It is Wonder: టిడిపి-జనసేన కలిసి పోటీ చేయడమే పవన్ కళ్యాణ్ చెబుతున్న అద్భుతమని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామ కృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. అద్భుతం అంటూ ఒకసారి, వ్యూహం అని మరోసారి సినిమాటిక్ డైలాగులు పవన్ చెబుతున్నారని అన్నారు. కౌలు రైతుల యాత్ర అంటూ బయల్దేరిన పవన్ మీడియాలో సంచలనం కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు డైరెక్షన్ ప్రకారమే పవన్ కార్యక్రమాలు, పర్యటనలు, వ్యాఖ్యలు, నినాదాలు ఉంటాయని, మొదటినుంచీ ఇద్దరూ సమన్వయంతోనే ఉన్నారని వెల్లడించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో సజ్జల మీడియాతో మాట్లాడారు. రాజకీయ పార్టీకి ఓ స్పష్టమైన విధానం ఉండాలని, కానీ ఈ రెండు పార్టీలకు అధికారం తప్ప ఇంకేం కనిపించడం లేదని దుయ్యబట్టారు.
వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వబోనని ఒకరు, కలిసి పోరాడదాం అని మరొకరు అంటే వారంతా పొత్తుల కోసం ప్రయతిస్తున్నట్లు కాదా అని ప్రశ్నించారు. త్యాగాలకు సిద్ధమని ఒకరు అంటే, తానే సిఎం అని మరొకరు అంటున్నారని గుర్తు చేశారు. చంద్రబాబు ఓ వైపున త్యాగాలకు సిద్ధం అంటూనే మరోవైపున ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమానికి నాయకత్వం వహిస్తానని అంటున్నారని సజ్జల ఎద్దేవా చేశారు. పవన్ వ్యూహం అని అంటున్నారని, వ్యూహం అంటే ఏమిటని నిలదీశారు. చంద్రబాబు, పవన్ లు ప్రజలను చులనకగా భావిస్తున్నారని సజ్జల వ్యాఖ్యానించారు. చంద్రబాబు చెప్పిన త్యాగానికి అర్ధం ఏమిటని, పవన్ కళ్యాణ్ కు సిఎం పదవి ఇస్తారా? లేకపోతే ఇద్దరు సిఎంలు ఎలా ఉంటారో చెప్పాలన్నారు. 2014 నుంచీ బాబు-పవన్ పొత్తులోనే ఉన్నారని, బాబును సిఎం చేయడమే పవన్ లక్ష్యమని అన్నారు. 2019లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవడానికేపవన్ బైటకు వచ్చి పోటీ చేశారని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో వైసీపీ కాకుండా మూడు పార్టీలే… టిడిపి, జనసేన, బిజెపి ఉన్నాయని… టిడిపితో పొత్తు ప్రసక్తే లేదని బిజెపి స్పష్టంగా చెబుతోందని, ‘వ్యతిరేక ఓటు చీలనివ్వబోమని అంటే టిడిపి, జనసేన కలుస్తున్నట్లే కదా’ అన్నారు సజ్జల. బిజెపి-జనసేన పొత్తులో ఉంటే చంద్రబాబు ఒకవేళ శివసేన, సమాజ్ వాదీ పార్టీ, పాల్ పార్టీలతో ఏమైనా పొత్తులు పెట్టుకుంటారా అని సజ్జల వ్యంగ్యంగా అన్నారు. స్పష్టత లేకుండా మాట్లాడుతూ, ఊహా ప్రపంచంలో ఉన్నారని విమర్శించారు.
Also Read : అద్భుతం జరుగుతుంది: పవన్ వ్యాఖ్యలు