Sunday, January 19, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంనాలుగు సింహాలాట

నాలుగు సింహాలాట

Symbol-Design: ప్రాణుల్లో అడ్డంగా ఉన్న వెన్నెముక మనిషిలో నిటారుగా  నిలబడడానికి కొన్ని లక్షల ఏళ్లు పట్టింది. “ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో?” అని దాశరథి అందుకే అన్నాడు.

వెన్నెముక నిటారుగా ఉన్న మనుషులందరూ తల ఎత్తుకుని గర్వంగా నిలబడి ఉంటారు అని అనుకోవడానికి వీల్లేదు. అలాగే వెన్నెముక అడ్డంగా ఉన్న జంతువులన్నీ తల దించుకుని దీనంగా ఉంటాయని అనుకోవడానికి కూడా వీల్లేదు.

మనం గుంపులు గుంపులుగా వెళ్లినా…సింగిల్ గా ఉన్న సింహం ముందు గ్రామ సింహాలమే అన్న స్పృహ మనకు ఉండి తీరాలి. లేకపోతే సింహం తాంబూలం సున్నంలోకి మన ఎముకలు కూడా మిగిలి ఉండవు. ఆకలితో చావనైనా చస్తుంది కానీ…సింహం గడ్డి మేయదు. ఆకలైనప్పుడు మాత్రమే సింహం వేటకు బయలుదేరుతుంది. కడుపు నిండిన తరువాత మిగిలిన మాంసాన్ని నక్కల్లా దాచుకుని తినడం సింహం నిఘంటువులో లేనే లేదు. సింహం తిని, తేన్చి తాపీగా వెళ్లిన తరువాత మిగిలినది గుంట నక్కలు, కుక్కలు, కాకులు, గద్దలు, రాబందులు పీక్కు తింటాయి.

 Ashoka Symbol

ఎక్కడ ఎత్తుగా ఉంటే సింహం ఆటోమేటిగ్గా అక్కడికి చేరి అర్ధ నిమీలిత నేత్రాలతో నిర్భయంగా కునుకు తీస్తుంది. కనుచూపు మేర కనిపించే భూమండలాన్ని సర్వంసహా చక్రవర్తిలా పరిపాలిస్తున్నట్లు సింహం తనకు తాను అనుకుంటుంది. కాదని ఇంతవరకు అభ్యంతరపెట్టిన జంతువు లేదు. కొంత దూరం నడిచాక సింహం జూలు విదిల్చి ఎవరి హద్దుల్లో వారు ఉన్నారా? లేక ఏమయినా తోకలు జాడిస్తున్నారా? అని ఒక్కసారి వెనక్కు తేరిపారా చూస్తుంది. అదే “సింహావలోకనం” అయ్యింది. సింహం ఎక్కడున్నా సింహమే. అడవికి అప్రకటిత రాజు సింహం.

సింహంతో జాగ్రత్తగా ఉండాలనే ఇదివరకు హై స్కూల్ తెలుగు పుస్తకాల్లో సింహ జ్ఞాన పాఠాలు ఉండేవి.

“పండితులైనవారు దిగువం దగ నుండఁగనల్పుఁ డొక్కఁడు
ద్దండతఁ బీఠ మెక్కిన బుధప్రకరంబుల కేమి యె గ్గగున్?
గొండొకకోఁతి చెట్టు కొనకొమ్మల నుండఁగఁ గ్రింద గండభే
రుండమదేభ సింహనికురంబము లుండవె చేరి భాస్కరా!”

ఒకానొక చెట్టు కొమ్మల మీద కోతులు, కొండ ముచ్చులు ఉంటే ఉండవచ్చుగాక…చెట్టు కింద సింహం ఉంటే…మొదట భయంతో ఏ జంతువుకు నమస్కారం పెడతాం? అని పిల్లలను ఇదివరకు భాస్కర శతకకారుడు ప్రశ్నించేవాడు. ఇప్పుడు భాస్కరుడి సుమతి వేమన వైరాగ్యంతో దిగంబరమై…ప్రశ్నిస్తోందో? లేదో? తెలియదు.

సునిశితమయిన హాస్యంతో గుండెలు మెలిపెట్టే విషయాలను చెప్పడంలో చెయి తిరిగిన రచయిత జి ఆర్ మహర్షి దాదాపు దశాబ్దం క్రితం ప్రజాస్వామ్యంలో ఎన్నికల విచిత్రాల మీద ఒక వ్యంగ్య రచన చేశారు. అందులో- సాధారణ ఎన్నికల ప్రచారం హోరెత్తుతూ ఉంటుంది. సభలు, ర్యాలీలు, మైకులు, నినాదాలు, పొగడ్తలు, తిట్లతో ఊరూ వాడా ఊగిపోతూ ఉంది. ఒక ఊరి పక్కన అడవిలో జంతువులకు ఈ ఎన్నికల హడావుడి అంతా విచిత్రంగా అనిపిస్తుంది. ఏమిటిదంతా అని ఆరా తీస్తాయి. ప్రజాస్వామ్య విధానంలో ఎన్నికలు కీలకం అని తెలిసి అడవిలో “ఆటవిక పాలన” అన్న నింద తొలగించుకోవాలంటే ఎన్నికలకు వెళ్లడమే ఉత్తమం అని జంతువులన్నీ అంగీకారానికి వస్తాయి.

సింహం మొదలు చీమ దాకా దేన్నీ వదలకుండా ఓటరు నమోదు జరుగుతుంది. గుంట నక్క రిటర్నింగ్ అధికారిగా ఒకానొక శుభ ముహూర్తాన పోలింగ్ జరుగుతుంది. ఏనుగు నుండి పిపీలికం దాకా అన్నీ క్యూలో నిలుచుని ఓట్లు వేశాయి. నిర్ణయించిన ముహూర్తానికి పోలింగ్ ఫలితాలు ప్రకటించడమే ఇక తరువాయి.

విప్పిన బ్యాలెట్ బాక్సులతో పాటు అన్నీ కలిసి సింహం గుహ దగ్గరికి వెళతాయి. సరిగ్గా అదే సమయానికి సింహం నిద్రపోతూ ఉంటుంది. నిద్ర పూర్తయి నెమ్మదిగా సింహం కళ్లు తెరిచి…ఏమిటి మొత్తం అంతా కట్టకట్టుకుని వచ్చారు? అని అడుగుతుంది. ఏమీ లేదు మహారాజా! మొన్న పోలింగ్ జరిగింది కదా? మీరు అనుమతిస్తే ఫలితాలు ప్రకటిస్తాం…అని భయ భక్తులతో తగ్గు స్వరంతో మనవి చేసుకున్నాయి. అలాగే ప్రకటించండి…ఎలాగూ అడవికి నేనే కదా రాజును? అని సింహం ఆవులిస్తూ చెప్పింది.

“సింహం ఆవులించి నిద్ర లేచింది…ప్రజాస్వామ్యం పలాయనం చిత్తగించింది” అని ముగించారు జి ఆర్ మహర్షి.

ఇందులో అంతరార్థం ఏమిటో వివరించాల్సిన పనిలేదు. అర్థం చేసుకున్నవారికి చేసుకున్నంత.

తాజాగా పార్లమెంటు కొత్త భవనం ముందు నాలుగు సింహాల జాతీయ చిహ్నాన్ని ప్రధాని మోడీ ఆవిష్కరించారు. దాదాపు 2,275 ఏళ్ల కింద అశోకుడు సారనాథ్ లో ప్రతిష్ఠించిన స్థూపం నుండి తీసుకున్న ఈ చిహ్నాన్ని 1950నుండి అధికారికంగా వాడుతున్నాం. పాత స్థూపంలో సింహాలు శాంతంగా ఉన్నాయి…మోడీ ఆవిష్కరించిన సింహాలు అత్యంత రౌద్రంగా ఉన్నాయని పెద్ద చర్చ మొదలయ్యింది. జాతీయ మీడియాలో ఎడతెగని వాదోపవాదాలు.

మోడీ సింహాలు ఇలాగే ఉంటాయని కొందరు; జాతీయ చిహ్నం రూపు రేఖలు మార్చి మహాపరాధం చేశారని కొందరు; కింది నుండి చూస్తే కోపంగా, పైనుండి చూస్తే శాంతంగా ఉంటాయని మరి కొందరు…జుట్లు జుట్లూ పట్టుకుంటున్నారు.

“ఏ పులి మేకను రక్షిస్తుంది?”
అని వెనకటికి ఒక కవి ప్రశ్నించాడు. ఆ ప్రశ్ననే కొనసాగిస్తూ…
“ఏ సింహం ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తుంది?
శాంత సింహమా?
రౌద్ర సింహమా?”

ఇదొక-
సింహభాగం కోసం సింహనాదం.
సింహభాగ్యం కోసం సింహస్వామ్యం.

-పమిడికాల్వ మధుసూదన్

Also Read :

బిజెపి- టీఆర్ఎస్ వైరం

RELATED ARTICLES

Most Popular

న్యూస్