హైదరాబాద్ హుస్సేన్ సాగర్ తీరాన రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న అమరవీరుల స్మారక చిహ్నం నిర్మాణ తుది దశ పనులను రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బుధవారం పరిశీలించారు.
నిర్మాణ ప్రాంగణమంతా సుమారు నాలుగున్నర గంటలకు పైగా కలియ తిరుగుతూ అన్ని రకాల పనులు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. మెయిన్ ఎంట్రన్స్, కాంపౌండ్ వాల్ రేయిలింగ్స్, పార్కింగ్ ఏరియా, పూల మొక్కలు,పచ్చదనంతో చూపరులకు ఆహ్లాదకరంగా ఉండే ల్యాండ్ స్కేప్ ఏరియా,తెలంగాణ తల్లి విగ్రహ నిర్మాణ ప్రాంగణం,ఫౌంటెన్ ఏరియా, తెలంగాణ అమరవీరుల త్యాగాలు ప్రతిబింబించేలా నిర్మిస్తున్న ఫోటో ఆర్ట్ గ్యాలరీ,మ్యూజియం,ఆడియో విడియో విజువల్ స్క్రీన్ రూం,ఎస్కలేటర్ పనులు,రెండవ ఫ్లోర్లో కన్వెన్షన్ హాల్,మూడవ ఫ్లోర్లో రెస్టారెంట్,కిచెన్ ఏరియా,నిరంతరం జ్వలించే జ్వాలల ఉండే జ్యోతి ఆకృతి నిర్మాణం పనులను క్షుణ్ణంగా పరిశీలించారు. ముఖ్యమంత్రి కేసిఆర్ ఆలోచనలకు అనుగుణంగా తుది దశ పనుల్లో పలు సూచనలు చేశారు.
హైదరాబాద్ నగర నడి బొడ్డున,హుస్సేన్ సాగర్ తీరాన కేసిఆర్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ అమరవీరుల స్మారక చిహ్నం తెలంగాణ ప్రజల హృదయాలను హత్తుకునే నిర్మాణమన్నారు. దుబాయ్ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన అరుదైన స్టెయిన్ లెస్ స్టీల్ షీట్స్ తో నిర్మించామన్నారు. అమరవీరుల త్యాగాలు గుర్తు చేసే ఈ నిర్మాణం ప్రపంచంలోనే గొప్ప కట్టడంగా నిలువనుందని అన్నారు. తెలంగాణ ప్రజల సెంటిమెంట్ గా నిలిచే అమరవీరుల స్మారక చిహ్నం నిర్మాణ ఫినిషింగ్ పనులు మనసుపెట్టి చేయాలని అధికారులు,వర్క్ ఏజెన్సీని అదేశించారు. అవసరమైన మేర మ్యాన్ పవర్ పెంచి,మూడు షిఫ్టుల్లో పనులు శరవేగంగా జరగాలని, నిర్ణీత గడువులోగా నిర్మాణం పూర్తి కావాలని అధికారులు,వర్క్ ఏజెన్సీకి మంత్రి వేముల స్పష్టం చేశారు.
మంత్రి వెంట ఆర్ అండ్ బి ఈఎన్సి గణపతి రెడ్డి, ఎస్.ఈ లింగారెడ్డి,ఈ.ఈ శ్రీనివాస్, నర్సింగ రావు,డి.ఈ మాధవి, ఏ.ఈ ధీరజ్ పలువురు అధికారులు,కేపిసి నిర్మాణ సంస్థ ప్రతినిధులు అనిల్ తదితరులు ఉన్నారు.