Sunday, January 19, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంకొరటాల ఒక్కడిదేనా తప్పు?

కొరటాల ఒక్కడిదేనా తప్పు?

By Whom: గెలుపు గెలుపే. ఓటమి ఓటమే. అలాగే సినిమాలకు కూడా సక్సస్ సక్సస్సే. ఫెయిల్యూర్ ఫెయిల్యూరే. ఆచార్య సినిమా వైఫల్యాన్ని ఎవరు మోయాలి? అన్నదే ప్రశ్న.

ఒక్కో దర్శకుడికి ఒక్కో శైలి ఉంటుంది. కోట్ల కోట్ల సంపదను కాలదన్ని…కాలికి చెప్పులు కూడా లేకుండా సమాజాన్ని బాగుచేసే పనిలో ఆనందాన్ని వెతుక్కునే శ్రీమంతులు, మహర్షులు కొరటాల సినిమాకు హీరోలు. సకల చట్టాలను తుంగలో తొక్కినా హీరో గ్యారేజ్ లో జనతకు సామాజిక స్పృహ దొరుకుతూ ఉంటుంది. లైవ్ టెలికాస్ట్ సాక్షిగా హీరో భరతనే నేను అని చిటికెలు వేస్తుంటే…పల్లెల్లో గ్రాఫిక్స్ రోడ్లు వాటంతటవే పడిపోతూ ఉంటాయి.  నిజ జీవితంలో ఇలా చిటికెలు వేస్తే ఓట్లు పడతాయా? రోడ్లు పడతాయా? ఒక అభ్యర్థిని ఏడిపిస్తున్న సొంతపార్టీ ఎం ఎల్ ఏ మనుషులను చావగొట్టి రావడానికి ముఖ్యమంత్రి హెలిక్యాప్టర్ వేసుకుని వెళ్లి వస్తున్నాడా? అన్నది…ఆ క్షణానికి ప్రేక్షకుడికి తోచదు.

సినిమా ఒక కల్పన. అక్షరాలా వ్యాపారం. అందులో సందేశం దేవాతావస్త్రం. ఒక్కోసారి సందేశం బై ప్రాడక్ట్ గా దొరకవచ్చు. దొరకకపోవచ్చు.

ఎర్రచందనం స్మగ్లర్ పుష్పలో ఏ నీతి సందేశం ఉంది? అటవీ, సివిల్ చట్టాలను, వ్యవస్థలను తగ్గకుండా కాలితో తంతే…ఆ అక్రమ ఎర్రచందనాన్ని ఆసేతు హిమాచలం ఆదరించింది.

విలన్ల తలలను సొరకాయల్లా కస కస కోసిపారేసే మిగతా దర్శకులతో పోలిస్తే కొరటాల భిన్నమయిన వారే. బయట కూడా మితంగా మాట్లాడుతూ…వివాదాలకు దూరంగా ఉంటారు. వ్యాపారసూత్రంలోనే కుదిరినంత సామాజిక చైతన్యానికి తన హీరో ద్వారా ప్రయత్నిస్తున్నందుకు అభినందించాలి. అలాంటి కొరటాల వరుస విజయాలతో దూసుకుపోతుండగా…ఆచార్య కూడా అఖండ విజయాన్ని సొంతం చేసుకోవాల్సింది పోయి…ఎందుకు ఎదురు తన్నింది?

ఎవరు అవునన్నా కాదన్నా చిరంజీవి తెలుగు తెర పట్టనంతగా ఎదిగిపోయారు. ఇప్పుడు చిరంజీవితో సినిమా అంటే దర్శకులకు కూడా సవాలే. ఒక వయసు వచ్చాక ఆ వయసుకు సరిపోయే పాత్రల్లోకి ఒదిగి…అమితాబ్ హీరోగా మరో మెట్టు పైకి ఎగబాకారు. తెలుగులో వెంకటేష్, జగపతిబాబు కొంతవరకు అలా తమను తాము మలచుకున్నారు. మి మ్మీ మిమ్మిమ్మి…ఇకపై ఓన్లీ యు అండ్ మీ…అంటూ పదహారేళ్ళ పడుచు పిల్లతో చిరంజీవి డ్యాన్స్ చేయాల్సిన హీరోయిక్ కంపల్షన్ ఏర్పడింది. దాంతో అడవిలో అన్న పాత్ర అయినా…లాహే లాహే…అని కొండా కోనల్లో స్టెప్పులేస్తూ అనుబంధాలు కడతేరే డ్యాన్స్ పాఠాలు మనకు చెప్పాల్సి వస్తుంది. కథలో చిరంజీవి ఒదిగిపోయే కాలాలు పోయి…కథలు చిరంజీవిలో ఒదిగిపోయే కాలాలను దర్శకులు పట్టుకోవాల్సి వచ్చింది. అది కొంతవరకు బాగానే ఉన్నా…తరువాత్తరువాత అతకని కథలో అతుకుల బొంతలు ప్రేక్షకులకు కనపడినప్పుడు కొల్లాటరల్ డ్యామేజ్ జరుగుతుంది. ఆ డ్యామేజ్ దెబ్బ హీరోతో పాటు దర్శకుడు, నిర్మాత, రచయిత, సంగీత దర్శకుడు మిగతా అందరికి వద్దన్నా తగులుతుంది.

Failure Acharya

సైకో ఫ్యాన్స్ గొడవలను, వారి ట్రోలింగులను కాసేపు పక్కన పెట్టి...ఆచార్య అనాచార్య ఎందుకయ్యిందో స్థిమితంగా ఆలోచిస్తే కొరటాలకే కారణాలు ఒక్కొక్కటిగా తెలిసిపోతాయి. కొరటాల వెళ్లాల్సిన దూరం ఇంకా ఎంతో ఉంది. తనను తాను సమీక్షించుకోవడానికి ఆచార్య చక్కటి అవకాశం ఇస్తోంది. మనం ఆచరించదగ్గ మార్గాన్ని తను ఆచరిస్తూ…మనకు ఆ దారిని చూపేవాడే ఆచార్యుడు అని వ్యుత్పత్తి అర్థం కూడా. ఈ ‘ఆచార్య‘ ఏమి చెబుతున్నాడో తెలుసుకుంటే మరో అనాచార్య రాకుండా ఉంటుంది.

“కొడితే కొట్టాలిరా…సిక్స్ కొట్టాలి” అని ప్రతి బాల్ కు సిక్స్ కొట్టాలనే ఉంటుంది అందరికీ. అన్ని బాళ్ళు రఫ్ఫాడితే చరిత్రలో నీకో కొన్ని పేజీలు ఎలా ఉంటాయి?

-పమిడికాల్వ మధుసూదన్

Also Read : 

జాతక చిత్రం

RELATED ARTICLES

Most Popular

న్యూస్