Saturday, November 23, 2024
Homeసినిమారోటీన్ డ్రామా నడిపించిన 'తీస్ మార్ ఖాన్'

రోటీన్ డ్రామా నడిపించిన ‘తీస్ మార్ ఖాన్’

Movie Review: ఆది సాయికుమార్ హీరోగా కల్యాణ్ జీ గోగణ దర్శకత్వంలో రూపొందిన ‘ తీస్ మార్ ఖాన్‘ నిన్న థియేటర్లకు వచ్చింది. నాగం తిరుపతి రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో, కథానాయికగా పాయల్ నటించింది. ఇతర ముఖ్య పాత్రలలో సునీల్ .. అనూప్ సింగ్ ఠాకూర్ .. కబీర్ దుహాన్ సింగ్ .. పూర్ణ .. శ్రీకాంత్ అయ్యంగార్ కనిపిస్తారు. సాయికార్తీక్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, ప్రమోషన్స్ పరంగా కాస్త హడావిడి చేస్తూనే  థియేటర్లకు వచ్చింది. కాకపోతే ఈ సారైనా కొత్తగా  ఆది సాయికుమార్ ఏమైనా చేశాడా అనే ఆసక్తితో థియేటర్లకు వెళ్లినవారు నిరాశగానే తిరిగి వస్తారు.

చిన్నప్పుడు తన ఆకలి తీర్చి అమ్మ స్థానంలో నిలబడిన పూర్ణ చుట్టూ .. ఆమెను తల్లిగా భావిస్తూ ప్రాణంగా ప్రేమించే ‘తీస్ మార్ ఖాన్ (ఆది సాయికుమార్) చుట్టూ ఈ కథ తిరుగుతుంది. పది .. పన్నెండేళ్ల వయసులోనే 30 మంది రౌడీలను మట్టికరిపించి, ‘తీస్ మార్ ఖాన్’ అనే  పేరును పోలీస్ స్టేషన్ లోనే సొంతం చేసుకున్న ఘనుడు హీరో. తిరగబడటమనేది చిన్నప్పటి నుంచే అలవాటుగా పెరిగిన తీస్ మార్ ఖాన్, అధికారం చేతిలో ఉన్న హోమ్ మినిస్టర్ కీ .. అవినీతి సామ్రాజ్యాన్ని విస్తరించిన జీజేకి మధ్యలో నిలబడవలసి వస్తుంది. అప్పుడు ఆయన ఏం చేశాడనేదే కథ.

ఈ కథలో లవ్  ఉంది .. యాక్షన్ ఉంది .. ఎమోషన్ ఉంది. మాస్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని అల్లుకున్న సీన్స్ ఉన్నాయి .. లేనిదల్లా కొత్తదనమే. ఏ సన్నివేశాన్ని పట్టుకున్నా ఇంతకుముందు ఏదో ఒక సినిమాలో చూసినట్టుగానే అనిపిస్తూ ఉంటుంది. ట్విస్టులు ఉన్నప్పటికీ ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోకపోవడానికి కారణం ఇదే. పాయల్ గ్లామర్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచింది. ఆమె కంటే హీరోకి తల్లి పాత్రను పోషించిన పూర్ణ గ్లామర్ గా కనిపించింది. సంగీతం పరంగా రెండు పాటలు ఆకట్టుకుంటాయి. ఫొటోగ్రఫీకి మంచి మార్కులే ఇవ్వొచ్చు.

ఎడిటింగ్ పరంగా చూసుకుంటే చాలా పని మిగిలి ఉన్నట్టుగానే అనిపిస్తుంది. హీరో బాల్యానికి సంబంధించిన సీన్స్ .. కాలేజ్ సీన్స్ మరీ కృతకంగా అనిపిస్తాయి. సహజత్వం లోపించడమే కథ కనెక్ట్ కాకపోవడానికి ప్రధానమైన కారణంగా చెప్పుకోవాలి. ఆది సాయికుమార్ మంచి నటుడు .. డాన్స్ .. ఫైట్స్ విషయాల్లోను ఆయనకి వంక బెట్టడానికి ఉండదు. హడావిడిగా ఏదో ఒక సినిమా చేవలసిన అవసరం లేని బలమైన కుటుంబ నేపథ్యం ఉంది. కానీ ఆయన రోటీన్ కథలను ఎంచుకుంటూ వెళుతున్నాడు. అలా కాకుండా ఆయన కొత్తదనం దిశగా అడుగులు వేసి తీరవలసి సమయం వచ్చేసినట్టే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్