దేశానికి కావాల్సింది రావాల్సింది రాజకీయ ఫ్రంట్‌లు కాదు.. ఇవేం సాధించలేవు.. ఇవాళ దేశానికి కావాల్సింది ప్రత్యామ్నాయ ఎజెండా. ఒక అద్భుతమై ప్రగతి పథంలో తీసుకెళ్లే ఎజెండా కావాలి. ఆ సిద్ధాంతానికి ప్రతిపాదిక పడాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ప్లీనరీ వేదికగా సీఎం కేసీఆర్ ప్రసంగించారు. 2000లో తాను తెలంగాణ అని మాట్లాడితే.. ఏం పని లేదా అని కొందరు అన్నారు. సంకల్పంతో జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, ఆ భగవంతుడికి దండం పెట్టి బయలుదేరి తెలంగాణ సాధించాం. సాధించిన తెలంగాణను దేశానికి రోల్‌మోడల్‌గా నిలిచేలా చేశామన్నారు. పాలమూరు జిల్లాలో వలసలు పోయేవారు. ఇవాళ వలసలు రివర్స్ వచ్చాయి. 11 రాష్ట్రాల నుంచి మన వద్దకు వలసలు వస్తున్నారు. బీహార్ హమాలీ కార్మికులు లేకపోతే తెలంగాణ రైస్‌మిల్లులు నడవవు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ లో భవన నిర్మాణ రంగంలో ఉత్తరప్రదేశ్, బీహార్ కార్మికులు పని చేస్తున్నారు. తెలంగాణలో పని పుష్కలంగా దొరుకుతోంది. శాంతి భద్రతలు పటిష్టంగా ఉన్నాయని కేసీఆర్ స్పష్టం చేశారు.
ఈ దేశాన్ని గొప్పగా తీర్చిదిద్దాలి..
చేయగలిగే సామర్థ్యం, సంకల్పం, చిత్తశుద్ధి ఉంటే ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థికశక్తిగా ఎదిగే వనరులను భారత్ కలిగి ఉందని కేసీఆర్ పేర్కొన్నారు. కానీ ఇవాళ దుఖ పడుతున్నాం. నివారణ జరగాలి. కేసీఆర్ రాజకీయ ఫ్రంట్ ప్రకటిస్తాడా? అని అంటున్నారు. దేశం బాగు కోసం ఒక ప్రాసెస్ జరగాలి. భారతదేశ ప్రజలకు అనుకూలమైన ఫ్రంట్ ఉంటది. ఈ దేశాన్ని గొప్పగా తీర్చిదిద్దే ప్రత్యామ్నాయ ఎజెండాకు శ్రీకారం చుడుదాం. దేశం బాగుపడటానికి మన రాష్ట్రం నుంచి ప్రారంభం జరిగితే అది మనందరికీ గర్వకారణం అని సీఎం అన్నారు.
ఈ దేశానికే గర్వకారణం..
తెలంగాణ ప్రజల పక్షాన.. దేశ రాజకీయాలను ప్రభావితం చేయడానికి, గతిని, స్థితిని మార్చడానికి, దేశాన్ని సరైన ప్రగతి పంథాలో నడిపించడానికి హైదరాబాద్ వేదికగా కొత్త ఎజెండా, ప్రతిపాదన, సిద్ధాంతం తయారై దేశం నలుమూలల వ్యాపిస్తే ఈ దేశానికే గర్వకారణంగా ఉంటుందని కేసీఆర్ పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ రాజకీయ గుంపు కాదు.. కూటమి కాదు.. ప్రత్యామ్నాయ ఎజెండా ఈ దేశానికి కావాలి. ఆ దారులు వెతకాలి. నూతన వ్యవసాయ విధానం, నూతన ఆర్థిక విధానం, నూతన పారిశ్రామిక విధానం రావాలి. అందుకు అవసరమైన వేదికలు తయారు కావాలి. ఆ భారతదేశం లక్ష్యంగా పురోగమించాలి. సంకుచిత రాజకీయాలు వద్దు. దేశానికి కావాల్సింది అభ్యుదయ పథం కావాలి. అప్పుడే దేశం అద్భుతంగా బాగుపడతది. ఉజ్వలమైన భారత్ తయారవుతోంది అని కేసీఆర్ పేర్కొన్నారు.
Also Read : సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు భూమిపూజ