Monsoon: ఆలస్యంగా నైరుతి రుతుపవనాలు

నైరుతి రుతుపవనాలు కాస్త ఆలస్యంగా ప్రవేశించనున్నట్లు భారత వాతావరణ శాఖ అంచనావేస్తోంది. గత రెండు సీజన్లతో పోలిస్తే ప్రస్తుతం పది నుంచి పదిహేను రోజులు ఆలస్యంగా వచ్చే అవకాశం ఉన్నట్లు ప్రాథమికంగా విశ్లేషిస్తోంది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఈ నెల రెండో వారంలో నైరుతి రుతుపవనాలు తాకనున్నాయి.

ఈనెల మొదటి వారంలో కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు క్రమంగా ముందుకు సాగుతూ ఆంద్ర, తెలంగాణకు చేరుకునేందుకు వారం రోజుల నుంచి పది రోజుల సమయం పడుతుందని అధికారులు భావిస్తున్నారు. 2021 వర్షాకాలంలో నైరుతి రుతుపవనాలు మే నెలాఖరులో కేరళను తాకగా.. జూన్‌ మూడో తేదీ నుంచి ఆరో తేదీ మధ్య తెలుగు రాష్ట్రాలను తాకాయి. అదేవిధంగా గతేడాది మే 30వ తేదీన కేరళను తాకిన రుతుపవనాలు జూన్‌ 8వ తేదీకి చేరుకున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి ఐదు రోజులు ఆలస్యంగా రానున్నట్లు వాతావరణ శాఖ అధికారులు భావిస్తున్నారు.

కాగా జూన్‌ ఒకటవ తేదీ నుంచి సెప్టెంబర్‌ 30వ తేదీ మధ్య కాలాన్ని నైరుతి సీజన్‌(వానాకాలం)గా భావిస్తారు. ఈ క్రమంలో నాలుగు నెలల్లో తెలుగు రాష్ట్రాల  వ్యాప్తంగా సగటున 75.19 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు తయారు చేసింది. అయితే గత రెండేళ్లుగా రాష్ట్రంలో సాధారణ వర్షపాతం కంటే 50 శాతం అధిక వర్షాలు కురిశాయి. 2021లో రాష్ట్రంలో 111.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, 2022 సీజన్‌లో 109.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణం కంటే అధిక వర్షాలు నమోదు కావడంతో రాష్ట్రంలో చెరువులు, కుంటలు నీటితో నిండుకుండలుగా మారాయి.

పశ్చిమ విదర్భ నుంచి మరాఠ్వాడ, ఉత్తర కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఏర్పడిన ఉపరితలద్రోణి స్థిరంగా కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది సముద్రమట్టం నుంచి సగటున 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో అక్కడక్కడా చెదురుమదురుగా, కొన్ని చోట్ల మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *