Friday, November 22, 2024
HomeTrending Newsటిడిపి నేతలు భాష మార్చుకోవాలి: అంబటి

టిడిపి నేతలు భాష మార్చుకోవాలి: అంబటి

పోలవరం ప్రాజెక్ట్  నిర్మాణంలో జాప్యానికి ఏపీ ప్రభుత్వం కారణమని కేంద్రం చెప్పిందని, గత ప్రభుత్వ కాలంలో తీవ్రమైన జాప్యం జరిగిందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. కేవలం ప్రస్తుత ప్రభుత్వం వల్ల అని కేంద్రం చెప్పలేదని, ప్రభుత్వం అంటే ఇప్పుడున్న తాము, గతంలో ఐదేళ్లపాటు ఉన్న టిడిపి ప్రభుత్వంకూడా బాధ్యత వహించాలని చెప్పారు.  కరోనా కూడా ఓ కారణమని కేంద్రం పేర్కొన్న విషయాన్ని రాంబాబు గుర్తు చేశారు. ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉన్నా తాము ఈ ప్రాజెక్టు కోసం 2900కోట్ల రూపాయల బిల్లులు పే చేశామని, రెండ్రోజుల కిందట 300 కోట్లు కేంద్రం రీ ఇంబర్స్ చేసిందని, మిగిలినవి రావాల్సి ఉందని వివరించారు.

ఇటీవల వచ్చిన గోదావరి వరదల్లో ముంపు బాధితులను ఆదుకున్నామని, ప్రతి ఒక్కరికీ 2వేల రూపాయల ఆర్ధిక సాయం అందించామని పేర్కొన్నారు.  వరద బాధితులను రెచ్చగొట్టేందుకే చంద్రబాబు నేడు పర్యటిస్తున్నారని రాంబాబు ధ్వజమెత్తారు.  కేవలం మీడియా పబ్లిసిటీ కోసం వెళుతున్నారన్నారు.

తనకు బుద్ధీ జ్ఞానం లేవంటూ దేవినేని ఉమా మాట్లాడడాన్ని అంబటి తీవ్రంగా ఆక్షేపించారు. ఆయన తల్లిదండ్రులు కవచ కుండలాల మాదిరిగా బుద్ధీ జ్ఞానంతో  దేవినేని ఉమాను కన్నారా అని ప్రశ్నించారు. ఈసారి ఉమా ప్రెస్ మీట్ కు వెళ్ళినప్పుడు  కాస్త బుద్ధి అరువు తేవాలని మీడియా ప్రతినిధులను కోరారు. మరోసారి ‘ఏమోయ్ రాంబాబూ’ అని మాట్లాడితే మర్యాద దక్కదు అంటూ ఉమాను రాంబాబు హెచ్చరించారు.

చంద్రబాబు 40 సార్లు, తాను  90సార్లు పోలవరం వెళ్లామని ఉమా చెబుతుంటారని,  సింగడు అద్దంకి వెళ్ళాడు, వచ్చాడు అన్నట్లు వెళ్ళారని ఎద్దేవా చేశారు.  2018లోగా పోలవరం పూర్తి చేస్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పి ఎందుకు పూర్తి చేయలేకపోయారో చెప్పాలని తాను ఎన్నిసార్లు అడిగినా ఉమా దానికి సరైన సమాధానం చెప్పడం లేదని విమర్శించారు.

తనకు కాఫర్ డ్యాం, డయా ఫ్రమ్ వాల్ అంటే ఏమిటో తెలియదని విమర్శలు చేస్తున్నారని, పుట్టుకతోనే డయాఫ్రం వాల్ ఏంటో తెలుసుకొని పుట్టారని… తాను కూడా సమగ్ర సమాచారం తెలుసుకుంటానని, మంత్రులకు అన్నీ విషయాలు తెలిసి ఉండక పోవచ్చని, పరిజ్ఞానం పెంచుకుంటారని రాంబాబు వివరించారు.

Also Read : సంక్షేమం కోసమా? స్వార్ధం కోసమా: కేశవ్

RELATED ARTICLES

Most Popular

న్యూస్