Friday, September 20, 2024
HomeTrending NewsSingareni: సింగరేణి ఎన్నికలు... దశాబ్దాలుగా సమస్యలు

Singareni: సింగరేణి ఎన్నికలు… దశాబ్దాలుగా సమస్యలు

సింగరేణి ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 27న ఎన్నికలు జరిపేందుకు వీలు కల్పించిన హైకోర్టు… సింగరేణి ఎన్నికలు వాయిదా వేయాలన్న మధ్యంతర పిటిషన్ కొట్టివేసింది. సింగరేణి ప్రాంతాన్ని మొత్తం 11 డివిజన్లు (ఏరియాలు)గా విభజించగా 70 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో 42 వేల మంది రెగ్యులర్, 28 వేల మంది కాంట్రాక్టు కార్మికులు ఉన్నారు. పోలింగ్ జరిగిన రోజు సాయంత్రమే ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు.

తెలంగాణలో 6 జిల్లాల పరిధిలో (కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం) సింగరేణి 18 ఉపరితల (ఓపెన్ కాస్ట్), 24 భూగర్భ గనులను నిర్వహిస్తోంది. 1990లలో పదుల సంఖ్యలో ఏర్పడ్డ కార్మిక సంఘాలు.. వాటి మధ్య ఆధిపత్య పోరాటాలు, డిమాండ్ల సాధన కోసం సమ్మెలకు దిగడంతో తరచూ బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడేది. ఇలాంటి పరిస్థితుల్లో సమస్యలు, డిమాండ్లపై కార్మికుల ప్రతినిధిగా యాజమాన్యంతో చర్చలు జరిపేందుకు ఒక గుర్తింపు కార్మిక సంఘం ఉండేలా.. దాన్ని కార్మికులే ఎన్నుకునేలా ఏర్పాటు చేశారు.

1998‌లో మొదటిసారి సింగరేణిలో ‘గుర్తింపు కార్మిక సంఘం’ ఎన్నికలు నిర్వహించారు. మొదట్లో ప్రతి రెండేళ్లకు ఒకసారి ఎన్నికలు నిర్వహించగా ఆ తర్వాత కాలపరిమితిని నాలుగేళ్లకు మార్చారు. సింగరేణిలో ఇప్పటి వరకు ఆరుసార్లు గుర్తింపు కార్మిక సంఘానికి ఎన్నికలు జరిగాయి. అందులో సీపీఐ అనుబంధ కార్మిక సంఘం మూడుసార్లు, ఏఐటీయూసీ మూడు సార్లు, కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీ ఒకసారి, బీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) రెండు సార్లు విజయం సాధించాయి.

చివరిసారిగా 2017లో జరిపిన ఎన్నికల్లో టీబీజీకేఎస్ గెలుపొందింది. వాస్తవంగా రెండేళ్ల క్రితమే ఎన్నికలు జరగాల్సి ఉన్నా కోవిడ్, ఇతర కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చాయి. ప్రస్తుత ఎన్నికల్లో 13 కార్మిక సంఘాలు గుర్తింపు హోదా కోసం పోటీ పడుతున్నాయి. పోటీ ప్రధానంగా జాతీయ కార్మిక సంఘాలు, టీబీజీకేఎస్ మధ్య నెలకొంది.

మారిన రాజకీయాల నేపధ్యంలో టీబీజీకేఎస్ నేతలకు గడ్డు పరిస్థితి ఎదురవుతోంది. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి సమస్యల పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చి గెలిచిన ఈ సంఘం…ఆ దిశగా ప్రయత్నాలు చేయలేదనే అసంతృప్తి కార్మికుల్లో ఉంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రకటించిన కారుణ్య నియామకాలు కొందరికే ఉపయోగపడ్డాయి.

సింగరేణిలో ఒకరి పేరుతో మరొకరు పనులు చేయటం దశాబ్దాలుగా సాగుతోంది. సిఎంగా కెసిఆర్ హామీ ఇచ్చినా న్యాయపరమైన చిక్కులతో అది నెరవేరలేదు. దీంతో పదవీ విరమణ చేసినవారు, వితంతువులు పెన్షన్ కు దూరం అవుతున్నారు. పదవీ విరమణ చేసిన కార్మికులకు పెన్షన్  పథకానికి సవరణ చేయకపోవటంతో 25 ఏళ్ళుగా నామమాత్రపు పెన్షన్ పొందుతున్నారు. సుమారు 46,048 కార్మికులు నెలకు కేవలం 350 రూపాయల లోపు పెన్షన్ అందుకుంటున్నారు.

ఆరో వేతన బోర్డు సూచనలతో వేతనాలు గణనీయంగా పెరిగినా… కార్మికులు ఆదాయ పన్ను పరిధిలోకి వచ్చారు. ఇంటి అద్దె వేతనాల్లో చూపటంతో…కార్మికుల మూడు నెలల జీతం ఆదాయ పన్ను కింద కరిగిపోతోంది. గనుల ప్రైవేటీకరణ ఆపాలని, ప్రధానంగా కొత్త గనులు ప్రారంభించి సింగరేణి కార్మికులకే ఆవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

ఎన్నికల్లో గెలుపునకు ఆరాటపడుతున్న సంఘాలు.. కార్మికుల సమస్యలకు శాశ్వత పరిష్కారానికి చొరవ చూపటం లేదనే విమర్శలు ఉన్నాయి. ఎన్నికల పేరుతో సంఘాల విజయం…కార్మికులు రాజకీయ నేతలుగా మారటం తప్పితే… దశాబ్దాలుగా సమస్యలు పరిష్కారానికి నోచుకోవటం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్