Saturday, November 23, 2024
HomeTrending Newsఆ వ్యాఖ్యలు తీవ్రంగా పరిగణిస్తున్నాం: డిజిపి

ఆ వ్యాఖ్యలు తీవ్రంగా పరిగణిస్తున్నాం: డిజిపి

రాష్ట్రంలో నిన్న జరిగిన వరుస సంఘటనలు దురదృష్టకరమని, గర్హనీయమని రాష్ట్ర డిజిపి గౌతమ్ సావాంగ్ వ్యాఖ్యానించారు. టిడిపి అధికార ప్రతినిధి చేసిన వ్యాఖ్యలు అత్యంత దారుణమని, ఆ వ్యాఖ్యలు ఉద్దేశ పూర్వకంగా చేసినవేనని, ఇలాంటి భాష గతంలో ఎన్నడూ ఉపయోగించలేదన్నారు. పట్టాభి ఈ వ్యాఖ్యలు నోరు జారి చేసినవి కావని, పలుసార్లు అవే పదాలు ఉపయోగించారని, అది కూడా ఒక పార్టీ ఆఫీస్ నుంచి మీడియా సమావేశం పెట్టి ఈ వ్యాఖ్యలు చేశారని డిజిపి అన్నారు.  రాజ్యంగబద్ధమైన పదవుల్లో ఉన్న వ్యక్తులపై అలాంటి భాష ప్రయోగించడం హేయమని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రిపై ఈ రకంగా వ్యాఖ్యలు చేస్తారా అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలను తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు నిరసనగానే ప్రతిస్పందన వచ్చిందన్నారు. ఈ మొత్తం ఘటనపై విచారణ జరుపుతున్నామని, వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలు హద్దులు దాటి, నిన్నటి ఘటనకు దారి తీశాయని డిజిపి పేర్కొన్నారు.

నిన్న చంద్రబాబు ఫోన్ చేస్తే తాను స్పందించలేదన్న ఆరోపణలను డిజిపి ఖండించారు. ఒక అపరిచిత నంబర్ నుంచి వాట్సాప్ కాల్ వచ్చిందని, ఆ సమయంలో పోలీస్ పరేడ్ బ్యాండ్ లో ఉన్నానని, వినిపించలేదని అందుకే తర్వాత మాట్లాడతానని చెప్పి కాల్ కట్ చేసినట్లు వెల్లడించారు. టిడిపి నాయకుల ఫోన్ కు గుంటూరు రూరల్ ఎస్పీ స్పందించారని డిజిపి వివరణ ఇచ్చారు.

ఇటీవల వెలుగు చూసిన డ్రగ్స్ కేసులు డి.ఆర్.ఐ., సీబిఐ, ఎన్.ఐ.ఏ., ఈడీ, ఐబీ లాంటి అన్ని కేంద్ర సంస్థలూ  కలిసి దర్యాప్తు చేస్తున్నాయని, మూడు వేల కేజీల హెరాయిన్ పట్టుబడిందని, ఇది సాధారణమైన కేసు కాదని డిజిపి స్పష్టం చేశారు. ఈ కేసుతో ఆంధ్ర ప్రదేశ్ కు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. రాష్ట్రానికి ఒక్క గ్రాము డ్రగ్ కూడా రాలేదని, ఈ విషయాన్ని వెంటనే విజయవాడ పొలీస్ కమిషనర్ మీడియాకు చెప్పారని గుర్తు చేశారు.

కేంద్ర సంస్థలతో నిరంతరం తాను టచ్ లోనే ఉన్నానని డిజిపి చెప్పారు. డ్రగ్స్ తో రాష్ట్రానికి సంబంధం లేదని కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా స్పష్టంగా చెప్పాయని, అయినా సరే విమర్శలు కొనసాగిస్తున్నారని డిజిపి అసహనం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్