Wednesday, June 26, 2024
HomeTrending NewsTelangana Cabinet : సమతూకానికి తొలి ప్రాధాన్యత

Telangana Cabinet : సమతూకానికి తొలి ప్రాధాన్యత

తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరు అనేది కాంగ్రెస్ లో సమాలోచనలు జరుగుతున్నాయి. కష్ట కాలంలో పార్టీ పగ్గాలు చేపట్టి కార్యాచరణకు దిగిన రేవంత్ రెడ్డికి ఇచ్చేందుకే అవకాశాలు మెండుగా ఉన్నాయి. తెలంగాణలో మొదటిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్… ప్రజాపాలన అందిస్తామని చెప్పేందుకు కొత్త ఎత్తుగడ వేస్తోందని ఓ టాక్ నడుస్తోంది. భట్టిని సిఎం చేస్తే దళితుడిని సిఎం చేసిన ఘనత కాంగ్రెస్ కు దక్కుతుందని… రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో దీని ప్రభావం ఉంటుందని పార్టీలో చర్చలు జరుగుతున్నాయి.
మరోవైపు మంత్రివర్గ కూర్పు మీద గాంధీభవన్ లో జోరుగా మంతనాలు జరుగుతున్నాయి. పదేళ్ళ తర్వాత అధికారంలోకి రావటంతో ఆశావాహులు అధికంగా ఉన్నారు. ఉమ్మడి జిల్లాల వారిగా కాంగ్రెస్ క్యాబినెట్లో ఉండే మంత్రుల వివరాలు పరిశీలిస్తే ఈ విధంగా ఉండే అవకాశం ఉంది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చెన్నూరులో గెలుపొందిన గడ్డం వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది.  ప్రేమ్ సాగర రావు మంచిర్యాల నుంచి గెలిచారు. పార్టీ గడ్డు పరిస్థితుల్లో ఉన్నపుడు ఆదుకున్న ప్రేమ్ సాగర్ రావు పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. పార్టీని వీడకుండా ఉన్న గడ్డం వినోద్ బెల్లంపల్లిలో గెలిచారు. వివేక్ పార్టీలు మారినా వినోద్ కాంగ్రెస్ లోనే కొనసాగారు. ఇది వరకు మంత్రిగా ఉన్న అనుభవం… పార్టీ విధేయుడిగా వినోద్ కు దక్కవచ్చని పార్టీ నేతలు అంటున్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నుంచి పొన్నం ప్రభాకర్ గెలిచారు. మంథని నుంచి దుద్దిల్ల శ్రీధర్ బాబులు రేసులో ఉన్నారు. సామాజిక వర్గాల ప్రకారం వీరిద్దరికీ దక్కే అవకాశం ఉంది. MLC కోటాలో జీవన్ రెడ్డికి ఇచ్చినా ఆశ్చర్య పోనక్కరలేదు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ములుగు నుంచి గెలిచిన సీతక్కకు మంత్రి వర్గంలో బెర్తు ఖాయం. వరంగల్ తూర్పు నుంచి గెలిచిన కొండా సురేఖ కూడా పోటీ పడుతున్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా పాలేరు నుంచి గెలిచిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మం నుంచి గెలిచిన తుమ్మల నాగేశ్వరరావు మదిర నుంచి గెలిచిన మల్లు భట్టి విక్రమార్కలకు దాదాపు ఆమాత్య పదవులు ఖాయంగా కనిపిస్తోంది.
ఉమ్మడి నల్గొండ జిల్లా నల్గొండ నుంచి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, హుజూర్ నగర్ నుంచి గెలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు కీలక శాఖలు దక్కుతాయి. మునుగోడు నుంచి గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి పార్టీలు మారటం ప్రతిబంధకం కాగా ఇద్దరు అన్నదమ్ములలో అన్నకే ఛాన్స్ దక్కుతుంది అంటున్నారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కోడంగల్ నుంచి గెలిచిన పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నా కొల్లాపూర్ నుంచి గెలిచిన జూపల్లి కృష్ణారావుకు అవకాశాలు అధికంగా ఉన్నాయి.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నుంచి గెలిచినా మల్రెడ్డి రంగారెడ్డి సీనియర్ కావటంతో ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
ఉమ్మడి నిజామాబాదు జిల్లా బోధన్ నుంచి గెలిచిన సుదర్శన్ రెడ్డి, ఎల్లారెడ్డి నుంచి గెలిచిన మదన్ మోహన్ రావు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. నిజామాబాద్ అర్బన్ లో ఓడిపోయిన షబ్బీర్ అలీ సీనియర్ కావటం… పార్టీ ఆదేశాలకు అనుగుణంగా కామారెడ్డి సీటు త్యాగం చేయటం, మైనారిటీ కోటాలో మంత్రి పదవి ఇచ్చి MLC చేస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి.
ఉమ్మడి మెదక్ జిల్లా ఆందోల్ నుంచి గెలిచిన దామోదర్ రాజనర్సింహ గతంలో ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. సీనియర్ నేతగా రాజనర్సింహకు మంత్రి పదవి ఇస్తే SCల్లో మాదిగ వర్గానికి ప్రాతినిధ్యం దక్కినట్టవుతుంది.
హైదరాబాదు నుంచి ఇద్దరు నేతలకు ఎమ్మెల్సీ పదవులను ఇచ్చి మంత్రులుగా తీసుకోవడం జరుగుతుందని… ఇందులో ఫిరోజ్ ఖాన్, మధుయాష్కి గౌడ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఫిరోజ్ ఖాన్ కు పదవి ఇవ్వటం ద్వారా మజ్లీస్ ను ఎదుర్కోవటం సులభమవుతుందని…ఫిరోజ్ ఖాన్ మాత్రమే ఒవైసీ సోదరుల వ్యూహాలను ఎదుర్కోగలడని బావిస్తున్నారు.
షబ్బీర్ అలీ, జీవన్ రెడ్డి ల్లో ఎవరో ఒకరిని శాసనమండలి చైర్మన్ చేస్తారని అంటున్నారు. వారిద్దరు గెలిస్తే ఒకరు శాసనసభ స్పీకర్ అయ్యేవారని పార్టీలో చర్చ జరుగుతోంది.
సామాజిక వర్గాల ప్రకాటం చూసినా… ఈసారి మంత్రి పదవుల పంపిణీలో పెద్ద చర్చ అవసరం లేనట్టుగానే కనిపిస్తోంది. ఒక వెలమ సామజికవర్గంలో జూపల్లి కృష్ణారావు, ప్రేమ్ సాగర్ రావుల మధ్యనే పోటీ ఉంది. వీరికి తోడు భూపాలపల్లి లో గండ్ర సత్యనారాయణరావు ఉన్నారు. జూపల్లికి ఇచ్చినా ఉత్తర తెలంగాణ వెలమ సామాజికవర్గం ఆ ప్రాంతం వారికి ఇవ్వాలని కోరే అవకాశం ఉంది.
మంత్రి పదవుల పంపిణీలో సామాజిక వర్గాల సమతూకం పాటించేందుకు కాంగ్రెస్ నాయకత్వం అధిక ప్రాధాన్యత ఇవ్వబోతోందని విశ్వసనీయ సమాచారం. రాజస్థాన్ మాదిరి కాకుండా యువ నేతలకు, పార్టీ కోసం పనిచేసిన వారికి గుర్తింపు ఉంటుందని తెలిసింది. టికెట్ల పంపిణీలో అగ్రవర్ణాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారనే పేరుంది. ఈ నేపథ్యంలో సమతూకం పాటించకపోతే గులాబీకి – హస్తానికి తేడా లేదనే అపప్రథ తప్పదు.
-దేశవేని భాస్కర్
RELATED ARTICLES

Most Popular

న్యూస్