దక్షిణ చైనా సముద్రంలో ఉద్రిక్త వాతావరణం అలుముకుంటోంది. తైవాన్ గగనతలంపై రెండు డజన్ల చైనా యుద్ద విమానాలు చక్కర్లు కొట్టడం అనుమానాలకు తావిస్తోంది. తైవాన్ జలసంధిలో అమెరికా – తైవాన్ సైనిక విన్యాసాలు ముగిసిన కొద్దిసేపటికే చైనా జెట్ విమానాలు ఆకాశంలో చక్కర్లు కొట్టడంతో ఎం జరుగుతోందో తెలియని పరిస్థితి నెలకొంది. తైవాన్ ప్రభుత్వం సంయమనం పాటిస్తున్నా… చైనా మాత్రం ఎప్పటికప్పుడు కయ్యానికి కాలు దువ్వుతున్నట్టుగా కనిపిస్తోంది. చైనా ఆగడాలతో ఆ దేశానికి అన్ని వైపులా సరిహద్దు దేశాలకు తలనొప్పిగా మారింది.
మరోవైపు దక్షిణ చైనా జలాల్లో తమ నౌకపై చైనా నౌక లేజర్ బీమ్‌తో అటాక్ చేసినట్లు పిలిప్పీన్స్ కోర్టు గార్డు ఆరోపించారు. చైనా కోస్టు గార్డుకు చెందిన ఓ నౌక.. మిలిటరీ గ్రేడ్ లేజర్‌తో తమ నౌకకు సమీపంగా వచ్చినట్లు పిలిప్పీన్స్ కోస్టు గార్డు తెలిపింది. గత వారం ఈ ఘటన జరిగింది. తమ నౌకకు దాదాపు 137 మీటర్ల దూరం వరకు వచ్చి ప్రమాదకర రీతిలో చైనా కోస్టు గార్డు నౌక వ్యవహరించినట్లు పిలిప్పీన్స్ ఆరోపించింది.
లేజర్ బీమ్‌తో నౌకలో ఉన్న సిబ్బందిపై దాడి చేసిన విజువల్స్‌ను కూడా పిలిప్పీన్స్ కోస్టు గార్డు తన ఫేస్‌బుక్ పేజీలో పోస్టు చేసింది. గ్రీన్ కలర్ లేజర్ బీమ్‌ను చైనా వాడినట్లు ఆ ఫోటో ద్వారా తెలుస్తోంది.ఫిబ్రవరి ఆరో తేదీన అయున్‌జిన్ షోల్ వద్ద ఈ ఘటన జరిగింది.
ఈ ఘటన పట్ల చైనా విదేశీంగ శాఖ భిన్నమైన ప్రకటన చేసింది. తమ అనుమతి లేకుండా రీనాయ్ రీఫ్ జలాల్లోకి పిలిప్పీన్స్ నౌక ప్రవేశించినట్లు చైనా విదేశాంగ శాఖ తనప్రకటనలో పేర్కొన్నది. చైనీస్ గస్తీ నౌకలు అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా విదేశీ నౌకను అడ్డుకున్నట్లు చైనా తెలిపింది. దక్షిణ చైనా సముద్రంలో ఉన్న సుమారు 1.3 మిలియన్ల స్క్వేర్ మైళ్ల ప్రాంతంపై చైనా ఆధిపత్యం చెలాయిస్తున్న విషయం తెలిసిందే.