Monday, May 20, 2024
HomeTrending Newsకేంద్రంపై తెలంగాణ మంత్రుల ఫైర్

కేంద్రంపై తెలంగాణ మంత్రుల ఫైర్

Telangana Ministers Fire :

వర్షాకాల వడ్ల సేకరణకు రాష్ట్ర మంత్రుల బృందం వస్తే.. వచ్చే యసంగిలో బాయిల్డ్ రైస్ తీసుకోమని పదే పదే చెప్పడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. వచ్చే యాసంగిలో తెలంగాణలో వడ్ల కొనుగోలు కేంద్రాలు ఉండవని మంత్రి స్పష్టం చేశారు. గత వారం రోజులుగా మా రైతుల కోసం, వడ్ల సేకరణ కోసం వచ్చామని మూడు రోజులు వేచి చూశాక.. నాలుగవ రోజు సమయం ఇచ్చారన్నారు. ఈ వర్షాకాలంలో 60లక్షల మెట్రిక్ టన్నులు సేకరిస్తామని లిఖితపూర్వకంగా ఇచ్చారని, ఇప్పుడు టార్గెట్ దాటిపోయాము.. ఇంకా వడ్లు వస్తున్నాయి.. వాటిని కొనేందుకు లిఖితపూర్వకంగా ఇవ్వాలని కోరుతున్నామన్నారు.

ఢిల్లీలో  ఈ రోజు జరిగిన మీడియా సమావేశంలో మంత్రులు గంగుల కమలాకర్, నిరంజన్ రెడ్డి, జగదీష్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు ఎంపిలు కేశవరావు, నామ నాగేశ్వర్ రావు, రంజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో తెలంగాణ మంత్రులు కేంద్ర విధానాలపై మండిపడ్డారు.

మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కామెంట్స్…

మేము కలిసినప్పుడు 2 రోజులు సమయం ఇవ్వాలని అడిగారు.. సమయం అయిపోయిందని, నిన్న మళ్ళీ అపాయింట్మెంట్ ఆడిగాము.. ఇప్పటివరకు సమాచారం రాలేదు. చాలా దురదృష్టకరం.. కేంద్ర ప్రభుత్వం అవలంభించాల్సిన విధానం ఇది కాదు. కేంద్రం నుంచి సహకారం, స్పష్టత లభించలేదు. తెలంగాణ రైతుల పక్షాన దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఇంకా కొనుగోళ్లు నడుస్తున్నాయి. ఉన్న ఫలంగా వాటిని ఆపేయలేము. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కోనుగోలు చేస్తుంది. పార్లమెంట్ లో పీయూష్ గోయెల్ మాట ఇచ్చారు. ప్రస్తుతం 60 లక్షల మెట్రిక్ టన్నుల పైబడి వచ్చిన ధాన్యం తీసుకుంటాము. ఎన్ హన్స్ మెంట్ లేఖ రాకపోతే.. ఇండియా గెట్ వద్ద పారబోస్తాం. రైతులను తీవ్రంగా అవమానించే విధంగా కేంద్రం వ్యవహరిస్తోంది. ఇవ్వాళ, రేపు అని సమయం సాగదీస్తున్నారు.  నాటకం అడుతున్నట్టు కన్పిస్తోంది. దీన్ని ఇంకా పొడగిస్తే మంచిది కాదు. ఇది రైతుల విషయం.. మళ్ళీ ఆలోచించి నిర్ణయం తీసుకోండి.

వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఆయన మాటల్లోనే….

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల సమాహారం. రాష్ట్రాలను రాజ్యాంగ బద్దంగా ఎన్నికైనట్లుగా చూడడం లేదు. కేంద్ర ప్రభుత్వ దయా, దక్షిణ్యాల మీద నడవాలని చూస్తున్నారు. ఇది దేశానికి మంచిది కాదు. గతంలో రాష్ట్రాల అభిలాశలను అవమానపరిచినవారికి మూల్యం చెల్లించారు. మళ్ళీ అలాంటివి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రానిదే. కో ఆపరేటివ్ ఫెడరలిజం తెస్తామని ఆశ పుట్టించారు. నీతి ఆయోగ్ సిఫార్సులను పాటించరు. వారికి నచ్చిన రాష్ట్రాలకు, వారి పార్టీ ప్రభుత్వంలో ఉన్న రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇస్తారు. అన్ని అంశాలలోనూ ఇలానే చేస్తున్నారు. గుజరాత్, హైదరాబాద్ కు వరదలు వచ్చినప్పుడు ఎలా వ్యవహరించారో చూసినం. అఖండ మెజారిటీ వచ్చిన ప్రభుత్వాలు.. అతిగా చేసినప్పుడు పడిపోయాయి. రాష్ట్రాలను, ముఖ్యమంత్రుల పట్ల బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు. వ్యవసాయ రంగంలో  పరిశోధనలు చేసే అంశం కేంద్రానిది. కనీస మద్దతు ధర నిర్ణయం, ఎగుమతులు, గోడౌన్లు, రైల్వే లు కేంద్రం చేతిలోనే ఉన్నా ఇప్పుడు చేతులు ఎత్తేస్తున్నారు. భారత భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా క్రాప్ కాలనీలు చేస్తే దేశానికి బాగుంటుంది. రైతుల ఆదాయం రెండింతల రెట్టింపు చేస్తామన్నారు. రైతులు పండించిన పంటను ఇండియాగేట్ వద్ద పోసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎక్కడ రెట్టింపు.. దుస్థితి వచ్చింది. కొత్త దారులు వెతకరు, పరిశోధనలు చేయరు. 80, 90 వేల కోట్ల రూపాయల విదేశీ ధనం వెచ్చించి వంట నూనెలు తెచ్చుకుంటున్నామని చెబుతున్నారు. కానీ దేశ రైతులకు వంట నూనెలు పండించే దారి చూపడం లేదు. 140 కోట్లా జనాభా నైపుణ్యాన్ని నిరుగారుస్తున్నారు.

రైతుల ఉత్పత్తులను చిన్నచూపు చూసి తిరోగమనం దిశగా నడుపుతున్నారు. దేశంలో పప్పు దినుసుల కొరత ఉంది. రాబోయే వానాకాలంలో తెలంగాణలో 3-5 లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగుకు చర్యలు తీసుకుంటున్నాం. ఉపన్యాసలు ఇచ్చి అదే దేశభక్తి అని చెబుతున్నారు. ప్రజల కడుపు నిండితేనే దేశభక్తి. వ్యవసాయ రంగంపై కేంద్రం చూపు హానికరంగా.. ప్రమాదకరంగా ఉంది. ఆరుగాలం కష్ట పడ్డ రైతు మనోవేదనకు గురవుతున్నారు. ఒక రాష్ట్రం వచ్చి ఢిల్లీలో ఎదురుచూస్తుంటే చిన్నచూపు చూస్తున్న కేంద్ర ప్రభుత్వ విజ్ఞతను చూస్తున్నాం. ఇది రాజకీయంతో చూసే అంశం కాదు. ప్రస్తుతం ధాన్యం కొనుగోళ్లను కొనసాగిస్తాం. కేంద్ర ప్రభుత్వ లేఖ కోసం వేచి చూస్తాం.

Also Read : కేంద్రం వైఖరితో రైతులకు కష్టాలు

RELATED ARTICLES

Most Popular

న్యూస్