నికల్లో టిడిపి రైలు అధికార పీఠం వైపు దూసుకు వెళుతోందని, 2024 ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. మంగళగిరి ఎమ్మెల్యే స్థానాన్ని 2024లో రీ మెజార్టీతో విజయం సాధించి కానుకగా ఇస్తామని చంద్రబాబు లోకేష్ భరోసా ఇచ్చారు.

వైసీపీ నేతలు పోలీసులు లేకుండా బైటికి రావాలని, అప్పుడు తమ పార్టీ కార్యకర్తల సత్తా ఏమిటో చూపిస్తామని సవాల్ విసిరారు. వైసీపీ గూండాల దాడిలో మా పార్టీ కార్యాలయంలో పగిలింది అద్దాలు మాత్రమేనని, ఇది ఆంధ్రుల దేవాలయం అని, 70 లక్షల మంది కార్యకర్తలకు ఇది ఇళ్లు లాంటిదని అలాంటి కార్యకర్తల ధైర్యాన్ని దేబ్బతీయలేరని తేల్చి చెప్పారు. అధికార పార్టీ పెడుతున్న కేసులకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని లోకేష్ ధైర్యం చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్