The Hidden Effort Behind Ramappas Identity :
మండలి కృష్ణారావు విద్యా సాంస్కృతిక శాఖ మంత్రిగా ఉండగా, తెలుగు సంస్కృతి అన్ని రంగాల్లో ఒక కొత్త వెలుగు వెలుగుతుండగా జరిగిన నాటి ముచ్చట. బాలల కోసం ప్రత్యేకంగా ‘బాలల అకాడమీ‘, రేడియో అన్నయ్య (న్యాయపతి రాఘవరావుగారు) ఆధ్యక్షతలో ప్రభుత్వ పక్షాన ఏర్పాటై చురుగ్గా పనిచేస్తున్న నాటి ముచ్చట.
1977లో అఖిలాంధ్రప్రదేశ్ బాలల ప్రతిభాపాటవ పోటీలను జయప్రదంగా నిర్వహించారు. మొదట జిల్లాల స్థాయిలో, తర్వాత రాష్ట్ర స్థాయిలో… అన్ని జిల్లాల నుంచి విజేతలైన పిల్లలు… ముగింపు ఉత్సవం అయ్యాక, సెక్రెటరీ బుడ్డిగ సుబ్బరాయన్ ఒక ప్రతిపాదన చేశారు. పిల్లలందరినీ ఒక ఆర్ టీ సీ లగ్జరీ బస్సులో (అప్పటికదే గొప్ప) మొత్తం రాష్ట్రం లోని దర్శనీయ స్థలాలు అన్నిటినీ చూపిద్దామని! దాన్ని డాక్యుమెంటరీ చలన చిత్రంగా చిత్రిద్దామని పెకేటి శివరాం గారి సలహా. మండలిగారు కదా! మంచి ఆలోచన అయితే ఆలస్యం ఏముంది? ప్రభుత్వంలో డా.అంతటి నరసింహంగారు సాంస్కృతిక వ్యవహారాల ప్రత్యేక అధికారి… చురుగ్గా ప్రతిపాదన కార్యరూపంలోకి వచ్చింది. దాదాపు 28 రోజులు అనుకొంటా, ‘ఆంధ్రప్రదేశ్ దర్శన్’ డాక్యుమెంటరీ టూర్.. 75లో ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా, అప్పటికి తాను తెలుగు భాషా సమితి విజ్ఞానసర్వస్వాల్లో సహాయ సంగ్రాహకుడిగా పొందిన అనుభవం, సేకరించిన సమాచారం ఆధారంగా ‘ఆంధ్రప్రదేశ్ దర్శని’ Andhrapradesh Almanac పేరుతో రెండు పుస్తకాలను వెలువరించి ఉన్నారు సుబ్బరాయన్. అవి తెలుగు సంస్కృతిపై మినీ విజ్ఞాన సర్వస్వాలు. ఇంకేం! ఆ అనుభవం నేపథ్యంలో ప్లానింగ్ పక్కాగా జరిగింది. శ్రీకాకుళం జిల్లానుంచి, అనంతపురం జిల్లా లేపాక్షి దాకా!
ఆ సందర్భంగా ఏర్పాటయింది రామప్ప గుడిలో ఒక వెన్నెల రాత్రి ప్రత్యేక కార్యక్రమం, లైట్ అండ్ షాడో టెక్నిక్ తో రూపొందించిన పేరిణి నృత్య కార్యక్రమం. అంతకు ఓ మూడేళ్ళ మునుపే (74 లో కాబోలు) భరతర్షి నటరాజ రామకృష్ణ గారు అక్కడి శిల్పాల ఆధారంగా పేరిణి నృత్య శైలిని పునరావిష్కరించారు. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగానే కాబోలు వేయి స్తంభాల గుడిలో ఘనంగా ప్రదర్శించారు. మళ్లీ ఇప్పుడు అంతే భారీ సంరంభంతో…అదో చారిత్రాత్మక సంఘటన. ఎక్కడైనా శివరాం గారి దర్శకత్వంలో వచ్చిన డాక్యుమెంటరీని చూస్తే అర్థమౌతుంది….అవి తెలుగు సంస్కృతికి నిత్యం వెలుగు పండుగ రోజులు..ప్చ్.. మళ్లీ రావు!
ఆ తర్వాత కొద్దికాలానికి ఊపందుకుంది రామప్ప ఆలయ పునరుద్ధరణ ఉద్యమం. ఆతర్వాత ఎప్పుడో 2000లో వెళ్తే, ఎక్కడో బీడుపడ్డ చోట ఓ శిథిల రాళ్ళ మందిరం. ఒకచోట క్రుంగుబారి!… ఈ నల్లని రాలలో ఏ కన్నులు ఏడ్చునో అని పాడుకోడానికి!…
కాకతీయుల కాలంలో మూడు రకాల శిల్ప శైలులు వికాసం పొందాయి.
- అటు ఓఢ్ర దేశం గుండా, కాకతీయుల పరాక్రమ విక్రమంతో వచ్చిన సరళ ఔత్తరాహ శైలి.
- ఇటు కన్నడ రాష్ట్రకూట సంబంధంగా వారసత్వంగా వచ్చిన అతి సూక్ష్మపు సంక్లిష్ట (intricate) పనితనంతో కూడిన హొయసల శైలి.
- నడుమ పల్లవ వారసత్వంగా తెలుగునాట పరిఢవిల్లిన ‘ఆంధ్రశైలి’.
మూడింటిని సమ వైభవంతో సమన్వయించి వెలిగిపోయింది కాకతీయ ప్రభ. ‘సమగ్ర ఆంధ్రప్రభ’ కు చరిత్రలో పర్యాయపదంగా మిగిలింది. సరిగ్గా, సూక్ష్మంగా పరిశీలించి చూడండి: ఈ మూడు కళాశైలుల ‘త్రివేణీ సంగమం’ మనకు సాహిత్యంలోనూ అగుపడదూ! ఇటు తిక్కనగారి భారతంలోనైనా, అటు విద్యానాథుని ప్రతాపరుద్ర యశోభూషణంలో నైనా!
శిల్పంలో ఒక కళాశైలి ఘనీభూతమై సాక్షాత్కరిస్తే, సాహిత్యంలో ద్రవీభూతమై చిరంతనంగా ప్రవహిస్తుంటుంది. ఏ కళా మాధ్యమంలో ఎటు మారుతున్నా, శైలి మాత్రం ఒక చారిత్రక యుగీన చేతనను నిశ్శబ్దంగా ప్రతిఫలిస్తుంటుంది.
–గంగిశెట్టి లక్ష్మీనారాయణ
(సిరికోన సౌజన్యంతో)
ప్రముఖులతో రామప్ప టూర్-
ఒక యాది
ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని పురస్కరించుకొని 2009 లో వరంగల్ కు చెందిన ప్రముఖ సాహితీ వేత్తలు, చరిత్రకారులు, కవులు, ఆచార్యులతో కలసి రామప్ప ఆలయ సందర్శన జరిగింది. అక్కడే ఆలయ ప్రాంగణంలో ఇంటాక్ ఆధ్వర్యంలో వరల్డ్ హెరిటేజ్ డేను నిర్వహించాం. రామప్ప వెళ్లిన వారిలో నాతోపాటు ఈ చిత్రంలోని వారందరికీ గురువువైన ప్రముఖ చరిత్రకారులు దెందుకూరి సోమేశ్వర్ రావు, ఆచార్య కోవెల సుప్రసన్నా చార్య, అంపశయ్య నవీన్, ప్రొఫెసర్ పాండు రంగా రావు, విశ్రాంత ఐఏఎస్ అధికారి బి.వి.పాపారావు, ప్రొఫెసర్ బన్నా ఐలయ్య, నాగిళ్ల రామ శాస్త్రి, వి.ఆర్.విద్యార్థి, గుమ్మడి జనార్దన్, డా. శ్రీధర్, అప్పటి టూరిజం అధికారి మహేష్ తదితరులున్నారు .
-కన్నెకంటి వెంకట రమణ
Also Read : అంతర్జాతీయ ఖ్యాతి ఎవరిగొప్ప?