తెలంగాణ ఉద్యమంలో మీడియా మిత్రుల పోరాటం మరువలేదని మంత్రి కేటీఆర్ అన్నారు. నిజాంకి వ్యతిరేకంగా షోయబుల్లాఖాన్ నిర్భయంగా పోరాడారని… సురవరం ప్రతాపరెడ్డి పోరాటం మరువ లేనిదన్నారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభించిన నాడు మీడియా యాజమాన్యాలు సహకరించకపోయినా మీడియా ప్రతినిధులు సహకారం ఎప్పటికీ మర్చిపోలేమన్నారు. అందుకే సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో మీడియా మిత్రులకు సముచిత స్థానం కల్పించారని తెలిపారు. జర్నలిస్ట్ లు తెలంగాణ కోసం ఢిల్లీలో పోరాడారు. వారిని మరువలేవమని.. వారి కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామని చెప్పారు.
సంక్రాంతి తర్వాత మీడియా భవన్ నిర్మిస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. తెలంగాణలో ఆదాయం పెరిగిందని.. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. రాష్ట్రాభివృద్ధిపై ప్రజలకు మీడియా ఎందుకు చెప్పటం లేదని ప్రశ్నించారు. పేదల కోసం పనిచేసే ప్రభుత్వంపై సోషల్ మీడియాలో వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అది సోషల్ మీడియా కాదని..యాంటీ సోషల్ మీడియానా అనే భావన కల్గుతుందన్నారు. ప్రశ్నించేవాళ్లు లేకపోవడంతో కొందరు చెలరేగిపోతున్నారన్నారు.
దేశం అన్ని రంగాల్లో అభివృద్ధిలో వెనక్కి వెళ్తుందని.. కోవిడ్ సమయంలో పేదలను ఆదుకునేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన ఉద్దీపన ప్యాకేజీ రూ.20 లక్షల కోట్లు ఎక్కడికి పోయాయని మంత్రి నిర్మలా సీతారామన్ ని అడిగారా? అని ప్రశ్నించారు. కేంద్రాన్ని ప్రశ్నిస్తే మీడియాపై దాడులు చేయడం సరికాదన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని..ఈ దేశం ఎట్లా ఉండాలనేది ప్రసార మాధ్యమాలు చెప్పాలని కేటీఆర్ సూచించారు. తాను రోజుకు గంటన్నరసేపు పేపర్ చదువుతానని..పేపర్ రాని రోజు తనకు ఏమీ తోచదన్నారు.
పేపర్స్ లో వచ్చే వార్తలలో ఏది నిజం..ఏది అబద్ధం అని తెలియని పరిస్థితి నెలకొందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఒకప్పుడు జర్నలిస్ట్ లు నిర్భయంగా వార్తల రాసేశారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అలా జరగడం లేదన్నారు. దేశంలో మీడియా మారిందన్నారు. ప్రధాని మన్ కి బాత్ మనమే వినాలి మన మాట ఆయన వినరని విమర్శలు చేశారు. ప్రపంచం లో గొప్ప సంస్థలు హైదరాబాద్ లో ఉన్నాయి.. వాటి గురించి మీడియా ఎందుకు రాయదని ప్రశ్నించారు. తాము తప్పుచేస్తే చీల్చిచెండాలని సూచించారు. తాము మంచి చేసినప్పుడు మంచిగా రాయాలన్నారు.