Sunday, January 19, 2025
HomeTrending Newsసీబీఐపై తెలంగాణ ఆంక్షలు...ఆలస్యంగా వెలుగులోకి

సీబీఐపై తెలంగాణ ఆంక్షలు…ఆలస్యంగా వెలుగులోకి

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోన్న వేళ కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సీబీఐకి నో ఎంట్రీ బోర్డు పెట్టింది. గతంలో ఏ కేసులోనైనా రాష్ట్రంలో సీబీఐ దర్యాప్తు చేసుకోవచ్చంటూ ఇచ్చిన అనుమతిని తెలంగాణ ప్రభుత్వం ఉపసంహకరించుకుంది. ఈ మేరకు దీనిని సంబంధించి ఆగస్టు 30న జీవో నెంబర్.51ను జారీ చేసింది. ఈ విషయాన్ని ప్రభుత్వ అడ్వొకేట్ జనరల్ హైకోర్టుకు తాజాగా తెలిపారు. ఇక నుంచి ఏ కేసులోనైనా రాష్ట్రంలో సీబీఐ విచారణ చేపట్టాలంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముందుకు అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని జీవోలో ప్రభుత్వం పేర్కొంది.

ఆగస్టులోనే సీబీఐకి ఇచ్చిన అనుమతిని కేసీఆర్ సర్కార్ ఉపసంహరించుకోగా.. అడ్వొకేట్ జనరల్ తాజాగా హైకోర్టుకు ఈ విషయం తెలపడటంతో ఆలస్యంగా ఇది వెలుగులోకి వచ్చింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల అంశం రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న తరుణంలో ప్రభుత్వం ఈ విషయాన్ని బయటపెట్టడం విశేషంగా మారింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల బేరసారాలకు సంబంధించి సీబీఐ విచారణకు ఆదేశించాలంటూ ఇటీవల హైకోర్టును బీజేపీ సంప్రదించింది. సీబీఐ లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని రాష్ట్ర బీజేపీ నేతలు డిమాండ్ చేస్తోన్నారు. ఇప్పటికే దీనిపై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందర్ రావు ఈడీకి ఫిర్యాదు చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు బీజేపీ జాతీయ జనరల్ సెక్రటరీ బీఎల్. సంతోష్ పేర్లు లీకైన ఆడియో కాల్స్‌లో వినిపించడంతో దేశవ్యాప్తంగా ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇప్పటికే సీబీఐ, ఈడీ టీఆర్ఎస్ నేతలతో సంబంధాలున్న పలువురు వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో పాటు కస్టడీలోకి తీసుకుని విచారిస్తోంది. ఈ స్కాంలో ఎమ్మెల్సీ కవిత పేరు తెరపైకి రావవడంతో ఆమె పేరును కూడా సీబీఐ ఎఫ్ఆర్‌లో చేర్చే అవకాశముందనే ప్రచారం జోరుగా సాగింది. దీంతో సీబీఐకి అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్రంలో అనుమతి రద్దు చేస్తారంటూ లిక్కర్ స్కాం కేసు సమయంలో వార్తలు బయటకు వచ్చాయి. త్వరలో జీవో జారీ చేస్తారంటూ అప్పట్లో ప్రచారం చేసింది. సీబీఐని ఉపయోగించుకుని కేంద్ర ప్రభుత్వం తమను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తోందంటూ పలుమార్లు కేసీఆర్ ఆరోపించారు. ఈ పరిణామాల క్రమంలో సీబీఐకి రాష్ట్రంలో అనుమతి రద్దు చేసిన విషయాన్ని ఆలస్యంగా ప్రభుత్వం బయట పెట్టడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఎమ్మెల్యే కొనుగోళ్ల వ్యవహారం క్రమంలో దీనిపై ప్రతిపక్షాల నుంచి అనేక విమర్శలు కేసీఆర్‌ సర్కార్‌కు ఎదురవుతోన్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్