రాష్ట్రంలో ఈ రోజు నుంచి రాజన్న సిరిసిల్ల, ములుగు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా హెల్త్ ప్రొఫైల్ నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ రెండు జిల్లాల్లో ప్రయోగాత్మక హెల్త్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ప్రాజెక్ట్ విజయవంతమైతే, రాష్ట్రంలోని మిగిలిన 31 జిల్లాల్లో హెల్త్ ప్రొఫైల్ నమోదు ప్రాజెక్ట్‌ను అమలు చేయనుంది. వాస్తవానికి తెలంగాణలోని ప్రతి పౌరుడి ఆరోగ్య ప్రొఫైల్‌ను నమోదు చేయాలని గత ఏడాది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే, రాష్ట్రంలో ఓమిక్రాన్,డెల్టా వేరియంట్ కొవిడ్ -19 వ్యాధి ముప్పు కారణంగా ప్రాజెక్ట్ నిలిచిపోయింది. ఆ తరువాత ఫిబ్రవరి ప్రారంభంలో హెల్త్ ప్రొఫైల్స్ నమోదు ప్రారంభించాలని ప్రభుత్వం మరోసారి నిర్ణయించగా, ములుగు జిల్లాలో సమ్మక్క సారక్క జాతర కారణంగా సంబంధించిన కార్యక్రమాల కారణంగా వాయిదా పడింది.
వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ల మంత్రి తన్నీరు హరీష్ రావు ఈ రోజు ములుగు ఏరియా హాస్పిటల్ లో హెల్త్ ప్రొఫైల్ ఆవిష్కరణ చేస్తారు. మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర రావు తదితరులు పాల్గొంటారు.
ఆరోగ్య కార్యకర్తలు రాజన్న సిరిసిల్ల, ములుగు జిల్లాల్లో ప్రతీ ఇంటికి తిరిగి పౌరుల ఆరోగ్య సమాచారాన్ని సేకరిస్తారు. జ్వరం, రక్తపోటు, షుగర్ తదితర పరీక్షలన్నింటినీ ఇంటి వద్ద, ఇసిజి వంటి పరీక్షలను ప్రాథమిక కేంద్రాల వద్ద నిర్వహిస్తారు. ప్రతి లబ్ధిదారుడికి ఒక యూనిక్ ఐడీని కేటాయిస్తారు. ఆరోగ్య సమాచారాన్ని ఆన్‌లైన్‌లో పొందుపర్చుతారు. యూనిక్ ఐడీ అందుబాటులో ఉండడం వల్ల వ్యక్తి ఆరోగ్య సమాచారాన్ని ఎక్కడి నుంచైనా పొందడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల ఎవరికైనా, ఏదైనా జబ్బు చేస్తే వైద్యులు ఆన్‌లైన్‌లోనే వారి ఆరోగ్య చరిత్రను చూడడానికి వీలుపడుతుంది. అత్యవసర వైద్య సేవలకు హెల్త్ ప్రొఫైల్ ఉపయోగపడనుంది.