Saturday, January 18, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంపంజాబ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కళ వంగ...

పంజాబ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కళ వంగ…

గురుచరణ్ దాస్ ప్రఖ్యాత కాలమిస్ట్. పుస్తక రచయిత. హార్వర్డ్ లో తత్వ, ఆర్థిక శాస్త్రాలు చదివి అతిపెద్ద బహుళజాతి కంపెని ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ ఇండియా హెడ్ గా పని చేసి…యాభై ఏళ్లకే స్వచ్చంద పదవీ విరమణ చేసి…రచనా వ్యాసంగంలో మునిగి తేలుతున్న వ్యక్తి.

భారత దేశంలో హిందీని జాతీయ భాషగా ప్రకటించాలన్న ప్రతిపాదన…ఆ ప్రతిపాదన చుట్టూ రాజుకున్న వివాదాల మీద టైమ్స్ ఆఫ్ ఇండియా ఆంగ్ల పత్రిక ఎడిట్ పేజీలో గురుచరణ్ దాస్ లోతయిన వ్యాసం రాశారు. ఆ వ్యాసంలో ప్రధానాంశాలు ఇవి.

1. భారత దేశంలో హిందీ సినిమాల వల్ల…హిందీ భాష వ్యాప్తి ఎక్కువ.
2. ప్రాంతీయ భాషల్లో ఇంగ్లీషు ప్రభావం ఎక్కువగా ఉంది. తమిళులు కూడా ఇంగ్లీషు మాటలను కలుపుకుని మాట్లాడుతున్నారు.
3. హిందీలో కూడా ఇంగ్లీషు వాడకం పెరిగింది.

National Language
4. హిందీని జాతీయ భాషగా చేస్తే…దేశంలో హిందీ మాట్లాడని 78 కోట్ల మంది ఇతర భాషలు మాట్లాడేవారిని గౌరవించినట్లా? బలవంతపెట్టినట్లా?
5. హిందీ వ్యతిరేక ఉద్యమాల చరిత్ర నుండి మనం ఏమీ నేర్చుకోలేదా? మళ్లీ అవే తప్పులు చేస్తున్నామా?
6. భారతదేశంలో ఇండిపెండెన్స్ కు పూర్వం కూడా భిన్న భాషలు ఉన్నాయి. భిన్న సంస్కృతులు ఉన్నాయి.
7. ఏడు దశాబ్దాలుగా లేని జాతీయ భాష డిమాండు ఇప్పుడు ఎందుకు ఇంతగా తెరముందుకు వచ్చింది?
8. హిందీని జాతీయ భాషగా ప్రకటిస్తే లాభం కంటే నష్టాలే ఎక్కువ.

ఇప్పుడు చర్చలోకి వెళదాం. ఇంగ్లీషులో “పొలిటికల్లీ కరెక్ట్” (మామూలుగా తప్పయినా రాజకీయ కోణంలో అయితే ఒప్పు అనే అర్థం) అని ఒక మాట వాడుకలో ఉంది. దక్షిణ భారత దేశంలో తమిళనాడు హిందీని గట్టిగా వ్యతిరేకిస్తుంది. మలయాళంలో కూడా హిందీ పప్పులు ఉడకలేదు. కన్నడ, తెలుగు నేలల్లో హిందీ మీద వల్లమాలిన ప్రేమా లేదు. ద్వేషమూ లేదు. ఉత్తర భారతంలో భాషలన్నీ ఏదో ఒక రూపంలో హిందీతో మాతృత్వ సంబంధం ఉన్నవే. కాబట్టి…లేని చోట ఎలాగూ లేదు…ఉన్న చోట హిందీ భాషాభిమానాన్ని ఇంకా ఇంకా రాజేస్తే…బిజెపి కోణంలో “పాలిటికల్లీ కరెక్ట్” అవుతుంది.

భారతదేశంలో అధికారికంగా గుర్తించిన భాషలు అనేకం ఉన్నాయి. జాతీయ భాష లేనే లేదు. ఏడెనిమిది దశాబ్దాల్లో లేని జాతీయ భాష అవసరం ఇప్పుడెందుకు వచ్చింది? అన్న ప్రశ్నకు అమిత్ షా, మోడీ కళ్లతో చూడండి- సమాధానం దొరికిపోతుంది.

“జనగణమన-అధినాయక జయ హే భారతభాగ్యవిధాతా!
పంజాబ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కళ వంగ వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్ఛలజలధితరంగ తవ శుభ నామే జాగే, తవ శుభ ఆశిష మాగే, గాహే తవ జయగాథా। జనగణమంగళదాయక జయ హే భారతభాగ్యవిధాతా! జయ హే! జయ హే! జయ హే! జయ జయ జయ జయ హే।। జై హింద్‌!” అని వినపడగానే లేచి నిటారుగా నిలుచుని దేశభక్తితో పొంగిపోతాం. ఇందులో “పంజాబ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కళ వంగ” అంటే ఏమిటి “భారత భాగ్యవిధాతా!”
తవ శుభ నామే హిందీ ఒక్కటేనా భారతమాతా?
మిగతా భాషల వారికి “తవ శుభ ఆశిష మాగే” ఇవ్వవా తల్లీ?
వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్ఛలజలధితరంగాల్లో అన్ని భాషలు జనగణమన గణగణమంటూ మోగవా అధినాయకా?

-పమిడికాల్వ మధుసూదన్

Also Read : 

హిందీపై ‘అమిత’ప్రేమ

RELATED ARTICLES

Most Popular

న్యూస్